- సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేష్
- ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా
చేవెళ్ల: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భూ సేకరణ బిల్లును ఉపసంహరించుకునేంతవరకు పోరాడుతూనే ఉంటామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ పేర్కొన్నారు. భూ సేకరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన జైల్‌భరో కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలమల్లేష్ మాట్లాడుతూ.. పచ్చని పంట పొలాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికే భూ సేకరణ బిల్లు రూపొందించారని పేర్కొన్నారు. భూములను లాక్కొని కంపెనీలకు, బడా వ్యాపారులకు అప్పగిస్తే రైతుల మనుగడ ఎక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటికే పంటలు నష్టపోయి, గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇక ఉన్న వ్యవసాయ భూములను తీసుకునే చట్టాలను చేస్తే ఎలా బతుకుతారన్నారు. రైతుల సంక్షేమ ప్రభుత్వాలుగా చెప్పుకుంటున్న ప్రభుత్వాలు భూసేకరణ బిల్లును తీసుకురావడంలో అర్థం ఏమిటన్నారు. ఆర్డీఓను కార్యాలయం లోపలికి వెళ్లకుండా గేటు ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారిని పోలీసులు అరెస్టుచేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు పాలమాకుల జంగయ్య, ప్రభులింగం, నియోజకవర్గ కార్యదర్శి కె.రామస్వామి, చేవెళ్ల, శంకర్‌పల్లి, షాబాద్ మండలాల కార్యదర్శులు ఎం.బాలయ్య, సుబాన్‌రెడ్డి, జంగయ్య, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్.సత్యనారాయణ, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మ, నాయకులు మగ్బూల్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ బిల్లును ఉపసంహరించుకోవాలి.
Published Fri, May 15 2015 12:31 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement