న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ రానున్న త్రైమాసికాల్లో పటిష్ట వృద్ధి రేటును నమోదుచేసుకుంటుదన్న విశ్వాసాన్ని ఇండస్ట్రీ చాంబర్– పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ ప్రదీప్ ముల్తానీ వ్యక్తం చేశారు. పీహెచ్‌డీసీసీఐ ట్రాక్ చేసే 12 ప్రధాన ఆర్థిక, వాణిజ్య ఇంటికేటర్లలో తొమ్మిది 2021 సెప్టెంబర్‌లో (2020 సెప్టెంబర్‌తో పోల్చితే) మంచి పురోగతిలో ఉన్నాయని, 2021 ఆగస్టులో పోల్చితే 2021 సెప్టెంబర్‌లో ఆరు రంగాలు మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయని ముల్తానీ పేర్కొన్నారు.
జీఎస్‌టీ వసూళ్లు, స్టాక్ మార్కెట్, యూపీఐ లావాదేవీలు, ఎగుమతులు, మారకపు విలువ, విదేశీ మారకద్రవ్య నిల్వలు, రిటైల్– టోకు ద్రవ్యోల్బణం, ఉపాధి కల్పన, వంటి అంశాలు 2021 ఆగస్టులో పోల్చితే 2021 సెప్టెంబర్‌లో ఎంతో పురోగతి సాధించినట్లు తెలిపారు. ప్రత్యేకించి నిరుద్యోగ సమస్య ఆగస్టులో 8.3 శాతం ఉంటే, సెప్టెంబర్‌లో 6.9 శాతానికి తగ్గినట్లు తెలిపారు.
సవాళ్లు ఉన్నాయ్..
కాగా, సానుకూల అంశాలతోపాటు ప్రస్తుతం ఉన్న సమస్యల్లో కమోడిటీ ధరల తీవ్రత ఒకటికాగా, మరొకటి ముడి పదార్థాల కొరతని తెలిపారు. ఈ రెండు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం ద్వారా దేశంలో వినియోగం, ప్రైవేటు పెట్టుబడులకు మద్దతు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గృహ వినియోగం మరింత పటిష్టం కావాల్సి ఉందని అన్నారు. దీనివల్ల డిమాండ్, పారిశ్రామిక ఉత్పత్తి మెరుగుపడతాయని తెలిపారు. ఆగస్టు 31వ తేదీన విడుదలైన గణాంకాల ప్రకారం, 2021–22 మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 20.1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment