► రాష్ట్రంపై నిర్లక్ష్యం లేదు
► కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజల జల్లికట్టు కోర్కెను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సంపూర్ణ సహకారం ఇచ్చిందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆర్డినెన్స్ సలహా, రాష్ట్రపతి ఆమోదానికి కేంద్రం తోడ్పాటు వల్లనే జల్లికట్టులోని అడ్డంకులు తొలగిపోయాయని ఆమె తెలిపారు. అలాగే వర్దా తుపాను సహాయం, జల్లికట్టు సాదనలో కేంద్రానికి ఎంతమాత్రం వివక్ష లేదని ఆమె అన్నారు. చెన్నైలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జల్లికట్టు ఉద్యమం సాగుతున్న తరుణంలో సీఎం పన్నీర్‌సెల్వం ఢిల్లీకి వచ్చినపుడు ప్రధాని మోదీ ఆయన్ను కలుసుకున్నారని, అలాగే పార్లమెంటు ఉపసభాపతి తంబిదురైతో జల్లికట్టు అంశంపై తాను సైతం అనేకసార్లు మాట్లాడానని తెలిపారు.
కేవలం ఒకే ఒక్కసారి తంబిదురై సహా అన్నాడీఎంకే పార్లమెంటు బృందం ప్రధానిని కలవలేకపోవడాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని కేంద్రం దూరంగా పెట్టిందని ఆరోపించడం సబబు కాదని అన్నారు. జల్లికట్టుకై ఆర్డినెన్స్ ను తీసుకురండి, తాము సహకరిస్తామని సలహా సీఎంకు ఇచ్చింది కూడా మోదీనేనని ఆమె చెప్పారు. సలహాతో సరిపెట్టక రాష్ట్రపతి వద్ద ఆర్డినెన్స్ ఆమోదానికి కూడా మోదీ చొరవచూపారని ఆమె తెలిపారు. జల్లికట్టుపై నిషేధం విధించి రెండేళ్లు కావస్తుండగా తమిళనాడు ప్రభుత్వం ఏనాడో నిర్ణయం తీసుకుని ఉండొచ్చుకదా, జాప్యానికి కేంద్రం కారణమా అని ఆమె ప్రశ్నించారు.
జల్లికట్టు ఆర్డినెన్స్ కు సహకరించిన ప్రధాని మోదీపై తంబిదురై విమర్శలు చేయడం దురదృష్టకరమని ఆమె చెప్పారు. జల్లికట్టు ఉద్యమం చివరి రోజుల్లో సంఘ విద్రోహశక్తులు ప్రవేశించాయనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. జాతీయ పతాకాన్ని దగ్ధం చేయడం, మోదీ దిష్టిబొమ్మ దహనాలు ఎవరిపని అని ఆమె ప్రశ్నించారు. అల్లర్లకు కారణమైన వారిని గుర్తించేందుకు జరుగుతున్న విచారణలో వాస్తవాలు వెలుగుచూడగలవని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
పోలీసులు తప్పు చేసి ఉంటే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. వర్దా తుపాను సహాయక చర్యల్లో సైతం కేంద్రం రాష్ట్రాన్ని పక్కన పెట్టిందని విమర్శలు సత్యదూరమని పేర్కొన్నారు. స్పష్టమైన ఆరోపణలు చేస్తే జవాబు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే ప్రగతిశీల భారత్ సాధ్యమని అన్నారు. జల్లికట్టుకు తాము ఆమోదం తెలిపామని తమిళ కాంగ్రెస్ చెప్పడం శోచనీయమని అన్నారు. నిషే«ధానికి కారణమైన కాంగ్రెస్ అనుమతి ఎలా ఇవ్వగలదని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. అద్దాల భవనంలో కూర్చుని ఎదుటి వారిపై రాళ్లు విసరడం క్షేమం కాదని ఆమె హితవు పలికారు.