దేశవ్యాప్తంగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. అబ్ కి బార్... 400 పార్’ అన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ కూటమి (ఎన్డీయే) ఆ లక్ష్యాన్ని అందుకునే లక్షణాలు దాదాపుగా కనిపించకపోగా... అధికార పక్షాన్ని గద్దె దింపుతాం... 295 స్థానాలతో పగ్గాలు చేపడతాం అని బీరాలకు పోయిన కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి (ఇండియా) కూడా తన లక్ష్యానికి దగ్గరలోనే నిలిచిపోయింది.
కాకపోతే గత ఎన్నికల్లో కేవలం 52 స్థానాలు మాత్రమే సాధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా కోల్పోయిన కాంగ్రెస్ ఈ సారి వంద సీట్ల వరకూ సాధించడం ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతానికి ఎన్డీయే, ఇండియా కూటమి భాగస్వాముల్లో ఫిరాయింపుల్లాంటివేవీ కనిపించడం లేదు కానీ.. ఫలితాలన్నీ వెలువడిన తరువాత అసలు రాజకీయం మొదలకానుంది. సరే.. రెండు ప్రధాన కూటములు తమ తమ లక్ష్యాలను సాధించలేక పోయాయి? ఎందుకు? అతి విశ్వాసమా? లేక వ్యూహ రచన లోపమా?
ఎన్డీయేలో ఏం కొరవడింది?
ముందుగా ఎన్డీయే కూటమి విషయం చూద్దాం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి ఎన్నికల రణనీతిని సమర్థంగా అమలు చేయడంలో మోడీ చాలా దిట్ట అన్న పేరు ఉంది. మోడీ-అమిత్ షాల ద్వయం అప్పట్లో కేవలం గుజరాత్‌కు మాత్రమే పరిమితం కాగా.. తరువాతి కాలంలో బీజేపీ వెనకుండి నడిపించే ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తల బలాన్ని, క్రమశిక్షణను ఆసరాగా చేసుకుని జాతీయ స్థాయి ఎన్నికల్లోనూ తమ సత్తా చాటగలిగారు. ప్రతి నియోజకవర్గాంలోని ఒక్కో పోలింగ్ బూత్‌కు బాధ్యులుగా కొందరు కార్యకర్తలను నియమించడం... ప్రణాళికాబద్ధంగా ప్రచారం సాగించడం... తమకుతాము ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం మోడీ-అమిత్ షాల శైలి రాజకీయాలని అర్థమవుతుంది.
ఈ శైలితోనే మోడీ ప్రధానిగా రెండుసార్లు గెలవగలిగారనడం అతిశయోక్తి కాదు. 2019 నాటి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303కుపైగా సీట్లు సాధించి రికార్డు సృష్టించింది కూడా. అయితే ఈ విజయంలో భాగమైన చాలామంది భాగస్వామ్య పక్షాలను నిలబెట్టుకోలేకపోయిందన్నది కూడా నిష్టూర సత్యం. భాగస్వామ్య పక్షాలు చాలావరకూ తప్పుకున్న నేపథ్యంలో బీజేపీ కొత్త మిత్రులను వెతుక్కునే ప్రయత్నాలు చేసింది. కాకపోతే ఈ మిత్రత్వం ప్రభావం తక్కువే అన్నది తాజా ఫలితాల నేపథ్యంలో స్పష్టమవుతోంది.
కాంగ్రెస్ మాటేమిటి?
ఒకప్పుడు దేశంలోని అత్యధిక లోక్‌సభ స్థానాలు (రాజీవ్ గాంధీ హయాంలో 425) సాధించిన... దశాబ్దాల పాటు దేశ రాజకీయాలను ఏకపక్షంగా శాంసిన కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో గణనీయంగా బలహీన పడిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. పార్టీ రాజకీయాలన్నింటికీ ఢిల్లీని కేంద్రం చేసుకోవడం.. నమ్మకంగా పనిచేసిన సీనియర్ నేతలను నిరాదరించడం, సమయానకూలంగా వ్యూహాలను, కార్యాచరణను మార్చుకోకపోవడం వంటివన్నీ కాంగ్రెస్ పతనానికి కారణాలుగా చెప్పవచ్చు. అయితే 2019 ఎన్నికల్లో అతి స్వల్ప స్థానాలకు పరిమితమైన తరువాత గానీ ఈ పార్టీ తగిన పాఠలు నేర్చుకోలేకపోయింది. ఎన్డీయే దెబ్బకు కుదేలు కాగా మిగిలిన జవసత్వాలు కొన్నింటినైనా ఒక్కటి చేసుకుని మళ్లీ పైకి ఎదిగే ప్రయత్నాలు మొదలుపెట్టంది. పార్టీ అధ్యక్షుడిగా వైఫల్యాలు మూటకట్టుకున్న రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన భారత్ జోడో యాత్ర కానీ.. భారత్ న్యాయ యాత్ర కానీ రాహుల్ గాంధీపై అప్పటివరకూ ఉన్న ‘పప్పు’ ముద్రను తొలగించడంలో ఎంతో ఉపకరించిందనడంలో సందేహం లేదు.
గత ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించడంతో కాంగ్రెస్ దశ తిరిగిందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. నేతలందరూ ఐకమత్యంగా నిలబడి పోరాడితే విజయావకాశాలు పెరుగుతాయని తెలంగాణ విజయంతో అర్థమయింది. ఇదే వ్యూహాన్ని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ప్రయత్నించింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడింది మొదలు కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త జోష్‌తో పనిచేసిందని చెప్పాలి.
బీజేపీ ప్రచారానికి మాటకు మాట రీతిలో జవాబివ్వడంతోపాటు ప్రచారంలోనూ కొత్త పుంతలు తొక్కింది ఈ పార్టీ. అదే సమయంలో ప్రతిపక్షాలన్నింటినీ ఒక దగ్గర చేర్చేందుకు చేసిన ప్రయత్నాలూ ఫలించాయని చెప్పాలి. దళిత నేత మల్లికార్జున ఖర్గేను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించడం, ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటించబోమన్న హామీల నేపథ్యంలో ఆప్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ వంటివి ఇండియా కూటమిలో భాగంగా నిలిచాయి. ఎన్నికల్లోనూ ఐకమత్యంతో పోరాడాయి. అంతిమ ఫలితాలేమైనప్పటికీ కాంగ్రెస్, ఇండియా కూటముల ప్రదర్శన మునుపటి కంటే మెరుగుపడటం ఎన్నో రాజకీయ పాఠాలు నేర్పుతుంది.
Comments
Please login to add a commentAdd a comment