
మా చట్టాన్ని చంపేస్తున్నారు
-
భూ సేకరణ బిల్లుపై లోక్‌సభలో రాహుల్ ధ్వజం
మీకు రైతుల భూములే కావలసి వచ్చిందా? - బిల్లు ఆమోదించటం మీరనుకున్నంత తేలిక కాదు
న్యూఢిల్లీ: ‘సూటు బూటు వేసుకున్న దొంగలు పట్టపగలే దోపిడీకి తెగబడుతున్నారు.. తమ మిత్రులైన పెట్టుబడిదారులకు.. పారిశ్రామిక వేత్తలకు దోచుకున్న భూమిని కట్టబెట్టాలని చూస్తున్నారు.. మేం రెండేళ్లు కష్టపడి చట్టాన్ని చేస్తే.. మీరు కొన్ని రోజుల్లో చంపేయాలని చూస్తారా? భూసేకరణ బిల్లును ఆమోదింపజేసుకోవటం అంత తేలికేమీ కాదు.. ఒకవేళ పార్లమెంటులో విఫలమైతే దేశ వీధుల్లో తేల్చుకుంటాం’.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మోదీ సర్కారుపై ఘాటుగా చేసిన వ్యాఖ్యలివి. మునుపెన్నడూ లేని విధంగా ఉద్వేగంతో.. ఉత్సాహంతో.. చమక్కులు.. ఛలోక్తులతో మోదీ సర్కారుపై రాహుల్ విరుచుకుపడ్డారు. మంగళవారం లోక్‌సభలో భూసేకరణ బిల్లుపై జరిగిన చర్చలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పక్షాన రాహుల్ మాట్లాడారు. బిల్లును హడావుడిగా ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, అది అంత తేలికైన పనేమీ కాదని అన్నారు.
బిల్లుపై మాట్లాడేందుకు రాహుల్ నిలుచోగానే అధికార పక్షం నుంచి ఎద్దేవా చేస్తూ నినాదాలు వినిపించాయి. కానీ, రాహుల్ సంయమనంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘చాలామంది ఎంపీలు ఏ షాపింగ్‌కో, భోజనానికో వెళ్తారని భావించా.. చివరకు ఖాళీ బెంచీలను ఉద్దేశించి మాట్లాడాల్సి వస్తుందనుకున్నా. కానీ నా ప్రసంగం వినడానికి ఇందరు బీజేపీ ఎంపీలు వచ్చినందుకు కతజ్ఞతలు’ అని అన్నారు. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన మంత్రి బీరేంద్ర సింగ్ గతంలో తమ పార్టీ సహచరుడని. బిల్లు విషయంలో ఆయన తనతో ఎప్పుడూ ఏకీభవించారని, ఇప్పుడు పార్టీ మారగానే వైఖరీ మారిందన్నారు.
వేగంగా అభివద్ధి కోసమే భూసేకరణ బిల్లును సవరిస్తున్నామన్న ప్రభుత్వ వాదనను తిరస్కరించారు. ఓ ఆర్టీఐ సమాధానాన్ని ఉటంకిస్తూ.. దేశంలో 8 శాతం ప్రాజెక్టులు మాత్రమే భూములు లేక పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వాస్తవానికి ప్రభుత్వానికి భూ కొరత లేనే లేదని..ప్రత్యేక ఆర్థిక మండళ్ల దగ్గర వినియోగించకుండా 40 శాతం భూమి ఉందని, ప్రభుత్వభూములూ ఉన్నాయని.. అయినా రైతుల భూములే మోదీ సర్కారుకు కావలసి వచ్చిందనిఆక్షేపించారు. ‘ఈ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకం.. పేదలకు వ్యతిరేకం. బుందేల్‌ఖండ్ లాంటి కొండ ప్రాంతాలు.. ఎడారి ప్రాంతాల్లో ఈ ప్రభుత్వం భూసేకరణ చేయదు. నోయిడా, గుర్‌గావ్, పుణె లాంటి వాణిజ్య నగరాల్లో ధరలు గణనీయంగా పెరిగే ప్రాంతాల్లో మాత్రమే భూమిని సేకరించి బడాబాబులకు కట్టబెట్టాలని చూస్తోంది’ అని రాహుల్ తీవ్రంగా విమర్శించారు. ‘మీ కాళ్ల కింద బంగారాన్ని వీళ్లు లాక్కుపోవాలని చూస్తున్నార’ని అన్నారు. భూసేకరణ బిల్లును చట్టంగా తీసుకురావటానికి తమకు రెండేళ్లు పట్టిందని.. ఎన్డీయే సర్కారు కొన్ని రోజుల్లోనే దాన్ని చంపేయాలని చూస్తోందన్నారు.
