CPI District Committee
-
సామాజిక న్యాయానికి సమాధి కట్టిన కేసీఆర్
కాళోజీసెంటర్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలకు పరిమితమై సామాజిక న్యాయానికి సమాధి కట్టిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. వరంగల్ శివనగర్‌లోని తమ్మెర భవన్లో సీపీఐ వర్ధన్నపేట నియోజకవర్గ కార్యకర్తల సమావేశం టి.రహెల అధ్యక్షతన మంగళవారం జరిగింది. సమావేశానికి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దళిత, గిరిజన, బలహీన వర్గాల కోసం అనేక వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కేసీఆర్ ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదన్నారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల ఆకాంక్షలకు విరుద్ధంగా తెలంగాణ ద్రోహులను మంత్రులను చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకుంటే అందుకు విరుద్ధంగా కేసీఆర్ పాలిస్తున్నారని అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.వెంకట్రాములు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే పోతరాజు సారయ్య మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పక్కనపెట్టి నియంతృత్వ పాలన చేస్తున్న కేసీఆర్‌ను గద్దె దింపేందుకు ప్రజలు ఐక్యం కావాలన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గ నూతన కమిటీ అనంతరం వర్ధన్నపేట నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. నియోజకవర్గ కమిటీ కార్యదర్శిగా ఎలమకంటి శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా దామెర కృష్ణ, కమిటీ సభ్యులుగా పోతరాజు సారయ్య, మోతె లింగారెడ్డి, గోలి రాజిరెడ్డి, ఆరెల్లి రవి, మాలోతు శంకర్, మద్దెల ఎల్లేష్, టి.రహెలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో సీపీఐ రూరల్ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్, అర్బన్ జిల్లా సహాయ కార్యదర్శి పనాస ప్రసాద్, కార్యదర్శివర్గ సభ్యులు మేకల రవి, జిల్లా నాయకులు మోతె లింగారెడ్డి, గోలి రాజిరెడ్డి ఎలమకంటి శ్రీనివాస్, దామెర కృష్ణ, ఆరెల్లి రవి, మాలోతు శంకర్, బుస్స రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను మోసం చేసిన సర్కారు
- కలెక్టరేట్ వద్ద జైల్‌భరోలో సీపీఐ నేతలు మచిలీపట్నం (చిలకలపూడి) : భూసేకరణ విషయంలో రైతులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు డి.నిర్మల పేర్కొన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం కలెక్టరేట్ వద్ద ధర్నా, జైల్‌భరో నిర్వహించారు. నిర్మల మాట్లాడుతూ భూసేకరణ విషయంలో రైతులను వేధింపులకు గురిచేసి వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. బలవంతంగా భూములను లాక్కోవటం వల్ల రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం సీపీఐ నాయకులు కలెక్టరేట్ గేటు వద్ద నినాదాలు చేశారు. దీంతో పోలీసులు సీపీఐ నాయకులను అరెస్టు చేసి చిలకలపూడి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అఫ్జల్, పరుచూరి రాజేంద్రప్రసాద్, లింగం ఫిలిప్, జంపాన వెంకటేశ్వరరావు, గారపాటి సత్యనారాయణ, నర్రా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
భూసేకరణ బిల్లును ఉపసంహరించుకోవాలి.
- సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేష్ - ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేవెళ్ల: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన భూ సేకరణ బిల్లును ఉపసంహరించుకునేంతవరకు పోరాడుతూనే ఉంటామని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్.బాలమల్లేష్ పేర్కొన్నారు. భూ సేకరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన జైల్‌భరో కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలమల్లేష్ మాట్లాడుతూ.. పచ్చని పంట పొలాలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికే భూ సేకరణ బిల్లు రూపొందించారని పేర్కొన్నారు. భూములను లాక్కొని కంపెనీలకు, బడా వ్యాపారులకు అప్పగిస్తే రైతుల మనుగడ ఎక్కడుంటుందని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే పంటలు నష్టపోయి, గిట్టుబాటు ధరలు లభించక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇక ఉన్న వ్యవసాయ భూములను తీసుకునే చట్టాలను చేస్తే ఎలా బతుకుతారన్నారు. రైతుల సంక్షేమ ప్రభుత్వాలుగా చెప్పుకుంటున్న ప్రభుత్వాలు భూసేకరణ బిల్లును తీసుకురావడంలో అర్థం ఏమిటన్నారు. ఆర్డీఓను కార్యాలయం లోపలికి వెళ్లకుండా గేటు ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారిని పోలీసులు అరెస్టుచేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు పాలమాకుల జంగయ్య, ప్రభులింగం, నియోజకవర్గ కార్యదర్శి కె.రామస్వామి, చేవెళ్ల, శంకర్పల్లి, షాబాద్ మండలాల కార్యదర్శులు ఎం.బాలయ్య, సుబాన్‌రెడ్డి, జంగయ్య, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సీహెచ్.సత్యనారాయణ, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మ, నాయకులు మగ్బూల్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఆ యువతికి న్యాయం చేయండి
ఎమ్మెల్యే కాలె యాదయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్ చేవెళ్ల రూరల్: మండల పరిధిలోని మొండివాగు గ్రామంలో ప్రియుడి ఇంటి ఎదుట మౌనదీక్షకు దిగిన యువతికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్, మిహళా సమాఖ్య న్యాయ సలహాదారు విజయలక్ష్మి పండిట్ తదితరులు సోమవారం రాత్రి డీఎస్పీని కలిశారు. ఊరేళ్ల అనుబంధ మొండివాగుకు చెందిన హసీనాబేగంను అదేగ్రామానికి చెందిన మహ్మద్‌షఫీ ప్రేమించి పెళ్లి చే సుకునేందుకు ముఖం చాటేసిన విషయం తెలిసిందే. ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌనదీక్ష సోమవారంతో ఐదో రోజుకు చేరుకుంది. సోమవారం సీపీఐ నాయకులు, మహిళా సమాఖ్య సభ్యులు యువతికి మద్దతు తెలిపారు అనంతరం వారు డీఎస్పీని కలిసి విషయం తెలియజేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి 7 గంటల సమయంలో ఎమ్మెల్యే చేవెళ్లలో డీఎస్పీ రంగారెడ్డి, సీఐ ఉపేందర్‌ను కలిసి ఈ విషయమై చర్చించారు. ఓ యువతి తనకు న్యాయం చేయాలని దీక్ష కొనసాగిస్తున్నా స్పందించకపోవటం శోచనీయమన్నారు. న్యాయం జరిగే వరకు తాము యువతికి అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఎలాగైనా షఫీతో యువతి పెళ్లి చేయించాలని కోరారు. లేదంటే యువకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్, జిల్లా కార్యవర్గం సభ్యులు జనార్దన్, జంగయ్య, రామస్వామి, బాలయ్య, మహిళా సమాఖ్య నాయకురాళ్లు విజయలక్ష్మి పండిట్, నీలమ్మ, లక్ష్మిలు మాట్లాడారు. న్యాయం జరిగే వరకు యువతికి అండగా ఉంటామన్నారు. డీఎస్పీ రంగారెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయం సోమవారమే తన దృష్టికి రాగా విచారణ జరిపినట్లు తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. గతంలో యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దాని ఆధారంగానే మహిళా సంఘాలు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారని పేర్కొన్నారు. ముందుగా షఫీకి కౌన్సెలింగ్ చేస్తామని, అతడు యువతిని పెళ్లి చేసుకుంటే సరేనని, లేకపోతే యువతి పిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రంగారెడ్డి స్పష్టం చేశారు. -
లైంగికదాడికి పాల్పడిన వారికి ఉరిశిక్ష వేయాలి
ఒంగోలు టౌన్ : మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష వేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కె.అరుణ డిమాండ్ చేశారు. సింగరాయకొండ మండలం పాకల గ్రామంలో అత్యాచారయత్నానికి గురై రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఏడేళ్ల బాలికను గురువారం ఆమె పరామర్శించారు. అనంతరం విడుదల చేసిన ప్రకటనలో ఉరిశిక్షలు విధించడం ద్వారా భవిష్యత్‌లో అత్యాచార సంఘటనలు తగ్గుతాయని పేర్కొన్నారు. ఏడేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరగడం సభ్యసమాజానికే సిగ్గుచేటన్నారు. ఒకే మండలంలో రెండు మూడు అత్యాచార ఘటనలు చోటుచేసుకోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికడతామంటూ ప్రభుత్వం ఒకపక్క చెబుతున్నప్పటికీ ఆ దిశగా కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. పాకలకు చెందిన బాధితురాలిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం
సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ రాయదుర్గంటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు. స్థానిక అజీజీయా షాదీమహల్‌లో ఆ పార్టీ నియోజకవర్గ సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జగదీష్ మాట్లాడారు. ఎన్నికల ముందు చంద్రబాబు అనేక వాగ్దానాలు ఇచ్చి, ఇప్పుడు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. నేటి వరకు అనంతపురాన్ని కరువు జిల్లాగా ప్రకటించలేదన్నారు. రుణాల మాఫీ, కొత్త అప్పులు మంజూరు నిలిచిపోరుునట్లు తెలిపారు. పశువులకు మేత కొరత ఏర్పడిందని చెప్పారు. సుమారు 1200 గ్రామాల్లో తాగునీరు, పనులు లేక ప్రజలు వలసలు వెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంతో కయ్యానికి సిద్ధం కావాల్సిన అవసరం వచ్చిందన్నారు. న్యాయబద్ధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రారుుతీలు, ప్రత్యేక హోదాపై చంద్రబాబు నోరు మెదపడంలేదని ఆరోపించారు. ప్రధాని మోదీకి అర్జీలు ఇస్తే సమస్యలు పరిష్కారం కావని, పోరాడి సాధించుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమాన్ని వదిలేసి కేవలం పత్రికా ప్రకటనలు, పర్యటనలకే ప్రభుత్వం పరిమితమైందని విమర్శించారు. ప్రజలను విస్మరించి కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం ఊడిగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజా సమస్యలపై కార్యకర్తలు, నేతలు పోరాటాలు చేయూలని పిలుపునిచ్చారు. ఉక్కు కర్మాగారం కోసం ఉద్యమం రాయదుర్గం నియోజకవర్గంలోని డీ.హీరేహాళ్ మండలంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం కోసం కలిసి వచ్చే రాజకీయ పక్షాలతో కలిసి ఉద్యమించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ తెలిపారు. యూపీఏ ప్రభుత్వం రాయదుర్గంలో కుద్రేముఖ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఎన్నికల తర్వాత కర్మాగారం ఊసే ఎత్తడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. సీపీఐ తాలూకా ఇన్చార్జి నాగార్జున, నేతలు వెంకటేశులు, నరసింహులు, ఫకృద్దీన్, హనుమంతు, సిద్దమ్మ, నీలకంఠమ్మ పాల్గొన్నారు. -
ఒక్క ఫించను తగ్గినా సహించం
సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు చిత్తూరు(ఎడ్యుకేషన్): పింఛన్లుదారుల్ని తగ్గించేందుకే రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేస్తోందని, ఒక్క పింఛను తగ్గినా టీడీపీ ఎంఎల్ఏ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులను నిలదీస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు అన్నారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా ఆధార్ కార్డు అవసరం లేదన్న చంద్రబాబు, అధికారంలోకి రాగానే ప్రతి దానికి ఆధార్‌కార్డు అవసరమని చెప్పడం సరికాదన్నారు. కొత్త పింఛన్లు ఇవ్వాలిగానీ, పాత వాటి ని ఎత్తేసేందుకు సర్వేలు చేయడం దారుణమని, ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు కీలకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. బాబు అధికారంలోకి వచ్చి వంద రోజులైందని పండుగ చేసుకుంటున్నారని, ఈ మూడు నెలల కాలంలో ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. రుణమా ఫీ విషయంలో మాట తప్పారని, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్న ఉ ద్యోగాలు తీసేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు కొందరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తున్నారని, భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని, సహకరించని అధికారులను బదిలీ చేయిస్తామంటూ బెదిస్తున్నారని చెప్పారు. టీడీపీ నేతల ఆక్రమణల గురించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే విచారణ చేయిస్తామని చెప్పి పట్టించుకోలేదన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంటరత్నం మాట్లాడుతూ భూముల్ని అమ్మి సొమ్ము చేసుకోవడం చంద్రబాబు పాలసీ అని, అందుకే మెగాసిటీ, ఆ సిటీ అని భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 29న భూపోరాట సదస్సు.. టీడీపీ నేతల ఆక్రమణల గురించి ఈనెల 29వ తేదీన భూ పోరాట సదస్సులో బయటపెడతామని రామానాయుడు తెలిపారు. శ్రీకాళహస్తిలోని మహేష్ కళ్యాణ మండపంలో సదస్సు జరుగుతుందని, దీనికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కే.నారాయణ వస్తారని చెప్పారు. సదస్సు పోస్టర్‌ను ఆవిష్కరించారు. సీపీఐ నేతలు, కార్యకర్తలు, మేధావులు సదస్సుకు తరలిరావాలని కోరారు. సమావేశంలో నేతలు నాగరాజన్, జయలక్ష్మి, మణి, ఆర్ముగంరెడ్డి పాల్గొన్నారు. -
‘కార్పొరేట్ శక్తుల చేతిలో సీఎం కీలుబొమ్మ’
హిందూపురం అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్పొరేట్ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారారని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీష్ విమర్శించారు. శుక్రవారం హిందూపురంలో జరిగిన ఏఐటీయుసీ డివిజన్‌స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపాలన ‘కొత్తసీసాలో పాతసారా’ చందంగా మారిందన్నారు. కార్పొరేట్ శక్తులను కాదని ముఖ్యమంత్రి సొంతనిర్ణయం తీసుకునే పరిస్థితి లేదన్నారు. రాయలసీమను, అందునా నిత్యం కరువుకాటకాలు సంభవించే అనంతపురం జిల్లాను విస్మరించి నవ్యాంధ్రలో ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తగదని హితవు పలికారు. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో పారిశ్రామికాభివృద్ధి ప్రకటనలకే పరిమితమైందన్నారు. ఇప్పటివరకు ఇక్కడకు ఎన్ని పరిశ్రమలు వచ్చాయని ప్రశ్నించారు. అభివృద్ధి విజయవాడకే పరిమితం కాకుండా అనంతపురానికీ వికేంద్రీకరణ కావాలాన్నారు. కదిరి, ఓడీసీ ప్రాంతాల్లో సోలార్‌హబ్ ఏర్పాటు చేయలన్నారు. కేంద్రప్రభుత్వం కూడా పారిశ్రామికవేత్తల చేతుల్లో ఇరుక్కుపోయిందన్నారు. పెట్రో, రైల్వేచార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కూడా పాలన ఏకపక్షంగా ఉంటోందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే స్టోర్లు, మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, కేబుల్ కనెక్షన్లు ఇలా ఆదాయవనరులన్నీ పచ్చచొక్కాలకే కట్టబెడుతున్నారన్నారు. కార్మిక సమస్యలపై ఈ నెల 25న కలెక్టరేట్ ముట్టడి చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి జాఫర్, కౌన్సిలర్ దాదాపీర్, మండల కార్యదర్శి సురేష్, మాజీ కౌన్సిలర్ ఆషియాభాను, ఏఐటీయుసీ నాయకులు శ్రీరాములు, జయరాం, ఏఐవైఎఫ్ నాయకులు వెంకటేష్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలి
కనగల్, న్యూస్‌లైన్ : ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లేపల్లి ఆదిరెడ్డి కేంద్రా న్ని డిమాండ్ చేశారు. బుధవారం పొనుగోడులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రుల లాబీలకు తలొగ్గి తెలంగాణ ఏర్పాటు విషయంలో కేంద్రం వెనకడుగు వేస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. డిశంబర్ 9 ప్రకటన తర్వాత చంద్రబాబు అనుసరించిన విధానాన్నే ప్రస్తుతం కూడా అనుసరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో భద్రత ఉండదని చెబుతూ కొంతమంది సీ మాంధ్ర పెట్టుబడి దారులు ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమం చేయించడం ద్వారా తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఈ నెల 30వ తేదీన జిల్లా కేంద్రంలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశానికి రాష్ట్రకార్యదర్శి నారాయణ హాజరౌతున్నట్లు తెలిపారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి జి. సోమయ్య పాల్గొన్నారు.