
భూసేకరణ చట్టం.. తిరోగమన చర్య: పరిశ్రమ వర్గాలు ఆందోళన
న్యూఢిల్లీ: కొత్త భూసేకరణ చట్టం.. దేశ పారిశ్రామిక ప్రగతిపైనా, మౌలిక సదుపాయాల అభివృద్ధిపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇది తిరోగమన చర్యని వ్యాఖ్యానించాయి. ఇప్పటికే అంత ంత మాత్రంగా ఉన్న దేశ పారిశ్రామిక రంగ వృద్ధికి ఇది మరింతగా విఘాతం కలిగిస్తుందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ ఆర్‌వీ కనోడియా తెలిపారు. మరోవైపు, ఈ బిల్లు వల్ల పారిశ్రామికీకరణ మందగిస్తుందని, ఫలితంగా ఎక్కువగా నష్టపోయేది ఉద్యోగార్థులైన యువతరమేనని సీనియర్ ఆర్థిక వేత్త రాజీవ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఇది పారిశ్రామికీకరణ, పట్టణీకరణకు ఎదురుదెబ్బలాంటిదన్నారు.
పారిశ్రామిక రంగం ఏకంగా పదేళ్లు వెనక్కి వెళ్లిపోతుందని కుమార్ పేర్కొన్నారు. కఠిన నిబంధనల కారణంగా.. స్థల సమీకరణలో భారీగా జాప్యం జరిగే అవకాశం ఉండటంతో మౌలిక ప్రాజెక్టులు నిల్చిపోయే ప్రమాదముందని హిందుస్తాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ (హెచ్‌సీసీ) సీవోవో రాజగోపాల్ నోగ్జా హెచ్చరించారు. కొత్త బిల్లు వల్ల స్థల సమీకరణ వ్యయం 3-3.5 రెట్లు పెరిగిపోతుందని, పారిశ్రామిక ప్రాజెక్టుల లాభదాయకత దెబ్బ తింటుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రెసిడెంట్ ఎస్ గోపాలకృష్ణన్ ఆందోళన వ్యక్తం చేశారు.