బెళగావి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. రాజులు, మహారాజులను రాహుల్ అవమానించారన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నవాబులు, నిజాంలు, సుల్తాన్ల అరాచకాలపై మాత్రం రాహుల్ మౌనంగా ఉన్నారన్నారు. బెళగావిలో ఆదివారం(ఏప్రిల్28) నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు.
ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకొని దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటాల పుస్తకాలను కాంగ్రెస్ తనకు అనుకూలంగా రాసుకుందని మండిపడ్డారు. రాజులు, మహారాజులు పేదల భూములను ఆక్రమించారని రాహుల్ వ్యాఖ్యానించి ఛత్రపతి శివాజీ మహారాజ్, కిత్తూరు రాణి చన్నమ్మలను ఆయన అవమానించారన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే రాజులను కించపరిచారన్నారు. నవాబులు, సుల్తానుల దౌర్జన్యాలపై మాత్రం నోరెత్తలేదని విమర్శించారు. మొగల్ చక్రవర్తి ఔరంగాజేబు ఎన్నో దేవాలయాలను అపవిత్రం చేసి ధ్వంసం చేసిన విషయం రాహుల్‌కు గుర్తులేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందన్నారు. ఇటీవల జరిగిన గొడవలు కర్ణాటక కీర్తి, ప్రతిష్టలను దెబ్బతీస్తున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment