నన్ను నమ్మండి.. అబద్ధాలను కాదు
* రాజకీయాల కోసం రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు
* భూ సేకరణ బిల్లుపై ‘మన్‌కీబాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ
* రైతులకు వ్యతిరేకంగా ఒక్క చర్య కూడా చేపట్టను
* కొత్త చట్టం రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసింది
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూసేకరణ చట్ట సవరణ బిల్లుపై ఎలాంటి వదంతులనూ నమ్మరాదని దేశ రైతాంగానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రతి నెలా రేడియో ద్వారా చేసే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా ఆయన ఆదివారం నేరుగా రైతులను సంబోధించి మాట్లాడారు. 2013-భూసేకరణ చట్టానికి సవరణలు చేయటంపై తీవ్ర ఆక్షేపణలు ఎదుర్కొంటున్న మోదీ.. రేడియో కార్యక్రమాన్ని వేదికగా చేసుకుని కొత్త చట్టంపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. లోక్‌సభలో ఆమోదం పొంది విపక్షాల అభ్యంతరాలతో రాజ్యసభ దగ్గర ఆగిన ఈ బిల్లు గట్టెక్కించటం ప్రభుత్వానికి సవాలుగా మారిన సంగతి తెలిసిందే. తాము తీసుకువచ్చిన ఈబిల్లు పూర్తిగా రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని చేసిందేనని మోదీ అన్నారు.
అంతే కాకుండా రైతులకు ప్రయోజనాలు చేకూర్చే ఏ సలహాలనైనా బిల్లులో చేర్చడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దాదాపు 30 నిమిషాలు చేసిన ప్రసంగంలో మోదీ అన్నారు. ‘‘2013నాటి భూసేకరణ చట్టంలో మార్పులను చాలా రాష్ట్రాలు కోరుకున్నాయి. అయితే ఏదైనా రాష్ట్రం పాత చట్టాన్నే అమలు చేయదలచుకుంటే ఆ రాష్ట్రానికి అందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది. రైతుల సంక్షేమం కోసం ఇవాళ మాట్లాడుతున్న వాళ్లు.. స్వాతంత్య్రం వచ్చిన తరువాత 65ఏళ్ల పాటు 120ఏళ్ల క్రితం నాటి పాత చట్టాన్నే అమలు చేశారు. మేము 2013 చట్టాన్ని మరికొంత మెరుగుపరచటానికి ప్రయత్నిస్తున్నాం’’ అని మోదీ అన్నారు.
రైతులకు పరిహారం విషయంలో 2013 చట్టంలోని నిబంధనలే కొత్త చట్టంలోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేస్తోందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ప్రభుత్వ, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టుల భూసేకరణ కోసం 80శాతం రైతుల అనుమతి అవసరం లేదన్న నిబంధన 2013 చట్టంలోనిదేనని, దీనిపై తప్పుడు సమాచారం ఇవ్వటం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ‘‘కొత్త చట్టంలో రైతుల పరిహారాన్ని తగ్గిస్తున్నామని ఆరోపించారు. కలలో కూడా నాకు అలాంటి ఆలోచన రాదు. పరిహారం గతంలో ఉన్నది యథాతథంగా కొనసాగుతుంది. 2013లో హడావుడిగా చట్టాన్ని తీసుకువచ్చారు.
రైతుల ప్రయోజనాల కోసం నాడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ బిల్లును సమర్థించింది. ఇప్పుడు మా ప్రయత్నం అంతా గ్రామీణులు, రైతులు.. వారి భవిష్యత్ తరాలు ఈ చట్టం వల్ల లబ్ధి పొందాలి. వారికి విద్యుత్తు, నీరు వంటి మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి రావాలి. రైల్వేలు, జాతీయ రహదారులు వంటి 13 రంగాలకు సంబంధించి భూసేకరణలో నామమాత్ర పరిహారాన్నే ఇస్తున్నారు. ఇప్పుడు కొత్త చట్టం అమల్లోకి వస్తే ఈ రంగాల భూసేకరణకు నాలుగు రెట్ల పరిహారాన్ని చెల్లిస్తారు.’’ అని మోదీ తెలిపారు. తమ లక్ష్యం రైతులకు, వారి పిల్లలకు, వారి గ్రామాలకు మేలు చేయటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని అన్నారు.
పారిశ్రామికవేత్తల కోసమే సవరణలు: కాంగ్రెస్
భూసేకరణ బిల్లుపై మోదీ వాదనను కాంగ్రెస్ తిప్పికొట్టింది. బిల్లులో ప్రభుత్వం తీసుకురాదల్చిన మార్పులు పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చే ముసుగు మాత్రమేనని, 13 చట్టాలను కొత్త భూసేకరణ చట్టంలోకి తీసుకురావటం ద్వారా రైతులకు మేలు చేస్తున్నామని చెప్పటం పెద్ద అబద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా విమర్శించారు.
మన్‌కీబాత్ ద్వారా మోదీ చేసిన ప్రసంగం మొత్తం అబద్ధాలతో సాగిందని ఆయన అన్నారు. 13 చట్టాలలో సవరణల అంశం కూడా 2013 చట్టంలో ఉన్నవేనని, ఎన్నికల కారణంగా ఏడాది కాలంలో సవరణలు అమల్లోకి వస్తాయని 2013 భూసేకరణ చట్టంలోని 105(3) సెక్షన్‌లో స్పష్టంగా ఉందని జైరాం రమేశ్ తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం ఈ చట్టంలో మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.
మా ప్రభుత్వం రైతులకు లబ్ధి చేయటానికే ఉంది. లెక్కకు మిక్కిలి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. ఈ అబద్ధాలను ఆధారం చేసుకుని ఎలాంటి నిర్ణయానికి రావద్దు. నన్ను నమ్మండి. మీ నమ్మకాన్ని వమ్ము చేయను.