కీలక బిల్లులే దిక్సూచి...
⇒ జీఎస్‌టీ, భూసేకరణ బిల్లుల్లో ఏ ఒక్కటి ఆమోదం పొందినా ర్యాలీ
⇒ హిందుస్థాన్ యూనీలీవర్, పీఎన్‌బీ, హీరోమోటో ఫలితాలవైపు చూపు
న్యూఢిల్లీ: కొద్దివారాల నుంచి డౌన్‌ట్రెండ్‌లో వున్న స్టాక్ మార్కెట్ ఈ వారం పార్లమెంటు పరిణామాలు, మలివిడత కార్పొరేట్ ఫలితాల ఆధారంగా కదులుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు కూడా ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని వారు చెపుతున్నారు. గతవారం మార్కెట్ ముగిసిన మరుసటి రోజున వెల్లడైన ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాల డేటాకు ఈ సోమవారం ట్రేడింగ్ ప్రారంభసమయంలో మార్కెట్ స్పందిస్తుంది.
ఈ కారణంగా తొలుత ఈ కౌంటర్లపై ఇన్వెస్టర్లు దృష్టినిలుపుతారని, అటుతర్వాత పార్లమెంటు సమావేశాలవైపు వారి చూపు మళ్లుతుందని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అన్నారు. ప్రస్తుత సమావేశాల్లో కీలకమైన ఒక బిల్లు అయినా ఆమోదం పొందుతుందో లేదో చూడాల్సివుందన్నారు. పార్లమెంటు ముందు వున్న జీఎస్‌టీ, భూసేకరణ బిల్లుల్లో ఏ ఒక్కటి ఆమోదం పొందినా, బుల్స్‌లో ఉత్సాహం నెలకొని, మార్కెట్ ర్యాలీ సాగించవచ్చని మరో బ్రోకరు అంచనావేశారు.
విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను నోటీసులు జారీచేయడం, కొన్ని కీలక కార్పొరేట్ల ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపర్చడం, రుతుపవనాలు నిరాశ కల్గిస్తాయన్న అంచనాలు వంటి అంశాలతో మార్కెట్లో లాభాల స్వీకరణ జరిగింది. దాంతో క్రితం వారం బీఎస్‌ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా నష్టపోయంది. అయితే కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)పై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గత గురువారం పార్లమెంటులో ఇచ్చిన వివరణ కారణంగా ఈ వారం మార్కెట్లో ర్యాలీ జరగవచ్చని సీఎన్‌ఐ రీసెర్చ్ సీఎండీ కిషోర్ ఓస్త్వాల్ చెప్పారు. ఈ వారం ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్ యూనీలీవర్, పంజాబ్ నేషనల్ బ్యాంక్; హీరో మోటో కార్ప్ తదితర కార్పొరేట్లు క్యూ4 ఆర్థిక ఫలితాల్ని ప్రకటించనున్నాయి. ఇవి కూడా మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తుందని నిపుణులు పేర్కొన్నారు.
4 నెలల కనిష్టస్థాయికి ఎఫ్‌ఐఐ పెట్టుబడులు
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐలు) పెట్టుబడులు ఏప్రిల్ నెలలో నాలుగు నెలల కనిష్టస్థాయికి తగ్గాయి. పన్ను నోటీసుల జారీ నేపథ్యంలో గత నెలలో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు రూ. 15,000 కోట్లకే పరిమితమయ్యాయి. ఏప్రిల్ నెలలో వారు రూ. 11,721 కోట్ల విలువైన షేర్లను, రూ. 3,612 కోట్ల రుణపత్రాల్ని నికరంగా కొనుగోలుచేయడంతో మొత్తం పెట్టుబడులు రూ. 15,333 కోట్లకు చేరినట్లు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ డేటా వెల్లడిస్తున్నది.