ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో రాజ్‌నాథ్ భేటీ
న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) నేతలతో భేటీ అయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సమావేశమైన మరుసటి రోజే ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకులు భయ్యా జోషి, సురేష్ సోనిలతో రాజ్‌నాథ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ సోమవారం జరగనుండటం, అలాగే ఈనెల 16న ఓట్ల లెక్కింపు ఉండటం వంటి పరిణామాల నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించినట్టు సమాచారం. ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఆ సంస్థ సం యుక్త ప్రధాన కార్యదర్శులు దత్తాత్రేయ హోసబల్, కృష్ణ గోపాల్‌లు కూడా పాల్గొన్నారు.
కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని కచ్చితంగా బీజేపీయే ఏర్పాటు చేస్తుందని మోడీ, రాజ్‌నాథ్‌లతో భేటీ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ ధీమా వ్యక్తంచేసినట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అలాగే ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన ప్రచార వ్యూహంపైనా సంఘ్ నేతలు సంతృప్తి వ్యక్తంచేశారన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించినందుకు ఆర్‌ఎస్‌ఎస్‌కు ఈ సందర్భంగా రాజ్‌నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇది సాధారణ సమావేశమేనని, దీనికి ఎలాంటి ప్రాధాన్యతా లేదని భేటీ అనంతరం దత్తాత్రేయ వెల్లడించారు. అయితే, ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు చక్కగా కృషిచేశారని, అందువల్ల సంఘ్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకే రాజ్‌నాథ్ ఇక్కడికి వచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.