న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం మోదీ జూన్ 9న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. తొలుత జూన్ 8న మోదీ ప్రమాణ స్వీకార ఉంటుందని వార్తలు వెలువడగా.. తాజాగా ఆ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రానికి మార్చినట్లు సమాచారం. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.
కాగా దేశంలో నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తి మోదీనే కావడం విశేషం. మోదీ ప్రమాణ స్వీకారానికి దక్షణాసియా దేశాలకు చెందిన అగ్ర నేతలు తరలిరానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే హాజరు అయ్యే విషయం ఖరారైంది. ఈ మేరకు ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా రణిల్ విక్రమసింఘేను ప్రధాని మోదీ ఆహ్వానించారని ఆ దేశ అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది.
బంగ్లాదేశ్ ప్రధాని సైతం శనివారం నాటి కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈవెంట్ కోసం ఆమె ఒకరోజు ముందే అంటే శుక్రవారమే ఢిల్లీకి చేరుకోనున్నారు. వీరితోపాటు భూటాన్, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ప్రచండ, భూటాన్ షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్‌లకు కూడా ప్రధాని మోదీ ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ఇటీవల ప్రకటించిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలను గెలుచుకుంది. 2014లో 282 సీట్లు, 2019లో 303 చోట్ల విజయ కేతనం ఎగరవేసి సొంతంగా మేజార్టీ స్థానాలు దక్కించుకున్న బీజేపీ.. ఈసారి ఈసారి మెజార్టీ(272) కంటే తక్కువ స్థానాలకే పరిమితమైంది. కేవలం 240 సీట్లను గెలుచుకున్న బీజేపీ.. ఎన్డీయే కూటమి మిత్రపక్షాల సాయంతో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఏర్పాటు చేయనుంది. కూటమి నేతల మద్దతుతోే ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment