ప్రచారంలో నేతల ఛలోక్తులు
నేతల నినాదాలు ఓట్ల వర్షం కురిపించిన సందర్భాలు దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నో! గరీబీ హటావో అంటూ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ ఇచి్చన నినాదం అప్పట్లో దుమ్ము రేపింది. ఈసారి మాత్రం నినాదాల కంటే కూడా ముఖ్య నేతల నోటి నుంచి వెలువడ్డ వింత పదబంధాలు అందరినీ ఆకర్షించాయి. వాటి అర్థం ఏమై ఉంటుందా అని ఓటర్లలో ఆసక్తి రేపాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీ, సోదరి ప్రియాంక తమ ప్రసంగాల్లో ‘కటాకట్’ అని విరివిగా వాడారు. అదే పదాన్ని ప్రధాని మోదీ తిరిగి కాంగ్రెస్‌పైకి సంధించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజíస్వీ యాదవ్ కూడా వెరైటీ హిందీ పదాలను ప్రయోగించారు.
రాహుల్ ఆద్యుడు
కటాకట్ అనే హిందీ పదాన్ని తొలుత ప్రయోగించింది రాహులే. మిగతా వారు దాన్ని అందిపుచ్చుకున్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకు ఏటా రూ.లక్ష ఇస్తామని, ధనవంతుల సంపదను పేదలకు పంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొనడం తెలిసిందే. రాహుల్ తన ప్రచారంలో ఈ హామీలను తరచూ ప్రస్తావించారు. పేదల బ్యాంకు ఖాతాలకు డబ్బులు ‘కటాకట్ కటాకట్’ బదిలీ చేస్తామని ప్రకటించారు. చకచకా అనే అర్థంలో కటాకట్ పదాన్ని ప్రయోగించారు. దీనిపై ప్రజల్లో బాగా స్పందన రావడంతో ప్రియాంక కూడా అందిపుచ్చుకున్నారు.
దాంతో కటాకట్ అంటే ఏమై ఉంటుందా అని గూగుల్‌లో శోధన కూడా పెరిగింది. మోదీ కూడా అదే పదాన్ని తనదైన శైలిలో కాంగ్రెస్‌పైకి తిరిగి ప్రయోగించారు. ‘‘ఈ యువరాజులు ప్యాలెసుల్లో పుట్టారు. కష్టపడిందీ లేదు, ఫలితాలు సాధించిందీ లేదు. అందుకే దేశం తనంతట తానే అభివృద్ధి చెందుతుందని వారు అలవోకగా చెబుతుంటారు. ఎలా? ‘కటాకట్, కటాకట్’’ అని చెప్పుకొచ్చారు. రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు వారిని ‘కటాకట్, కటాకట్’ ఇంటిదారి పట్టిస్తారంటూ రాహుల్‌పై చెణుకులు విసిరారు.
తేజస్వి ‘ఫటాఫట్’
తేజస్వీ యాదవ్ కూడా రాహుల్‌తో కలసి ఓ సభలో మాట్లాడుతూ నిరుద్యోగులను ఉద్దేశించి.. ‘‘మీకు ఉద్యోగాలు ఫటాఫట్ వచ్చేస్తాయి. ఫటాఫట్. బీజేపీ సఫాచట్, సఫాచట్ (తుడిచి పెట్టుకుపోతుంది). కాంగ్రెస్, లాంతర్‌కు ఓట్లు తకాతక్ పడిపోతాయి’’ అని చెప్పుకొచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కూడా గమ్మత్తైన పదాలను ప్రయోగించారు. ‘‘తాము అవినీతి చేసేది లేదు, ఎవరినీ చేయనిచ్చేది లేదని గొప్పలు చెప్పేవారు టీకాల తయారీదారుల నుంచి విరాళాలు, ఎన్నికల బాండ్ల రూపంలో భారీ మొత్తాలు అందుకుంటారు. అలాంటి వారు గటాగట్, గటాగట్, అని చెబుతుంటారు. కానీ ప్రజలు ఓటు ద్వారా వారిని ఫటాఫట్ ఫటాపట్ ఇంటికి పంపించేస్తారు’’ అని బీజేపీపై వ్యంగ్యా్రస్తాలు విసిరారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment