
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో రోహిత్ వేముల చట్టాన్ని తీసుకురావాలని ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్యకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విన్నవించారు. ఈ మేరకు సిద్ధరామయ్యకు ఒక లేఖ రాశారు రాహుల్ గాంధీ. విద్యా వ్యవస్థలో కులం పేరుతో దూషణలకు చెక్ పడాలంటే ఒక బలమైన చట్టాన్ని తీసుకురావాలని, దీనిలో భాగంగా కర్ణాటకలో రోహిత్ వేముల పేరుతో ఒక చట్టాన్ని చేసి దాన్ని అమలు చేయాలని రాహుల్ కోరారు.
రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ సైతం కుల వివక్షను ఎదుర్కోన్నారనే విషయాన్ని రాహుల్ ఇక్కడ ప్రస్తావించారు. ఆ సమయంలోనే కాదు.. నేటికీ ఇంకా కుల వివక్ష ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయాలని సిద్ధరామయ్యను కోరారు. ఈ చట్టం చేయడానికి సిద్ధరామయ్య అంగీకరించి అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఏ స్థాయిలో విద్యార్థి అయినా కుల వివక్షకు గురైతే అది నిజంగా సిగ్గు చేటన్నారు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీ కులాలు ఈ తరహా కుల వివక్షను ఎదుర్కోనే వారిలో ముందు వరసలో ఉన్నారన్నారు. ప్రధానంగా విద్యాస్థాయిలోనే ఈ కుల వివక్షకు గురి కావడం అధికంగా ఉందన్నారు. నవనాగరిక సమాజంలో ఇప్పటికే లక్షల మంది కుల వివక్ష బారిన పడుతున్నారన్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న రోహిత్ వేముల అనే విద్యార్థి ఇక్కడ కులం పేరుతో హత్య చేయబడ్డాడని రాహుల్ ఉద్ఘాటించారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన రోహిత్ వేముల.. 2016లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. హెచ్‌సీయూ విద్యార్థి అయిన రోహిత్ వేముల.. వేధింపులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో ఆ సమయంలో దళిత సంఘాలు ఉద్యమించాయి.