Rahul Gandhi: 400 మంది మహిళలపై అఘాయిత్యం | Prajwal Revanna molestation 400 women, alleges Rahul Gandhi | Sakshi
Sakshi News home page

Rahul Gandhi: 400 మంది మహిళలపై అఘాయిత్యం

Published Fri, May 3 2024 5:47 AM | Last Updated on Fri, May 3 2024 4:58 PM

Prajwal Revanna molestation 400 women, alleges Rahul Gandhi

ఇది సెక్స్‌ కుంభకోణం కాదు.. మాస్‌ రేప్‌ ఘటన 

ప్రజ్వల్‌ రేవణ్ణపై రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు 

శివమొగ్గ/రాయ్‌చూర్‌: కర్ణాటకలో 400 మంది మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన మాస్‌ రేపిస్ట్‌ ప్రజ్వల్‌ అంటూ జేడీ(ఎస్‌) సిట్టింగ్‌ ఎంపీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గ, రాయ్‌చూర్‌ జిల్లా కేంద్రాల్లో ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాహుల్‌ ప్రసంగించారు. ‘‘ ఈ సెక్స్‌ కుంభకోణం గురించి మోదీకి ముందే తెలుసు. తలచుకుంటే సెకన్లలో ప్రజ్వల్‌ను అరెస్ట్‌చేసేవారు. సీబీఐ, కస్టమ్స్, ఇమిగ్రేషన్, ఈడీ అన్ని దర్యాప్తు సంస్థలు వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. అయినా కావాలనే పారిపోనిచ్చారు. ప్రజ్వల్‌ను మోదీ రక్షించాల్సిన అవసరమేంటి? ప్రజ్వల్‌ కోసం ప్రచారం చేస్తూ ఓట్లు అడగాల్సిన గత్యంతరమేంటి?’’ అని మోదీని రాహుల్‌ నిలదీశారు.  

కర్ణాటకను చూసి మోదీ భయపడుతున్నారు 
‘‘అధికారం, కూటమి కోసం ప్రజ్వల్‌ను కాపాడుతున్నారని కర్ణాటక మహిళలు గ్రహించారు. దేశాన్ని కాపాడాల్సిన ప్రధాని, హోం మంత్రి ప్రజ్వల్‌ను రక్షిస్తున్నారు. ఇదే మాకు, బీజేపీ సిద్ధాంతాలకు మధ్య ఉన్న తేడా. అధికారం కోసం వాళ్లు ఏదైనా చేస్తారు.  ఘటన తర్వాత కర్ణాటకను చూసి మోదీ భయపడుతున్నారు. రాష్ట్రంలో పాల్గొనాల్సిన అన్ని సమావేశాలు, ర్యాలీలను మోదీ రద్దుచేసుకున్నారు’’ అని అన్నారు. 

‘‘ బాధితుల్లో మైనర్లూ ఉన్నారు. అంతా తెల్సి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మౌనంగా ఉన్నారు. నిజంగా ఇది నేరం. ఆయనపై కేసు నమోదుచేయాలి. రేపిస్ట్‌కు మద్దతుగా ఓట్లు అడిగినందుకు దేశంలోని తల్లులు, అక్కాచెల్లెళ్లకు మోదీ క్షమాపణలు చెప్పాలి. ప్రజ్వల్‌ చేసింది తెల్సి కూడా మీ ఓట్లను మోదీ అడిగారని కర్ణాటక మహిళలు గ్రహించాలి. బీజేపీ నేతలకు ప్రజ్వల్‌ రేపిస్ట్‌ అని ముందే తెలుసు. అయినాసరే ఆయనకు మద్దతు పలికి జేడీ(ఎస్‌)తో పొత్తు పెట్టుకున్నారు’’ అని ఆరోపించారు.  

సమానత్వం కోరితే నక్సలైట్లు అంటున్నారు 
‘‘సమానత్వం కోరితే వారిని బీజేపీ చీఫ్‌ నడ్డా నక్సలైట్‌ అంటున్నారు. దళితులు, వెనుకబడిన వాళ్లు, గిరిజనులు సమానత్వం కావాలంటున్నారు. అంతమాత్రాన వారంతా నక్సలైట్లు అయిపోతారా?  ఇలా మాట్లాడిన నడ్డా వెంటనే తన పార్టీ చీఫ్‌ పదవికి రాజీనామాచేయాలి. నడ్డా వ్యాఖ్యలపై మోదీ వివరణ ఇవ్వాలి’’ అని డిమాండ్‌చేశారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement