రుతుపవనాల విస్తరణ కీలకం..!
♦ జీఎస్‌టీకి సంసిద్ధత కూడా...
♦ మార్కెట్ అక్కడక్కడే
♦ షేర్ల వారీ కదలిలు ఉంటాయ్
♦ ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అభిప్రాయాలు
న్యూఢిల్లీ: ఈ వారం ఎలాంటి ప్రధాన సంఘనలు లేనందున రుతుపవనాల విస్తరణ, జీఎస్‌టీ అమలుకు దేశం ఎలా సిద్ధమవుతుందనేవి ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకాంశాలు కానున్నాయని నిపుణులంటున్నారు. వచ్చే నెల 1 నుంచి వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) అమల్లోకి వస్తోన్న విషయం తెలిసిందే. వీటితో పాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గమనం.. ఈ అంశాలు కూడా తగిన ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంటున్నారు.
పరిమిత శ్రేణిలోనే మార్కెట్..
ఈ వారం మార్కెట్లో పెద్దగా ఒడిదుడుకులు చోటు చేసుకోబోవని అమ్రపాలి ఆధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ డైరెక్టర్ అభ్నిశ్ కుమార్ సుధాంశు చెప్పారు. అయితే జీఎస్‌టీ అమలు తేదీ దగ్గరకు వచ్చిన నేపథ్యంలో జీఎస్‌టీకి సంబంధించిన పరిణామాలు స్టాక్ మార్కెట్ సూచీల కదలికలపై ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రుతుపవనాలు ఎలా విస్తరిస్తాయోనన్న అంశం కూడా మార్కెట్ కదలికలకు కీలకం కానున్నదని వివరించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలోనే కదలాడుతాయని ఆయన విశ్లేషించారు.
ఈ వారం ఎలాంటి ప్రధాన సంఘటనలు లేనందున స్టాక్ మార్కెట్లో షేర్ల వారీ కదలికలే ఉంటాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డైరెక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. సమీప భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులున్నాయని, అయితే అవి ఏవీ ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ను ప్రభావితం చేసేవి కావని మార్నింగ్‌స్టార్ ఇండియా సీనియర్ ఎనలిస్ట్ హిమాంశు శ్రీవాత్సవ చెప్పారు. ఈక్విటీలు, రూపాయి మారకం విలువ పెరుగుతున్నాయని, ఇది విదేశీ ఇన్వెస్టర్లు లాభాల స్వీకరించడానికి మంచి అవకాశమని పేర్కొన్నారు.
మూడు ఐపీఓలు..: ఇక ఈ వారంలో మూడు కంపెనీలు ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ద్వారా నిధులు సమీకరించనున్నాయి. గత శుక్రవారం మొదలైన ఎరిస్ లైఫ్ సైన్సెస్ ఊపీఓ ఈ మంగళవారం(ఈ నెల 20న) ముగియనున్నది. ఈ ఐపీఓ ధర శ్రేణి రూ.600–603గా ఉంది. నేటి(సోమవారం) నుంచి సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్(సీడీఎస్‌ఎల్) ఐపీఓ రానున్నది. ఈ ఐపీఓ ధర శ్రేణి రూ.145–149గా ఉంది. ఇక బుధవారం(ఈ నెల 21న) జీటీపీఎల్ హాత్‌వే ఐపీఓ ప్రారంభం కానున్నది. రూ.167–170 ధర శ్రేణిలో ఉన్న ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.300 కోట్ల వరకూ సమీకరించాలని యోచిస్తోంది.
కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల జోరు
భారత క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ)మన క్యాపిటల్ మార్కెట్లో 355 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టారు. వీటిల్లో అధిక భాగం డెట్ మార్కెట్లోకి రావడం విశేషం. జీఎస్‌టీ రేట్లు ఖరారు కావడం, వర్షాలు బాగానే కురుస్తాయన్న అంచనాలు దీనికి ప్రధాన కారణాలు. డిపాజిటరీల గణాంకాల ప్రకా రం, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెల 16 వ తేదీ వరకు మన స్టాక్ మార్కెట్లో రూ.4,022 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.18,821 కోట్లు వెరశి మన క్యాపిటల్ మార్కెట్లో రూ. 22,844 కోట్లు పెట్టుబడులు పెట్టారు.
ఈ ఏడాది ఫిబ్రవరి–మే కాలానికి మన క్యాపిటల్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు రూ.1.33 లక్షల కోట్లకు చేరాయి. కాగా ఈ ఏడాది జనవరిలో ఎఫ్‌పీఐలు రూ.3,496 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఎన్నికలు 2019లో రానున్నాయని, ఇంకా మిగిలిన రెండేళ్లలో కేంద్రం మరిన్ని సంస్కరణలను తీసుకొస్తుందనే అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు జోరుగా పెట్టుబడులు
పెడుతున్నారని నిపుణులంటున్నారు.