మోదీ పరాజయం
భూసేకరణ ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయం ♦ ‘మన్ కీ బాత్’లో ప్రధాని వెల్లడి
* బిహార్ ఎన్నికల నేపథ్యంలో తన సవరణలపై కేంద్రం యూ టర్న్
* నీతి ఆయోగ్ సూచనతో మళ్లీ ఆర్డినెన్స్ జారీచేయరాదని నిర్ణయం
* కేంద్రం ఆర్డినెన్స్ మళ్లీ జారీచేయబోదని ముందే వెల్లడించిన ‘సాక్షి’
* భూ ఆర్డినెన్స్‌ను కాలం చెల్లిపోనివ్వాలని నేను నిర్ణయించా: మోదీ
* 2013 భూసేకరణ చట్టం అమలవుతుంది
* నెలవారీ రేడియో ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: భూసేకరణ ఆర్డినెన్స్ విషయంలో కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఎట్టకేలకు పరాజయాన్ని అంగీకరించింది. భూసేకరణకు సంబంధించి వివాదాస్పద ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీచేయబోమని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. సోమవారం (31వ తేదీ)తో గడువు ముగిసిన తర్వాత ఈ ఆర్డినెన్స్ చెల్లిపోతుందని, దానిని అలాగే చెల్లిపోనివ్వాలని తాను నిర్ణయించానన్నారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను కేంద్రం తిరిగి జారీచేయబోదని ‘సాక్షి’ మూడు రోజుల కిందటే కథనం ప్రచురించడం తెలిసిందే.
ఆ కథనాన్ని నిజం చేస్తూ స్వయంగా ప్రధానిమోదీయే ఆదివారం రేడియో ప్రసంగ కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయానికి ఆయన చెప్పుకొచ్చిన కారణాలు ఏవైనా.. అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా.. పార్లమెంటు ప్రక్రియను కాదని ఆర్డినెన్స్‌ల రూపంలో చట్టాలు తీసుకువచ్చి.. ఆ తర్వాత వాటికి ఆమోదం పొందవచ్చునన్న మోదీ ధీమా సడలిపోనట్లు తాజా పరిణామం తేటతెల్లం చేస్తోందని పరిశీలకులు అంటున్నారు.
పలు పరిశ్రమల కోసం, కార్పొరేట్ సంస్థల కోసం గతంలో చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లోని సింగూరు, నందిగ్రామ్ వంటి ప్రాంతాల్లో వెల్లువెత్తిన రైతాంగ, ప్రజా ఆందోళనలు.. అనంతరం అనేక అధ్యయనాలు, సంప్రదింపుల తర్వాత గత యూపీఏ ప్రభుత్వం 2013లో కొత్త భూసేకరణ చట్టం చేసింది. ఈ చట్టం కింద భూమిని సేకరించటం ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నది కావటంతో..
అది అభివృద్ధికి ప్రతిబంధకమని చెప్తూ మోదీ సర్కారు ఆ చట్టానికి పలు సవరణలు చేస్తూ కొత్త భూసేకరణ బిల్లును రూపొందించడం తెలిసిందే. పెట్టుబడులతోనే అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో.. పెట్టుబడులను ఆకర్షించడానికి భూసేకరణకు ఎటువంటి ఇబ్బందులూ ఉండబోవని.. కార్పొరేట్ ప్రపంచానికి చూపటం కోసం.. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వంటి పలు రాష్ట్రాలు చేసిన సూచనలతో హడావుడిగా రూపొందించిన ఆ సవరణల్లో..
పలు రంగాల కోసం భూసేకరణకు భూమి యజమానులైన రైతుల అంగీకారం తప్పనిసరి కాదని.. భూసేకరణకు ముందు సామాజిక ప్రభావ అధ్యయనం చేపట్టాల్సిన అవసరం లేదని చేసిన సవరణలు అతి ముఖ్యమైనవి. భూసేకరణకు తక్షణం ‘అడ్డంకులు’ తొలగించే లక్ష్యంతో ఈ సవరణలతో 8 నెలల కిందటే ఎన్డీఏ ప్రభుత్వం తొలి ఆర్డినెన్స్ జారీ చేసింది. కానీ.. ఈ సవరణలపై ప్రతిపక్ష పార్టీలే కాదు..
బీజేపీ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్న మూడు రైతు సంఘాలు సహా దాదాపు అన్ని రైతు సంఘాలూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఆ తర్వాత ఆ సవరణలతో కూడిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. మూడు దశాబ్దాల అనంతరం లోక్‌సభలో సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం.. అభివృద్ధి నినాదంతో ఈ బిల్లును సులభంగానే గట్టెక్కించవచ్చని భావించింది. గత పార్లమెంటు ఎన్నికల్లో మోదీకి లభించిన ప్రజాదరణను బట్టి..
మోదీ ‘అచ్చే దిన్’ తేవటం కోసం ఎటువంటి అవరోధాలనైనా అధిగమించేందుకు సిద్ధపడతారన్న సంకేతాలనిస్తూ.. రైతాంగం కూడా ఈ బిల్లుకు సానుకూలంగానే ఉంటారని తలచింది. కానీ.. ఆ అంచనాలు తలకిందులయ్యాయి. విపక్షాల నుంచే కాదు.. మిత్రపక్షాల నుంచీ మోదీ భూబిల్లు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రతిపక్షం ఆధిక్యం ఉన్న రాజ్యసభ.. గత బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును పట్టుపట్టి మరీ సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ)కి నివేదించింది.
ఈలోగా భూ ఆర్డినెన్స్ గడువు తీరిపోయిన కారణంగా ఇప్పటికే మూడు పర్యాయాలు దానిని జారీచేసింది. ప్రస్తుతం జేపీసీ పరిశీలనలో ఉన్న బిల్లు విషయంలో.. 8 నెలల పాటు పట్టువీడని సర్కారు ఎట్టకేలకు ఇటీవలే తన వైఖరిని పూర్తిగా మార్చుకుంది. ప్రతిపక్ష పార్టీల్లో చాలా పార్టీలతో పాటు, పాలక ఎన్డీఏ మిత్రపక్షాలు కొన్ని కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో తను చేసిన సవరణల విషయంలో యూ టర్న్ తీసుకుంది.
వాటిని వదిలివేయటానికి సిద్ధమని చెప్పటమే కాదు.. జేపీసీకి స్వయంగా అధికార బీజేపీయే సంబంధిత సవరణలు కూడా ప్రతిపాదించింది. మూడోసారి జారీచేసిన ఆర్డినెన్స్ గడువు కూడా సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో.. దానిని తిరిగి జారీ చేయాలని సర్కారు తొలుత నిర్ణయించింది. కానీ.. ప్రతిపక్షాలవ్యతిరేకత.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దానిని విపక్షాలు ఆయుధంగా చేసుకునే అవకాశం ఉండటంతో ఆ ఆలోచనను విరమించుకుంది.
భూ ఆర్డినెన్స్‌తో తనపై పడిన రైతు వ్యతిరేక ముద్రను చెరిపివేసుకునే లక్ష్యంతో.. 2013 భూసేకరణ చట్టానికి ఆర్డినెన్స్ ద్వారా తను చేసిన కీలకమైన సవరణలన్నిటినీ సర్కారు ఉపసంహరించుకోనుందని.. అందులో భాగంగానే ఆర్డినెన్స్‌కు కాలం చెల్లిపోనివ్వాలని నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. అదీగాక.. భూసేకరణ రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్నందున దీనిపై చట్టం చేసే అంశాన్ని రాష్ట్రాలకు విడిచిపెట్టాలన్న నీతిఆయోగ్ సిఫర్సూ ఈ నిర్ణయానికి కారణమని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి.
ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీచేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించిన మోదీ.. ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయకపోవటమంటే.. భూసేకరణ చట్టం 2013ను యథాతథంగా అమలులోకి రావటమేననీ అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ఎటువంటి సూచనలనైనా భూసేకరణ బిల్లులో చేర్చటానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనీ చెప్పారు. తద్వారా.. మోదీ మొట్టమొదటిసారిగా తన ఓటమిని పరోక్షంగానైనా స్వయంగా ఒప్పుకున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన పరాభవం కన్నా.. భూసేకరణ చట్టం విషయంలో ‘అంగీకరించిన’ పరాభవమే చాలా పెద్దదని వారు విశ్లేషిస్తున్నారు. అలాగే.. ప్రధానమంత్రి మోదీ తన రేడియో ప్రసంగంలో.. రైతుల ప్రయోజనాల కోసం ‘13 అంశాల’ను నోటిఫై చేయటం ద్వారా నిబంధనల రూపంలో అమలులోకి తెచ్చామని చెప్పటాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తూ.. ఆ అంశాలు కొత్తవేవీ కాదని, 2013 చట్టంలో భాగంగా రూపొందించినవేనని పేర్కొంటున్నారు.
నిర్దిష్ట ప్రభుత్వ పనుల కోసం భూసేకరణకు గల కష్టాన్ని తొలగించేందుకు ఉద్దేశించిన ఈ 13 అంశాలను నోటిఫై చేయకపోతే ఆర్డినెన్స్‌తో పాటే గడువుతీరిపోతాయని వివరించారు. ఈ నిబంధనలను నోటిఫై చేయటం ద్వారా రైతులు ప్రస్తుతమున్న 2013 చట్టం ప్రకారం భూసేకరణకు పరిహారం పొందనున్నారు.
మోదీ ‘మన్ కీ బాత్’..
రైతుల ప్రయోజనాల కోసం ఎటువంటి సూచనలనైనా అంగీకరిస్తానని నేను మళ్లీ మళ్లీ చెప్పాను. మాకు ‘జై జవాన్-జై కిసాన్’ కేవలం నినాదమే కాదు.. అది మా మంత్రం.
‘‘మేం ఒక భూ ఆర్డినెన్స్‌ను జారీ చేశాం. రేపటితో (సోమవారంతో) దాని గడువు తీరిపోతుంది. ఆ ఆర్డినెన్స్ గడువు తీరిపోనివ్వాలని నిర్ణయించాను. దానర్థం.. నా ప్రభుత్వం పగ్గాలు చేపట్టకముందు ఉన్న పరిస్థితిని పునరుద్ధరించటం. రైతుల అభిప్రాయమే నాకు అత్యంత ముఖ్యం. భూసేకరణ బిల్లుపై ప్రభుత్వానికి విశాలదృక్పథం ఉంది. ఆ బిల్లుపై చాలా వివాదం నెలకొనివుంది. రైతుప్రయోజనాల కోసం ఎలాంటి సూచనలనైనా నేను అంగీకరిస్తానని నేను మళ్లీ మళ్లీ చెప్పాను.
2013 భూసేకరణ చట్టాన్ని మెరుగుపరచటానికి రాష్ట్రాల నుంచి సూచనలు వచ్చాయి. ఈ చట్టానికి ఉద్యోగస్వామ్య పిడికిళ్ల నుంచి స్వేచ్ఛ కల్పించాలని.. సాగునీటి కాలువలు, విద్యుత్తుకు విద్యుత్తు స్తంభాలు, రోడ్లు, ఇళ్లు అందించటం ద్వారా గ్రామాల అభివృద్ధి, రైతుల సంక్షేమం జరిగేలా చూడాలని, పేద గ్రామాలకు పని లభించేలా సాయం చేయాలని ఆ సూచనలు పేర్కొన్నాయి. అయితే.. ప్రభుత్వం ఈ భూ బిల్లును తీసుకువచ్చిన తర్వాత చాలా పొరపాటు అనుమానాలను సృష్టించారు.
రైతుల్లో ఎంతో భయం నింపారు. రైతులకు ఎటువంటి సందేహం కానీ ఎటువంటి భయం కానీ అవసరం లేదు. నేను ఎవరికీ అటువంటి అవకాశం ఇవ్వను. ఇప్పుడు ఎటువంటి సందేహానికీ ఆస్కారం లేదు. ఎవరైనా భయం సృష్టించటానికి ప్రయత్నిస్తే.. మీరు భయపడకూడదు. ఈ వివాదాల కారణంగా విషయం సంక్లిష్టంగా మారింది. ఆర్డినెన్స్‌కు కాలం చెల్లిపోయేలా చేస్తున్నందున.. 13 అంశాలకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది.
అసంపూర్ణంగా ఉన్న పనిని పరిష్కరించేందుకు ఈ నిబంధనలు ఈ రోజు (ఆదివారం) నుంచి అమలులోకి వస్తాయి. రైతులు ఆర్థికంగా లేదా మరే రకంగా నష్టపోకూడదని మేం ఈ పని చేస్తున్నాం. మాకు ‘జై జవాన్- జై కిసాన్’ కేవలం నినాదమే కాదు.. అది మా మంత్రం. అందుకే రైతుల సంక్షేమం కోసం మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తున్నట్లు స్వాతంత్య్ర దిన ప్రసంగంలో ప్రకటించాను.’’
అభివృద్ధి ఒక్కటే అన్ని సమస్యలకు సమాధానం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ నెలవారీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం భూసేకరణ ఆర్డినెన్స్ రద్దు అంశంతో పాటు అనేక అంశాలను ప్రస్తావించారు. సొంతరాష్ట్రం గుజరాత్లో పటేల్‌ల ఆందోళనపై మొదటిసారి స్పందించారు. ప్రధాని ‘మన్‌కీ బాత్’ ప్రధాన అంశాలు...
* గుజరాత్లో జరిగిన హింసా ఘటనలు దేశాన్ని ఆందోళన పర్చాయి. సర్దార్ పటేల్ పుట్టిన గడ్డపై ఏం జరిగినా అన్నింటికన్నా ముందు దేశానికి దిగ్భ్రాంతి కలిగింది. పరిస్థితులు అదుపు తప్పకుండా చూడడంలో కీలక భూమిక నిర్వహించిన నాగరికులతో గుజరాత్ శాంతి మార్గంలో పయనిస్తోంది. శాంతి, ఐక్యత, సోదరభావమే సరైన మార్గం. భుజం భుజం కలిపి అభివృద్ధి మార్గంలో నడవాలి. అభివృద్ధే మన సమస్యలకు సమాధానం.
