‘గుజరాత్’ సేద్యం.. పెద్దల భోజ్యం
రెండోమాట
ఎన్డీయేల మధ్య ఎడమ చేతికీ, పురచేతికీ ఉన్నంత తేడా మాత్రమే ఉంది. దీనికి ఎన్డీయే మరో సవరణ తెచ్చింది. అది ఎలాంటిది? ప్రపంచ బ్యాంక్ సవరణలకు పూర్తిగా మద్దతు తెలిపేదే. కాబట్టి యూపీఏ, ఎన్డీయే తెచ్చిన సవరణకు రాజ్యసభలో చుక్కెదురు కావడంతో, రాష్ట్రపతి చేత ఆర్డినెన్స్ మీద సంతకం చేయించారు. అయినా రాజ్యసభ ఆమోదించలేదు. ఆ ఆర్డినెన్స్ ఉద్దేశం సాగు భూములను కార్పొరేట్ సంస్థలకు సేకరించి పెట్టడమే. ఈ ఆర్డినెన్స్‌కు పూర్వరంగం అంతా గుజరాత్ అభివృద్ధి నమూనాలో ఉంది.
నరేంద్ర మోదీ పదే పదే ప్రచారం చేసుకున్న ‘గుజరాత్ అభివృద్ధి నమూనా’ లో బడుగు బలహీన వర్గాలకు చోటుండదు. అది బహుజనులతో కూడిన సమాజాన్ని చీల్చే ‘అభివృద్ధి’ నమూనా. కీలక రంగాలలో కేంద్రీకరించాల్సిన అభివృద్ధిని మోదీ ‘గుజరాత్ నమూనా’ నిర్వీర్యం చేస్తుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలూ, వివిధ సర్వేలూ, సాధికార గణాంకాలే ఇందుకు సాక్ష్యం.
అతుల్ సూద్, కల యర్సన్: ప్రసిద్ధ విశ్లేషకులు (13-6-2014) గుజరాత్ అభివృద్ధి నమూనా వందిమాగధ ఆశ్రీత పెట్టుబడిదారీ వర్గా న్ని పెంచే నమూనా. కొద్దిమంది చేతులలో సంపద కేంద్రీకరణకు దోహదం చేసే నమూనా. గుజరాత్‌లో పరిశ్రమాభివృద్ధి జరగలేదని నేనడం లేదు. కాని, రూ.30,000 కోట్ల వెచ్చించిన నూనెశుద్ధి కర్మాగారం, కేవలం 400 మం దికి ఉపాధి కల్పిస్తే ఒరిగేదెంత? ఈ అభివృద్ధి నమూనా వల్ల సామాజిక న్యాయం లేదా సమానత్వం సిద్ధించడం కల్ల.
క్రిస్తీ ఫెర్నాండెజ్ (మోదీ సీఎంగా పనిచేసిన కాలంలో పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి) 20-5-2015న చేసిన వ్యాఖ్య
ఎన్నికల ప్రణాళికల పేరుతో రాజకీయ పక్షాలు చేసే బాసలన్నీ ఆచర ణలో నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ఇది ప్రజల అనుభవం. అబ ద్ధాల అంకయ్యలకు అరవైనాలుగు అసత్య ప్రమాణాలన్న సామెత ఇలా వచ్చిందే. ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టి ఒక సంవత్సరం గడిచిన సందర్భం ఇది. సినిమా వందరోజులు ఆడితే చాలునని కొందరు దర్శక నిర్మాతలు ఈ రోజులలో కోరుకుంటూ ఆత్మతృప్తి పొందుతున్నట్టే, బీజేపీ నాయకులు కూడా ఏడాది పాలనకే ఆత్మ సంతృప్తి చెందవలసిన ఆవశ్యకత వచ్చింది. అయితే వారి ఆత్మతృప్తిని మనం కాదనలేం. ఆ హక్కు మనకు లేదు.
అప్పటిదాకా ఏలిన పార్టీల నిర్వాకంతో విసిగి వేసారిపోవడం వల్ల కావచ్చు. వాగ్ధాటితో నేతలు తమను నమ్మించడం వల్ల కావచ్చు. ప్రజలు దింపుడు కల్లం ఆశతో ఓట్లు వేస్తున్నారు. మోసపోతున్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో ఇదంతా నిరూపితమవుతున్న దశలో మనం ఉన్నాం. యూపీఏ, ఎన్డీయే పాలక వ్యవస్థలు ఆ దశలో భాగాలే. వాటి మధ్య ఆచరణలో వ్యత్యా సాలు తక్కువ. యూపీఏ హయాంలోనూ ప్రపంచ బ్యాంక్ ప్రజా వ్యతిరేక విధానాలు యథేచ్ఛగా అమలైనాయి. అటల్ బిహారీ వాజపేయి కాలం నుంచి, నేటి పరివార్ కూటమి ఏలుబడి వరకు జరిగినదీ, జరుగుతున్నదీ అదే. దేశ విదే శీ గుత్త పెట్టుబడులకు అనుకూలంగా వ్యవసాయ, పారిశ్రామిక విధానాలు అమలు జరుగుతూనే వచ్చాయి. 1894 నాటి భూసేకరణ చట్టానికి యూపీఏ సవరణ తెచ్చింది. ఆహార భద్రతకు ఆధారంగా ఉన్న పంట భూములను తాకకుండా, ప్రభుత్వ భూములను పరిశ్రమాభివృద్ధికి వినియోగించేటట్టు జాగ్రత్తలు తీసుకోవడం ఆ సవరణ ఉద్దేశం. దీనికి ఎన్డీయే మరో సవరణ తెచ్చింది. అది ఎలాంటిది? ప్రపంచ బ్యాంక్ సవరణలకు పూర్తిగా మద్దతు తెలిపేదే. కాబట్టి యూపీఏ, ఎన్డీయేల మధ్య ఎడమ చేతికీ, పురచేతికీ ఉన్నంత తేడా మాత్రమే ఉంది. ఎన్డీయే తెచ్చిన సవరణకు రాజ్యసభలో చుక్కెదురు కావడంతో, రాష్ట్రపతి చేత ఆర్డినెన్స్ మీద సంతకం చేయించారు. అయినా రాజ్యసభ ఆమోదించలేదు. ఆ ఆర్డినెన్స్ ఉద్దేశం సాగు భూములను కార్పొరేట్ సంస్థలకు సేకరించి పెట్టడమే. ఈ ఆర్డినెన్స్‌కు పూర్వరంగం అంతా గుజరాత్ అభివృద్ధి నమూనాలో ఉంది.
గుజరాత్ నమూనా
ఇంతకీ గ్రామీణ గుజరాత్‌లో ఈ అభివృద్ధి నమూనా కింద ఎలాంటి సాగు జరుగుతున్నదో గమనించడానికి రెండు ఉదాహరణలు చాలు. ఈ రెండు ఉదాహరణలు (ఫొటోలు చూస్తే తెలుస్తుంది) మోదీ ఆ రాష్ట్ర ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రారంభంలోనిది ఒకటి కాగా, రెండవది చివరి మూడేళ్ల కాలానికి చెందినది. మొదటిది: అహ్మదాబాద్‌కు 70 కిలోమీటర్ల దూరంలోని కాయ్లా అనే గ్రామంలో పత్తి విత్తనాలు చల్లుకోవ డానికి ఒక గుజరాత్ కుటుంబం తన సభ్యులతోనే కాడి పట్టించవలసి వచ్చింది. ఆధునిక యంత్రాలకు నోచుకోకపోవడమే కాదు, కనీసం ఎడ్లతో కూడా కాకుండా వారే (2011) దుక్కి దున్నుకోవలసివచ్చింది. హిందూ గ్రూప్‌నకు చెందిన ‘ఫ్రంట్‌లైన్’ ఏప్రిల్ 14, 2014లో ఈ ఫొటోను ప్రచు రించింది. మోదీ చెబుతున్న అభివృద్ధి నమూనాలో చోటు లేని గ్రామీణ రైతు కుటుంబాలు దానికి బయటే ఉండిపోయిన సంగతిని ఈ ఫొటో చెబుతోంది. రెండవ ఫొటో.. అహ్మదాబాద్‌కు 90 కిలోమీటర్ల దూరంలోని లక్తార్ తాలూ కాలోని వాద్లా గ్రామానికి చెందిన చిత్రం(ఫ్రంట్‌లైన్, 13-6-2014). ఆధు నిక యంత్రాలు కాని, ఎద్దులు కాని లేకుండా పురాతన నాగలితోనే రైతు కుటుంబం పొలం దున్నుకుంటోంది. మోదీ దేశాన్ని నమ్మిస్తూ వస్తున్న గుజరాత్ అభివృద్ధి నమూనాకు ఇవి సాక్ష్యాలా? లేక వక్రభాష్యాలా?
భూసేకరణ చట్టంలో యూపీఏ తీసుకువచ్చిన సవరణ మీద మోదీ ప్రతిపాదించిన సవరణ దగ్గరకు మళ్లీ ఒక్కసారి వద్దాం. 2013 చట్టం ప్రకారం భూములను సేకరించడానికి నూటికి 70 నుంచి 80 మంది రైతుల స్వచ్ఛంద అనుమతి అవసరం. ఆ సేకరణ మూలంగా సామాజిక జీవనం మీద పడే ప్రభావాన్ని గురించి సర్వే జరగాలి. జనాభిప్రాయం తెలుసుకోవాలి. సరిగ్గా ఈ నిబంధననే నిరాకరిస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్‌ను ఒకటికి రెండుసార్లు ప్రవేశపెట్టింది. కాబట్టి ఇచ్చిన ఆర్డినెన్స్‌ను గానీ, రైతాంగ వ్యతిరేక సవరణ లను గానీ ఉపసంహరించుకోవడానికి మోదీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. పైగా ఇంకా వెలుగుచూడని ఈ ఆర్డినెన్స్/బిల్లుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్‌డీఏ చట్టాన్ని తెచ్చి రైతుల మీద సవారీ చేయడం మొదలుపెట్టారు.
రాణ్ ఆఫ్ కచ్ రైతుల అనుభవం
1965 నాటి ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో ఇక్కడ స్థిరపడిన 5,000 మంది పంజాబీ, హరియాణా రైతుల శ్రమ కూడా 2010లో, అంటే మోదీ హయాం లోనే దగా పడింది. ఈ అంశం మీద సుప్రీం కోర్టులో ఒక వ్యాజ్యం నడు స్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఆ యుద్ధం సమయంలో ఆ రైతులు గుజ రాత్‌కు వలస వచ్చి రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో స్థిరపడవలసి వచ్చింది. యుద్ధంతో నిర్వాసితులైన ఆ రైతులనూ, మిగిలిన సైనికులనూ ఆ సరి హద్దులో స్థిరపడవలసిందిగా నాటి ప్రధాని సాక్షాత్తు లాల్ బహదూర్ శాస్త్రి కోరారు. అప్పటికి అదంతా ఊసర క్షేత్రం. పైగా పొరుగునే ఉన్న పాకిస్తాన్ చొరబాట్లకు అది ఆలవాలం. బండరాళ్ల నేల. ఆ రైతులే ట్రాక్టర్లతో, పశువుల సాయంతో నేలను సరి చేసుకున్నారు. 400 అడుగులు వెడితే గాని నీరు రాదు. వర్షాలు కురిసే ప్రాంతం కాదు. అలాంటి నేల మీద పత్తి, వేరుశెనగ, గోధుమ, మామిడి, ఖర్జూరం వంటి పంటలు పండించే సరికి వారి తల ప్రాణం తోకకు వచ్చింది. ఇంత కష్టపడినా, వచ్చి 40 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ వారు స్థిర నివాసం ఏర్పరుచుకున్న నిర్వాసితులుగానే పరిగణనలో ఉన్నారు. వారే అభివృద్ధి చేసుకున్న భూమి మీద వారు రుణం పొందలేరు. అమ్మలేరు. కాలక్రమంలో వారి ఉనికికే ఎసరు పెడుతూ గుజరాత్ ప్రభుత్వం రాణ్ ఆఫ్ కచ్ రైతులు ఖాళీ చేయాలని కచ్ జిల్లా కలెక్టర్ ద్వారా నోటీసులు జారీ చేయించింది. 2010లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే వారి భూములను స్వాధీనం చేసుకున్నట్టు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంలో వారు మోదీని కలుసుకోవడానికి యత్నించి కూడా విఫలమ య్యారు. ‘మేమంతా భారతీయ రైతులమే. గుజరాత్‌లో బతుకుతూ ఇక్కడి వారి కోసం భూములు సాగుచేస్తున్నాం. మమ్మల్ని వెళ్లిపొమ్మంటే, మాతో భూమిని వెంటబెట్టుకుని పోలేం.’ అని చెప్పినా ఎవరూ కరగలేదు.
ఈ వివాదం గుజరాత్ హైకోర్టుకు వెళ్లింది. ముగ్గురు న్యాయమూర్తులు ఐదురోజులు రైతుల గోడు విన్నారు. తరువాత,‘కచ్‌లో రైతులకు మాత్రమే సొంత భూమి ఉండాలి’ అని తీర్పు చెప్పారు. కానీ గుజరాతీ రైతులకే భూములు ఉండాలని అని చెప్పలేదు. ‘వారు పంజాబీ రైతులు అయితే వారికి కచ్ భూముల మీద హక్కు ఉంది అని కూడా స్పష్టం చేసింది. రైతులే కేసు గెలిచారు. కానీ భూమి దక్కలేదు. మోదీ ప్రభుత్వం ఈ కేసును సుప్రీం కోర్టుకు (2012, జూలై 9) లాగింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం ఈ రోజుకీ రైతులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ దేశంలో ప్రజా స్వామ్యం ఒక మేడిపండు.
(వ్యాసకర్త మొబైల్: 9848318414)
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు