మార్కెట్లో ‘యోగి’ ప్రకంపనలు!
⇔ భవిష్యత్ సంస్కరణలపై ఆందోళన
⇔ లాభాల స్వీకరణకు చాన్స్: నిపుణులు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పగ్గాలను అతివాదిగా ముద్రపడిన యోగి ఆదిత్యనాథ్‌కు అప్పగించడం ఈ వారం స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించనున్నదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అత్యధిక జనాభా ఉన్న యూపీ రాష్ట్ర సీఎంగా యోగి ఎన్నికైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ భవిష్యత్ సంస్కరణలపై మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపవచ్చని, లాభాల స్వీకరణ చోటు చేసుకోవచ్చని భయాలు నెలకొన్నాయి.
అయితే జీఎస్‌టీ అమలుకు సంబంధించి పురోగతి స్టాక్ మార్కెట్ గమనాన్ని నిర్దేశిస్తుందని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డాలర్‌తో రూపాయి మారకం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ ఆర్థిక గణాంకాలు .. తదితర అంశాలు కూడా ఈ వారం మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులంటున్నారు.
మార్కెట్ ముందుకే..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచినా, గత వారం స్టాక్ మార్కెట్ పట్టించుకోలేదని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ అభ్నిశ్ కుమార్ సుధాంశు పేర్కొన్నారు. యూపీలో బీజేపీ భారీ విజయంతో సంస్కరణలపై ఆశలతో మార్కెట్ ముందుకే సాగిందని, రూపాయి కూడా బలపడిందని పేర్కొన్నారు. మౌలిక, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్ రంగాలకు సంబంధించిన సంస్కరణల వార్తలతో స్టాక్ సూచీలు మరింత జోరుగా ముందుకెళతాయని ఆయన అంచనా వేస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు కొనసాగితే మా ర్కెట్లో సానుకూల సెంటిమెంట్ నెలకొంటుందన్నా రు.
వ్యాల్యూయేషన్లు అధికంగా ఉన్నప్పటికీ.. విదేశీ, దేశీ ఇన్వెస్టర్లు గత వారంలో జోరుగా కొనుగోళ్లు జరిపారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ప్రస్తుతద్రవ్యోల్బణ పరిస్థితులను బట్టి చూస్తే, సుదీర్ఘకాలం ఆర్‌బీఐ తటస్థ విధానాన్ని అనుసరించే అవకాశం ఉందన్నారు. వివిధ రంగాలపై జీఎస్‌టీకి సంబంధించిన రేట్లపై మార్కెట్ దృష్టి పెడుతుందని, దీన్నిబట్టి ఆయా రంగాల్లోని షేర్ల కదలికలు ఉంటాయని తెలిపారు.