
న్యూఢిల్లీ: రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని , సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ కౌంటరిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిర్దేశించబడిన పనులను ఆయా శాఖలు సరిగా చేయకపోతే న్యాయవ్యవస్థ జోక్యం అనేది కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ రోజు(శుక్రవారం) ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన కపిల్ సిబాల్.. ‘కార్యనిర్వాహక శాఖ తన పని తాను చేయకపోతే జోక్యం చేసుకునే హక్కు న్యాయవ్యవస్థకు ఉంది. అది ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థకు కల్పించబడిన స్వతంత్ర హక్కు.
కార్యనిర్వాహక శాఖ దాని పని అది చేయకపోతే అప్పుడు న్యాయవ్యవస్థ కచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. అది కోర్టులకు కల్పించబడ్డ ప్రాథమిక హక్కు. ఈ దేశంలోని ప్రజాస్వామ్యంలో న్యాయవ్యవస్థ అనేది స్వతంత్రంగా పని చేస్తుంది’ అని పేర్కొన్నారు. ‘ఉప రాష్ట్రపతి వ్యాఖ్యలు నన్ను దిగ్భ్రాంతికి, ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రస్తుత రోజుల్లో దేశంలో ఎవరైనా దేనిపైనైనా నమ్మకం ఉంచుతున్నారంటే అది న్యాయవ్యవస్థే. మన దేశంలో రాష్ట్రపతికి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. నామమాత్రంగానే వ్యవహరిస్తారు. కేవలం క్యాబినెట్ సలహాలతోనే రాష్ట్రపతి ముందుకు వెళతారు. అంతేకానీ ఇక్కడ రాష్ట్రపతికి ఎటువంటి వ్యక్తిగత అధికారాలు లేవు’ అని కపిల్ సిబాల్ స్పష్టం చేశారు.
జగదీప్ ధన్‌ఖడ్ ఏమన్నారంటే..
రాష్ట్రపతిని ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సూపర్ పార్లమెంట్‌గా వ్యవహరించవద్దని. ప్రజాస్వామ్య వ్యవస్థలపై సుప్రీంకోర్టు అణు క్షిపణి ప్రయోగించాలనుకోవడం సమంజసం కాదన్నారు. పరిశీలన కోసం రాష్ట్ర గవర్నర్లు పంపించిన బిల్లులపై నిర్ణయం తీసుకొనే విషయంలో రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం పట్ల జగదీప్ ధన్‌ఖడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
ఇది నిజంగా ఆందోళనకరమని అన్నారు. ఇలాంటి పరిణామం కోసం మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకోలేదన్నారు. సుప్రీంకోర్టుకు అలాంటి ఆదేశాలిచ్చే అధికారం ఎక్కడిదని ఆక్షేపించారు. గురువారం రాజ్యసభలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థ చేయాల్సిన పనులను న్యాయ వ్యవస్థ చేయాలనుకోవడం ఏమిటని ప్రశ్నించారు. అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈ దేశంలో ఏం జరుగుతోంది? అని నిలదీశారు.