రాహుల్ వ్యాఖ్యలపై మోదీ ఎదురుదాడి
శివమొగ్గ/కోయంబత్తూర్: ‘శక్తి’ని అంతంచేయడమే తమ లక్ష్యమన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. సోమవారం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ‘‘శక్తిని అంతం చేస్తామని ముంబై శివాజీ గ్రౌండ్ సభలో విపక్ష ఇండియా కూటమి ప్రకటించింది. శక్తిని నాశనం చేయడమే వారి లక్ష్యమైతే శక్తి ఉపాసనే మా సంకల్పం.
శివాజీ పార్కులో ప్రతి పిల్లాడూ జై భవానీ, జై శివానీ మంత్రం వింటూ, పఠిస్తూ పెరుగుతాడు. మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహరాజ్ తుల్జా భవానీ మాత ఆశీస్సులతోనే దేశ స్వేచ్ఛ కోసం పోరాడారు. శక్తిని ఆరాధించారు. ఆయన పేరిట ఉన్న శివాజీ పార్కులోనే శక్తిని అంతమొందిస్తామని విపక్షాలు ప్రతినబూనాయి. ఈ మాట వింటే శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే ఆత్మ క్షోభిస్తుంది. ఎందుకంటే ఆయన కుమారుడు ఉద్ధవ్ అదే సభా వేదికపై ఉన్నారు.
ప్రతి భారతీయ మహిళా శక్తికి ప్రతిరూపమే. నారీ శక్తికే మా ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. చంద్రయాన్–3 దిగిన చోటుకు శివశక్తిగా నామకరణం చేశాం’’ అని మోదీ గుర్తుచేశారు. ‘‘నారీ శక్తే నాకు నిశ్శబ్ద ఓటరని కొందరు రాజకీయ విశ్లేషకులంటున్నారు. కానీ నా దృష్టిలో నారీ శక్తి అంటే అమ్మవారి శక్తి స్వరూపం’’ అన్నారు. ‘‘అమ్మవారి శక్తి స్వరూపమంటే భరతమాతకు మరో పేరు. కన్నడ కవి, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత కువెంపు సైతం కర్ణాటక మాత అంటే శక్తి స్వరూపిణి అన్నారు.
ఇండియా కూటమి నేతలు మాత్రం ఏకంగా శక్తినే నాశనం చేస్తామంటున్నారు. ఇది మన తల్లులు, సోదరీమణులు, కూతుళ్లపై, మహిళా సంక్షేమ పథకాలపై దాడి. ధర్మాగ్రహ శక్తే ఉగ్రవాదాన్ని, అరాచకాలను అంతమొందిస్తుంది. ఆ శక్తినే విపక్షాలు సవాలు చేస్తున్నాయి. శక్తి సత్తా ఏంటో, శక్తికి ఎదురెళ్తే ఏమైతుందో ప్రతి మహిళ, కుమార్తె, సోదరీ కాంగ్రెస్‌కు తెలిసేలా చేయాలి’’ అన్నారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామంది సీఎంలున్నారంటూ మోదీ ఎద్దేవా చేశారు. ‘‘వెయిటింగ్ సీఎం, కాబోయే సీఎం, సూపర్ సీఎం, షాడో సీఎం. అధిష్టానానికి నిధులు పంపించే కలెక్షన్ మంత్రి విడిగా ఉన్నారు. ప్రభుత్వాన్ని నడపడానికి కూడా పైసల్లేకుండా నిధులన్నీ నొక్కేశారు’’ అంటూ దుయ్యబట్టారు. కోయంబత్తూర్‌లో మోదీ 2.5 కి.మీ. పొడవున రోడ్ షో చేశారు.
Comments
Please login to add a commentAdd a comment