ఎమ్మెల్యే కాలె యాదయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్
చేవెళ్ల రూరల్: మండల పరిధిలోని మొండివాగు గ్రామంలో ప్రియుడి ఇంటి ఎదుట మౌనదీక్షకు దిగిన యువతికి న్యాయం చేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్, మిహళా సమాఖ్య న్యాయ సలహాదారు విజయలక్ష్మి పండిట్ తదితరులు సోమవారం రాత్రి డీఎస్పీని కలిశారు. ఊరేళ్ల అనుబంధ మొండివాగుకు చెందిన హసీనాబేగంను అదేగ్రామానికి చెందిన మహ్మద్‌షఫీ ప్రేమించి పెళ్లి చే సుకునేందుకు ముఖం చాటేసిన విషయం తెలిసిందే. ప్రియుడి ఇంటి ఎదుట యువతి మౌనదీక్ష సోమవారంతో ఐదో రోజుకు చేరుకుంది. సోమవారం సీపీఐ నాయకులు, మహిళా సమాఖ్య సభ్యులు యువతికి మద్దతు తెలిపారు అనంతరం వారు డీఎస్పీని కలిసి విషయం తెలియజేశారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య దృష్టికి తీసుకెళ్లారు. రాత్రి 7 గంటల సమయంలో ఎమ్మెల్యే చేవెళ్లలో డీఎస్పీ రంగారెడ్డి, సీఐ ఉపేందర్‌ను కలిసి ఈ విషయమై చర్చించారు.
ఓ యువతి తనకు న్యాయం చేయాలని దీక్ష కొనసాగిస్తున్నా స్పందించకపోవటం శోచనీయమన్నారు. న్యాయం జరిగే వరకు తాము యువతికి అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఎలాగైనా షఫీతో యువతి పెళ్లి చేయించాలని కోరారు. లేదంటే యువకుడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేశ్, జిల్లా కార్యవర్గం సభ్యులు జనార్దన్, జంగయ్య, రామస్వామి, బాలయ్య, మహిళా సమాఖ్య నాయకురాళ్లు విజయలక్ష్మి పండిట్, నీలమ్మ, లక్ష్మిలు మాట్లాడారు. న్యాయం జరిగే వరకు యువతికి అండగా ఉంటామన్నారు. డీఎస్పీ రంగారెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయం సోమవారమే తన దృష్టికి రాగా విచారణ జరిపినట్లు తెలిపారు.
బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. గతంలో యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దాని ఆధారంగానే మహిళా సంఘాలు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారని పేర్కొన్నారు. ముందుగా షఫీకి కౌన్సెలింగ్ చేస్తామని, అతడు యువతిని పెళ్లి చేసుకుంటే సరేనని, లేకపోతే యువతి పిర్యాదు మేరకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రంగారెడ్డి స్పష్టం చేశారు.
ఆ యువతికి న్యాయం చేయండి
Published Tue, May 12 2015 5:31 AM | Last Updated on Mon, Aug 13 2018 7:32 PM
Advertisement
Advertisement