* రక్షాబంధన్ సందర్భంగా అక్కాచెల్లెలకు బీమా ఇవ్వాలనే పిలుపునకు స్పందించి 11 కోట్ల కుటుంబాలు ఈ పథకంలో చేరాయి.
* జన్‌ధన్ యోజన పిలుపుతో 17.75 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరుచుకోవడం సంతోషం. జీరో బ్యాలెన్సుతో ఖాతా తెరవాలని కోరగా, 22వేల కోట్లు పొదుపు చేశారు.
* బౌద్ధ దేశాలకు చెందిన బౌద్ధ సంప్రదాయ విద్వాంసులు త్వరలోనే బుద్ధగయ రానున్నారు. మానవజాతి ప్రాపంచిక విషయాలపై చర్చించనున్నారు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూగయ వెళ్లారు. ఇప్పుడు బౌద్ధ విద్వాంసులతో బోధ్‌గయ వెళ్లే అవకాశం లభించడం ఆనందక్షణాలుగా భావిస్తున్నా.
* మన శాస్త్రవేత్తలు అత్యుత్తమరీతిలో పనిచేస్తున్నారు. వారి పరిశోధనలు, ఆవిష్కరణలను సామాన్యుల వరకు ఎలా తీసుకెళ్లాలనే దానిపై ఆలోచించాలి. సిద్ధాంతాలను పరికరాల్లో ఎలా మార్పు చేయాలి? ల్యాబ్‌లను భూమికి ఎలా అనుసంధానం చేయాలి? అనే దిశగా ముందుకు వెళ్లాలి.
* విద్యలో సంస్కరణలు తేవాలని, నైపుణ్యాభివృద్ధిపై పరిమల్ షా (ఠానే), ప్రాథమిక విద్యలో ఉత్తమ ఉపాధ్యాయుల అవసరంపై ప్రకాశ్ త్రిపాఠి లేఖల ద్వారా సూచనలు తెలియచేశారు.
* చిన్న ఉద్యోగ నియామకాల్లో అవినీతి నివారణకు ఇంటర్వ్యూల విధానం నుంచి విముక్తి కల్పించే పని త్వరలో అమల్లోకి రానుంది.
* మనదేశంలో ఏటా 50వేల మంది తల్లులు, 13 లక్షల మంది శిశువులు ప్రసవ సమయంలో లేదా ఆ తర్వాత మృతి చెందడం ఆందోళనకరం. ఈ మరణాలను తగ్గించాల్సిన అవసరం ఉంది.
* దేశంలో 514 డెంగీ రోగ నిర్ధారణకు ఉచిత పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటే ఉచిత పరీక్ష కేంద్రాల్లో సేవలను వినియోగించుకోవాలి.
* ప్రేమ, ఔదార్యాలతో కూడిన సూఫీ సంస్కృతిని అన్ని మతాలవారూ అర్థం చేసుకోవాలి. సూఫీ సంస్కృతి ఇస్లాం వాస్తవ రూపాన్ని చూపుతుంది. ఇటీవల సూఫీ సన్యాసులను, పండితులను కలుసుకున్నాను. వారి మాటలు, మాట్లాడిన విధానం వీనుల విందుగా అనిపించింది.
క్రూరమైన జోక్... మోదీ దేశ రైతుల పట్ల క్రూరమైన జోక్ చేశారు. తమ సవరణలు ఆమో దం పొందే అవకాశాలు లేవని తెలిసినప్పుడు మూడు సార్లు ఎందుకు ఆర్డినెన్స్‌ను జారీ చేయాల్సి వచ్చింది?
- సీతారాం ఏచూరి, సీపీఎం నేత
సంస్కరణకు విఘాతం.. భూఆర్డినెన్స్ రద్దు ఆర్థిక సంస్కరణలకు తీవ్ర విఘాతం. పారిశ్రామికీకరణకు కీలకమైన భూసేకరణ ఇకపై కష్టతరమౌతుంది. - అసోచామ్
కాంగ్రెస్ బండారం బయటపడింది.. భూసేకరణ బిల్లుతో కాంగ్రెస్ బండారం బయటపడింది. సలహాలకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించినా కాంగ్రెస్ అడ్డుపడింది. తాజా నిర్ణయంతో ఇక రాష్ట్రాలు స్వేచ్ఛగా భూసేకరణ చట్టాన్ని అమలు చేసుకోవచ్చు.
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ
‘పొరపాటు’ ఒప్పుకుంది.. ప్రభుత్వం చివరకు తన పొరపాటు అంగీకరించింది. - ఆప్