బీజేపీ ఎంపీలపై అమిత్ షా తీవ్ర ఆక్రోశం!
న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలకు డుమ్మా కొట్టిన బీజేపీ ఎంపీలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా మందలించారు. సభకు దూరంగా ఉన్న మంత్రులు, ఎంపీలకు గట్టి క్లాస్ ఇచ్చారు. సోమవారం జరిగిన రాజ్యసభ సమావేశాలకు దాదాపు 30మంది ఎన్డీయే ఎంపీలు డుమ్మా కొట్టడంతో కేంద్ర ప్రభుత్వానికి పెద్దలసభలో తీవ్ర ఇబ్బందికర పరిణామం ఏర్పడింది. అధికారపక్షం బేంచిలు ఖాళీగా ఉండటంతో వ్యూహాత్మకంగా పావులు కదిపిన ప్రతిపక్ష సభ్యులు వెనుకబడిన తరగతుల వారి బిల్లులో కీలక మార్పులు ప్రతిపాదించగలిగారు. ఈ పరిణామంతో అధికారపక్షం బిత్తరపోయింది.
ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఎంపీలతో సమావేశమైన షా.. 'ప్రజాస్వామ్యానికి ఇది మంచి పరిణామం కాదు. సభలో ప్రాతినిధ్యం వహించాలని ప్రజలు మిమ్మల్ని పంపించారు. ఇది తప్పుడు సందేశాన్ని పంపుతుంది' అని డుమ్మా కొట్టిన ఎంపీలపై ఆక్రోశం వ్యక్తం చేశారు. పెద్దలసభకు గైర్హాజరైన ఎంపీలందరితోనూ వ్యక్తిగతంగా తాను సమావేశమై మాట్లాడుతానని చెప్పారు. పార్లమెంటు సమావేశాలకు అన్నివేళల కచ్చితంగా హాజరుకావాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతవారం ఎంపీలకు సూచించారు.
ఆయన ఇలా సూచించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనే ఇదేవిధంగా పార్టీ ఎంపీలకు ఆయన గట్టిగా చెప్పారు. ప్రభుత్వ బిల్లులను ఆమోదించుకోవడం అధికారపక్ష ఎంపీల కర్తవ్యమని, మధ్యాహ్న భోజనం కాగానే ఎంపీలు సభకు డుమ్మా కొట్టడం సరికాదని గతవారమే మోదీ బీజేపీ సభ్యులకు హితబోధ చేశారు. అయినా, కమలం ఎంపీలు సోమవారం పెద్ద ఎత్తున డుమ్మా కొట్టడం పెద్దల సభలో అధికారపక్షాన్ని ఇరకాటంలో పడేసింది.