మళ్లీ 'భూ' ఆర్డినెన్స్ తీసుకురాం
న్యూఢిల్లీ: ఇక భూ సేకరణ చట్టం సవరణ బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ ప్రస్తుతం తీసుకురాబోమని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. భూసేకరణ చట్టానికి సంబంధించిన ఆర్డినెన్స్ కాలపరిమితి సోమవారం పూర్తవనున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ ప్రకటన పలు వర్గాల్లో ఆసక్తిని రేపింది. ఇదే అదనుగా చూసుకుని ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవడానికి తమ పోరాటమే కారణమని కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ అన్నారు.
ఆర్డినెన్స్ తీసుకురాబోమని చెప్పిన ప్రధాని ప్రస్తుతం ఈ బిల్లు రాజ్యసభలో పెండింగ్లో ఉన్నందున బిల్లులో రైతుల ప్రయోజనాలుద్దేశించి ఎలాంటి సవరణలు కోరుకుంటున్నారో, ఏ అంశాలు చేర్చాలని భావిస్తున్నారో సలహాలు ఇస్తే స్వీకరిస్తామని స్పష్టం చేశారు. 2013లో తీసుకొచ్చిన భూ సేకరణ చట్ట సవరణ బిల్లు రైతుల్లో తీవ్ర ఆందోళన పుట్టించిన విషయం తెలిసిందే.
గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు దీనివల్ల చాలా మేలు జరుగుతుందని చెప్పిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తర్వాత యూ టర్న్ తీసుకొని బిల్లులో సవరణలకు డిమాండ్ చేశాయి. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇందుకు అనుమతించకపోవడంతో గత రెండు పార్లమెంటు సమావేశాలు ఈ అంశం కారణంగానే ఎలాంటి చర్చ లేకుండా ముగిశాయి. ఇప్పటి వరకు ఈ చట్టానికి సంబంధించి మూడు సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు.