2004కు 2024కు లింకుందా? నాడు ఎన్డీయే వర్సెస్ యూపీఏ. నేడు ఎన్డీయే వర్సెస్ ‘ఇండియా’. నాటి ప్రత్యర్థులు వాజ్‌పేయి-సోనియా. నేటికీ సోనియా, ఆమె ప్రత్యర్థిగా నరేంద్ర మోదీ. ఇప్పుడు కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశలు ఎందుకు పెట్టుకుంది?
మాయావతి పుట్టిన రోజైన జనవరి 15న సోనియా గాంధీ ఆమె ఇంటికి వెళ్లి మరీ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడాన్ని ఒకసారి ఊహించండి. ఈ ఊహ 20 ఏళ్ల నాడు ఒక నమ్మలేని నిజం.. సోనియా ముభావి. ఎవరితోనూ కలవరు. కానీ ఆ రోజు మాయావతి ఇంటికి వెళ్లిన సోనియా గాంధీ ఆమెతో రెండు గంటల సేపు మాట్లాడారు. తర్వాత బయటికి వస్తూ.. ‘‘రానున్న ఎన్నికల్లో తమ పార్టీ బహుజన పార్టీతో పొత్తు కుదుర్చుకోబోతున్నది’’ అని ప్రకటించారు. అయితే ఆ మర్నాడే మాయావతి అలాంటి పొత్తేమీ ఉండబోదని స్పష్టం చేశారు! అందుకు ప్రతిస్పందనగా.. ‘‘మాతో పొత్తు పెట్టుకోనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని పార్టీల మీద ఒత్తిడి తెస్తోంది’’ అని సోనియా ఆరోపించారు. నాడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్నట్లే ఎన్డీయే. నాడు ప్రధానిగా ఉన్నది అటల్ బిహారి వాజ్‌పేయి.
బహుజన పార్టీతో పొత్తుకోసం ప్రయత్నించినట్లే సోనియా గాంధీ నమాజ్‌వాది పార్టీ పొత్తు కోసం చేయిచాచారు. సోనియా ఏర్పాటు చేసిన ప్రతిపక్ష నాయకుల సమావేశానికి అమర్‌సింగ్ హాజరు అయ్యారు కానీ, ములాయం సింగ్ యాదవ్ మాత్రం పొత్తు వద్దు, 1999లో మాదిరిగా ఒంటరి పోరాటమే మేలని అన్నారు. ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా పొత్తుకు ఆసక్తి చూపించలేదు. కానీ ఆయనపై కార్యకర్తల ఒత్తిడి కారణంగా కాంగ్రెస్‌తో చేయీచేయీ కలిపేందుకు బలవంతపు నవ్వులనే ఆనాడు ఆయన రువ్వారు. రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒక్కరు మాత్రం కాంగ్రెస్‌తో కలిసేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే సీట్ల సర్దుబాటు దగ్గరే ఆయన గీచిగీచి బేరం ఆడారు. లాలూ 6 స్థానాలు మాత్రమే ఇస్తాం అంటే కాంగ్రెస్ కనీసం 10 అయినా కావాలని కోరింది.
ఇక డీఎంకేతో పొత్తు. అప్పటికి (2004 నాటికి) 24 ఏళ్లుగా కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న డీఎంకే కాంగ్రెస్‌తో కలిసి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు ముందుకొచ్చింది. అయితే లాలూ మాదిరిగానే కరుణానిధి కూడా 5 లేదా 6 సీట్లు ఇవ్వగలం అన్నారు. ఆయన తరఫున టి.బాలు సోనియాతో చర్చలు జరిపారు. అవి విఫలం అయ్యాయి. అలాగే.. ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తేనే మీతో పొత్తుకు వస్తాం అని కేసీఆర్ తెగేసి చెప్పటంతో కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గింది. జేఎంఎం కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లు కోరడంతో పొత్తుకు ముందుకు రాలేదు.
ఏమైతేనేం ఆ ఎన్నికల్లో బీజేపీ ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ యూపీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఎన్డీయేకు 181 సీట్లు రాగా, యూపీఏకు 218 సీట్లు లభించాయి. ఎన్నికల పొత్తుకు ముందుకు రాని పార్టీలు ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాయి! బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్‌వాది పార్టీ, కేరళ కాంగ్రెస్, లెఫ్ట ఫ్రంట్‌లకు వచ్చిన సీట్లు కూడా కలుపుకుని 543 సభ్యుల లోక్‌సభలో సౌకర్యవంతమైన 335 సభ్యుల బలంతో కాంగ్రెస్ పార్టీ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
విశేషం ఏమిటంటే.. 2004లో ఎవరి మధ్యనైతే పోటీ ఉందో వారి మధ్యనే ఈ 2024లోనూ పోటీ ఉండబోవటం. నాడు, నేడు అధికారంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే. నాడు నేడు ప్రతిపక్షంగా ఉన్నది యూపీఏ కూటమే. అయితే యూపీఏ కాస్తా ‘ఇండియా’ కూటమి అయింది. నాడు స్వయంగా సోనియాజీ వెళ్లి పొత్తు కోసం ప్రయత్నించినా పొత్తుకు ముందుకు వచ్చిన పార్టీలు తక్కువ. నేడూ ఇంచుమించుగా అదే పరిస్థితి. పొత్తుకు వచ్చిన పార్టీలు ఎక్కువే అయినా ఎన్నికల వరకు అవి కాంగ్రెస్‌తో నిలబడి ఉంటాయా అన్నది సందేహం. ఆ సందేహం కలిగించిన మొదటి వ్యక్తి నితీష్ కుమార్. మూడు రోజుల క్రితమే ఆయన ‘ఇండియా’ కూటమిని వీడిపోయి ఎన్డీయేలో కలిశారు. మమతా బెనర్జీ కూడా తాము విడిగానే పోటీ చేస్తామని అంటున్నారు. ‘ఆప్’ కూడా ఆమె బాటలోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది.
నితీశ్ కమార్ బయటికి వెళ్లకముందు వరకు ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, ‘ఇండిపెండెంట్’ పార్టీతో కలిపి మొత్తం 28 పార్టీలు ఉండేవి. అవి: 1. కాంగ్రెస్, 2. డీఎంకే, 3. శివసేన (యు.బి.టి.), 4. సి.పి.ఐ (ఎం), 5. ఎన్.సి.పి., 6. ముస్లిం లీగ్, 7. నేషనల్ కాన్ఫరెన్స్, 8. సి.పి.ఐ., 9. ఆప్, 10. జె.ఎం.ఎం., 11. కేరళ కాంగ్రెస్, 12. కేరళ కాంగ్రెస్ (ఎం), 13. వీసీకె (విదుతలై చిరుతైగళ్ కచ్చి), 14. ఆర్.ఎస్.పి., 15. ఆర్.జె.డి., 16. ఆర్.ఎల్.డి., 17. డి.ఎం.కె., 18. సీపీఐ (ఎంఎల్) ఎల్., 19. అప్నా దళ్, 20. పీసెంట్స్ అండ్ 21. వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా, 22. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్, 23. పి.డి.పి., 24. ఎం.ఎం.కె., 25. కె.ఎం.డి.కె., 26. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, 27. ఇండిపెండెంట్, 28. జేడీయు.
నాటి ఎన్నికల్లో వాజ్‌పేయి-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. నేటి ఎన్నికల్లో నరేంద్ర మోదీ-సోనియా గాంధీ ప్రధాన ప్రత్యర్థులు. ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అయినా పార్టీలో దింపుడు కళ్లెం ఆశలు మాత్రం అలాగే ఉన్నాయి.
చదవండి: హేమంత్ సోరెన్ తర్వాత జార్ఖండ్ సీఎం.. కల్పనా సోరెన్ ఎవరు?
Comments
Please login to add a commentAdd a comment