ఏలూరులో టీడీపీ కార్యకర్త అరాచకం
రాడ్డుతో తలపై కొట్టడంతో అపస్మారక స్థితిలోకి..
వివస్త్రను చేసేందుకు కూడా యత్నం
పాత కార్యవర్గం హయాంలో రూ.40 లక్షల ఆలయ సొమ్ము గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు
ఈ విషయాన్ని ప్రశ్నించినందుకే ఆమెపై దాడి
బాధితురాలికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పరామర్శ
ఏలూరు టౌన్ : ఏలూరు కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవుని సొమ్మును కాజేశారని ప్రశ్నించిన ఆలయ కార్యదర్శిపై పాత ఆలయ కమిటీ సభ్యుడు, టీడీపీ కార్యకర్త రెడ్డి నాగరాజు అమానుష దాడికి తెగబడ్డాడు. నూతన ఆలయ కార్యదర్శి అచ్యుతకుమారిపై రాడ్డుతో దాడిచేసి, ఆమెను వివస్త్రను చేసేందుకు ప్రయత్నించడంతో బాధితురాలు తీవ్ర గాయాలపాలైంది. ప్రస్తుతం ఆమె ఏలూరు జీజీహెచ్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఏలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ నాని బాధితురాలిని బుధవారం ఆస్పత్రిలో పరామర్శించారు.
దాడి వివరాలు తెలుసుకుని వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. బాధితుల కథనం మేరకు.. ఏలూరు 27వ డివిజన్ కండ్రికగూడెం ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వరస్వామి గుడికి ఇటీవలే కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. రాజరాజేశ్వరినగర్‌కు చెందిన సావన్ అచ్యుతకుమారి ఆలయ నూతన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఆలయానికి సంబంధించి నిధులు భారీఎత్తున గోల్‌మాల్ అయ్యాయని ఆమె గుర్తించారు.
సుమారు రూ.40 లక్షలు పక్కదారి పట్టినట్లు తెలుసుకుని పాత కార్యవర్గ సభ్యులను ఆమె ప్రశ్నించారు. దీంతో పాత, కొత్త కార్యవర్గాల మధ్య వివాదం మొదలైంది. ఇదిలా ఉంటే.. శ్రీవారి కళ్యాణ మహోత్సవాలను ఆచ్యుతకుమారి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తుండడంతో పాత కార్యవర్గ సభ్యుడు రెడ్డి నాగరాజు అతని భార్య ఇద్దరూ కలిసి ఆలయ ప్రాంగణంలో పుస్తక వ్యాపారం చేసుకునేందుకు అవకాశమివ్వాలని అచ్యుతకుమారిని కోరారు.
ఆలయంలో వ్యాపారం చేయడానికి వీల్లేదని, అవసరమైతే ఉచితంగా పుస్తకాల పంపిణీకి అనుమతి ఉంటుందని ఆమె స్పష్టంచేశారు. ఈ విషయంలో వివాదం చెలరేగడంతో రెడ్డి నాగరాజు అచ్యుతకుమారిపై దాడికి తెగబడ్డాడు. రాడ్డు తీసుకుని ఆమెను తలపైన తీవ్రంగా కొట్టడంతో పాటు ఆమె చీరను లాగేసి వివస్త్రను చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో.. అక్కడున్న వారు అతనిని అడ్డుకున్నారు. తీవ్ర గాయాలతో అచ్యుతకుమారి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆమెను ఏలూరు జీజీహెచ్‌కు తరలించారు.
నిధుల గోల్‌మాల్‌పై నిలదీయడంతో..
రెడ్డి నాగరాజుతో పాటు ఉమామహేశ్వరరావు, ప్రసాద్‌బాబు తదితరుల ఆధ్వర్యంలో ఆలయ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయని ఆస్పత్రిలో ఆమె చెప్పారు. లక్షలాది రూపాయల నిధులకు లెక్కలు లేకపోవడంతో వారిని నిలదీయగా.. రెడ్డి నాగరాజు సమయం కోసం వేచిచూసి దాడిచేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment