పార్లమెంట్‌లో ‘భూ’కంపం తప్పదు!
భూ సేకరణ బిల్లుపై పోరుకు సిద్ధమవుతున్న అధికార, విపక్షాలు
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుపై అధికార, విపక్షాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. వ్యతిరేకతను, నిరసనలను పట్టించుకోకుండా మే 4 తరువాత భూ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని అధికార పక్షం యోచిస్తుండగా.. బిల్లును అడ్డుకుని తీరాల్సిందేనని కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు భావిస్తున్నాయి. దాదాపు రెణ్నెళ్ల సెలవు అనంతరం తిరిగివచ్చిన రాహుల్ గాంధీ రైతాంగ సమస్యలపై ప్రభుత్వంపై దాడిని తీవ్రం చేశారు. ఈ విషయంలో పట్టు తప్పనివ్వొద్దన్న ఉద్దేశంతో ఉన్న కాంగ్రెస్.. తప్పుడు సమాచారమిచ్చి లోక్‌సభను, తద్వారా దేశాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్‌పై హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలనుకుంటోంది. అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంట వివరాలకు సంబంధించి కావాలనే సభకు తప్పుడు గణాంకాలు ఇచ్చారని, ఈ విషయంలో ఆయన సభకు వివరణ ఇచ్చి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
అకాల వర్షాల వల్ల మొదట 181 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని రాధామోహన్ సింగ్ సభకు చెప్పారని, ఆ తరువాత దాన్ని 106 లక్షల హెక్టార్లకు తగ్గించారని, చివరకు 80 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందంటూ వ్యవసాయ శాఖ ప్రకటన విడుదల చేసిందని కాంగ్రెస్ ప్రతినిధి షకీల్ అహ్మద్ వివరించారు. మరోవైపు, భూ సేకరణ బిల్లుపై కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు అధికార పక్షం సిద్ధమవుతోంది. 2013లో తాము రూపొందించిన చట్టం పరిధిలోకి సంబంధిత 13 కేంద్ర చట్టాలను ఎందుకు తీసుకురాలేదని యూపీఏను ప్రశ్నించాలని, కొంతమంది పారిశ్రామిక వేత్తల కోసమే ఆ పని చేశారని ఆరోపించాలని భావిస్తోంది.