
షాజాపూర్: మధ్యప్రదేశ్‌లోని ఒక ఆలయంలో దారుణం వెలుగుచూసింది. 10 వాహనాల్లో వచ్చిన జనం ఆలయ పూజారిపై దాడికి దిగారు. ఈ ఘటన షాజాపూర్ జిల్లాలోని మాతా టెక్రీ ఆలయంలో రాత్రివేళ చోటుచేసుకుంది. రాత్రి 12 గంటల తర్వాత ఆలయ ద్వారాలు తెరవడానికి పూజారి నిరాకరించడంతో వారంతా సామూహికంగా అతనిపై దాడికి దిగారు.
ఆలయ పూజారి రఘురాజ్ దాస్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన అర్ధరాత్రి 12:30కి జరిగింది. 10 వాహనాల్లో వచ్చిన 30 మంది జనం రఘురాజ్ దాస్‌పై దాడి చేశారు. రాత్రి 12 గంటల తర్వాత వారు ఆలయం తలుపులు తెరవమని కోరగా, పూజారి ఇది సమయం కాదనడంతో, వారు పూజారిపై దాడికి పాల్పడి, ఆలయంలోని హుండీని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో పూజారి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు. ఆలయంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు పలువురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. స్థానికులు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. పోలీస్ కమిషనర్ ఈ కేసును సీరియస్‌గా తీసుకుని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి: హనుమజ్జయంతి వేడుకల్లో ఉద్రిక్తత