కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారు?
భోపాల్: ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని బీజేపీ ప్రకటించడంపై ఆ పార్టీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ తీవ్ర అసంతృప్తితో ఉంది. నిన్న కాక మొన్న పార్టీలో చేరిన కిరణ్ బేడీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారని ఆర్ఎస్ఎస్ నేత మోహన్ భగవత్... బీజేపీ అగ్రనేతలను ప్రశ్నించినట్లు సమాచారం. ఇది మంచి పరిణామం కాదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. బీజేపీలోని ఓ వర్గం కావాలనే కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రచారం చేస్తున్నారని మోహన్ భగవత్ ఆరోపించినట్లు సమాచారం.
పార్టీలో ఎంతో మంది సీనియర్లు ఉండగా... కిరణ్ బేడీ సీఎం అభ్యర్థి అంటూ ఎందుకు ప్రచారంలోకి వచ్చిందని సదరు నేతలను ప్రశ్నించినట్లు తెలిసింది. మోహన్ భగవత్ అసంతృప్తిపై కమలనాథులు ఒకింత ఉలిక్కిపడ్డారు. దాంతో బీజేపీ అగ్రనేతలు వెంటనే రంగంలోకి దిగారు. ఈ అంశంపై మోహన్ భగవత్ తో చర్చించేందుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి ఆగమేఘాలపై శుక్రవారం ఉదయం నాగపూర్ వెళ్లేరు. కాగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో కిరణ్ బేడీ గురువారం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.