ఆయనింకా ఏమన్నారంటే..
భూ సేకరణలో రైతుల అనుమతి తీసుకోవాలన్న నిబంధనను తొలగించటం ద్వారా చట్టం గొంతుపై తొలి గొడ్డలి వేటు పడింది. సామాజిక ప్రభావ అంచనా నియమాన్ని తీసేసి రెండో వేటు వేశారు.
అయిదేళ్ల లోగా తీసుకున్న భూమిలో ఏ ప్రాజెక్టు రాకపోతే.. ఆ భూమిని తిరిగి రైతుకు ఇచ్చేయాలన్న నిబంధనను తొలగించారు. భూమిని తీసుకుని 10 లేదా 20 లేదా 50 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా భూమిని రైతులకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేసి చట్టంపై మూడో వేటు వేశారు.
అద్వానీ, సుష్మాస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్ లాంటి బీజేపీ నేతలు 2013లో మేము ఇవాళ కూర్చున్న ప్రతిపక్ష బెంచీల్లో కూచుని.. బల్లలను చరచి మరీ యూపీఏ చట్టాన్ని సమర్థించారు. మరి ఇప్పుడు వాళ్ల వైఖరి ఎందుకు మారిందో అర్థం కావటం లేదు. బహుశా వారి మనసైనా మారి ఉండాలి.. లేదా దేని కోసమో భయపడుతూ ఉండాలి...
కాగా, బిల్లుపై ఇతర పార్టీల సభ్యులు కూడా మాట్లాడారు. సుదీప్ బందోపాధ్యాయ(తణమూల్), సలీం(సీపీఎం) తదితరులు ప్రభుత్వం దేశ సహజ ఆస్తులను పెట్టుబడిదారులకు అమ్ముకుంటోందన్నారు.
జాయింట్ పార్లమెంటరీ కమిటీకి భూ బిల్లు
విపక్షాల వ్యతిరేకత నేపథ్యంలో భూసేకరణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త కమిటీకి(జేపీసీ) నివేదించేందుకు నిర్ణయం తీసుకుంది. ఉభయసభల్లోని 30 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తారు. వర్షాకాల సమావేశాల తొలి రోజున కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. భూ బిల్లుపై జరిగిన చర్చలో బీజేపీకి టీడీపీ, ఎల్జేపీ వంటి కొన్ని పక్షాలు తప్ప దన్నుగా నిలిచే వారే లేకుండా పోయారు. బీజేపీ మిత్రపక్షాలైన శివసేన, అకాలీదళ్‌లు కూడా విపక్షాల సరసన చేరి జేపీసీకి పట్టుబట్టడంతో ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. అంతకు ముందు గ్రామీణాభివద్ధి మంత్రి బీరేంద్రసింగ్ మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒక్క సవరణ కూడా చేపట్టలేదని పునరుద్ఘాటించారు. రాహుల్ వ్యాఖ్యలకు జవాబిస్తూ ఢిల్లీ చుట్టుపక్కల ప్రత్యేక ఆర్థిక మండళ్ల కోసం వ్యాపార సంస్థలు సేకరించిన భూముల్లో 40 శాతం ఖాళీగా ఉన్న మాట వాస్తవమేనన్నారు.
సెలెక్ట్ కమిటీకి జీఎస్టీ..: జీఎస్టీ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేందుకు ప్రభుత్వం అంగీకరించింది 21మందితో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు.