
న్యూఢిల్లీ: అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) సోమవారం హర్యానాలోని హిసార్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆయన హిసార్ నుంచి అయోధ్యకు మొదటి వాణిజ్య విమానానికి పచ్చజెండా చూపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ 2014కు ముందు దేశంలో 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండేవని, నేడు అవి 150కి చేరుకున్నాయని తెలిపారు.
#WATCH | Addressing a public event in Haryana's Hisar, PM Modi says, "Before 2014, there were 74 airports in the country, but today there are over 150 airports...Imagine 74 airports in 70 years?... Every year, there are record airline passengers in the country. The airline… pic.twitter.com/uf0CXsWZLI
— ANI (@ANI) April 14, 2025
ప్రతీయేటా విమాన ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నదన్నారు. దేశంలోని పలు విమానయాన సంస్థలు 2000 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్ ఇచ్చాయని ప్రధాని పేర్కొన్నారు. నూతనంగా ప్రారంభిస్తున్న ప్రాజెక్టులు హర్యానా(Haryana) అభివృద్ధికి ఊతమిస్తాయని, ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని ప్రధాని పేర్కొన్నారు. హిసార్ శ్రీ కృష్ణుని పవిత్ర భూమి అని, అయోధ్య శ్రీ రాముని నగరమని.. ఈ నూతన విమాన సర్వీసు రెండు పవిత్ర నగరాలను ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా బలోపేతం చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
ప్రధాని మోదీ నూతనంగా ప్రారంభించిన విమాన సర్వీసు హర్యానా- ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లను అనుసంధానం చేస్తుంది. ఈ సర్వీసు వారానికి రెండు సార్లు నడుస్తుంది. ప్రధాని మోదీ హిసార్‌లోని మహారాజా అగ్రసేన్ విమానాశ్రయంలో 410 కోట్ల వ్యయంతో నిర్మించబోయే నూతన టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ టెర్మినల్‌లో ఆధునిక ప్యాసింజర్ టెర్మినల్, కార్గో టెర్మినల్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) భవనం ఉంటాయి. హిసార్ విమానాశ్రయం నుంచి అయోధ్యతో పాటు, జమ్ము, అహ్మదాబాద్, జైపూర్, చండీగఢ్‌లకు వారానికి మూడు విమాన సర్వీసులు నడుస్తాయి. ప్రధాని మోదీ యమునానగర్‌లో 800 మెగావాట్ల సూపర్‌క్రిటికల్ థర్మల్ పవర్ యూనిట్‌కు కూడా శంకుస్థాపన చేశారు. ఇది రూ. 7,272 కోట్లతో 2028 నాటికి పూర్తవుతుందని అంచనా. ఈ ప్రాజెక్టు హర్యానాలో విద్యుత్ స్వయం సమృద్ధిని పెంచడంతో పాటు నిరంతర విద్యుత్ సరఫరాను అందించనుంది.
ఇది కూడా చదవండి: Bangladesh: చరిత్రను చెరిపేస్తున్నారు: షేక్ హసీనా ఆగ్రహం