దేశాభివృద్ధికి మరింత శ్రమిస్తాం: మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏను స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత బలీయమైన, విజయవంతమైన సంకీర్ణంగా నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. ‘‘మా సంకీర్ణం మూడుసార్లు పూర్తికాలం అధికారంలో కొనసాగింది. నాలుగోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఎన్డీఏ కేవలం అధికారం కోసం పుట్టుకొచ్చిన కొన్ని పార్టీల కలయిక కాదు. జాతి హితమే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన కూటమి.
మేమెన్నడూ ఓడిపోలేదు. నిన్నా మేమే గెలిచాం. నేడూ మేమే గెలిచాం. భవిష్యత్తులోనూ మేమే గెలుస్తాం. విజయాన్ని ఎలా జీర్ణించుకోవాలో మాకు బాగా తెలుసు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించినా జూన్ 4 (లోక్‌సభ ఎన్నికల ఫలితాల) తర్వాత మేం వినమ్రంగా ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనం’’ అన్నారు. మరోవైపు విపక్షాలు కేవలం అధికార దాహంతోనే ఒక్కటయ్యాయంటూ ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు.
కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే కలిశామని అవి స్వయంగా పేర్కొన్నాయని గుర్తు చేశారు. ‘‘ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్నే దెబ్బ తీసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. ఎన్డీఏ ఎన్నికల విజయాన్ని కూడా ఓటమిగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాయి. ఫలితాలు వాటికి అనుకూలంగా రాలేదనే అక్కసుతో దేశవ్యాప్తంగా కల్లోలం రేపేందుకు కుట్ర చేశాయి’’ అంటూ మండిపడ్డారు.
శుక్రవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన కూటమి ఎంపీలను, అనంతరం భాగస్వామ్య పక్షాల అధినేతలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ అవసరం. దేశాన్ని నడిపేందుకు అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయం మరింత అవసరం.
పదేళ్లుగా పార్లమెంటులో నాణ్యమైన చర్చలను ఎంతగానో మిస్సయ్యా. విపక్ష నేతలు ఈసారైనా జాతి ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంటులో అడుగు పెడతారని, అర్థవంతమైన చర్చలు చేస్తారని ఆశాభావంతో ఉన్నా’’ అన్నారు. ‘‘మన మధ్య పరస్పర వ్యతిరేకత ఉండొచ్చు. కానీ జాతి పట్ల వ్యతిరేకత ఉండకూడదు’’ అని విపక్షాలకు సూచించారు.
ఎన్డీఏకు కొత్త నిర్వచనం
లోక్‌సభ ఎన్నికల విజయం పట్ల ఎన్డీఏ నేతలను మోదీ అభినందించారు. ఇందుకు కారకులైన లక్షలాది మంది కార్యకర్తలకు తాను అభివాదం చేసి తీరాలన్నారు. కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి అంశంలోనూ భాగస్వామ్య పక్షాలన్నింటి ఏకాభిప్రాయంతో, జాతి హితమే లక్ష్యంగా సాగుతుందని స్పష్టం చేశారు. ‘‘ప్రజలు మాకు స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. తద్వారా ప్రభుత్వాన్ని నడిపే సదవకాశమిచ్చారు.
దీన్ని సది్వనియోగం చేసుకుంటామని, దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి పథంలో నడుపుతామని మాటిస్తున్నా’’ అని చెప్పారు. ‘‘పదేళ్ల పాలనలో వృద్ధి పథంలో దేశాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు ఎంతగానో కృషి చేశాం. అదంతా కేవలం ట్రయిలర్ మాత్రమే. ఈ టర్ములో దేశాభివృద్ధి కోసం మరింతగా పాటుపడతాం. మేం కార్య సాధకులమని ప్రజలకు తెలుసు’’ అన్నారు. ‘‘సుపరిపాలనే మా కూటమికి పునాది. ఎన్డీఏ అంటే సరికొత్త (న్యూ), అభివృద్ధి చెందిన (డెవలప్డ్) , ఆకాంక్షల (ఆస్పిరేషనల్) ఇండియా’’ అని కొత్త నిర్వచనమిచ్చారు.
కాంగ్రెస్‌పై చెణుకులు
కాంగ్రెస్ పార్టీపై ఈ సందర్భంగా మోదీ చెణుకులు విసిరారు. ఆ పార్టీకి గత మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిపి కూడా బీజేపీకి తాజా ఎన్నికల్లో వచ్చినన్ని స్థానాలు రాలేదంటూ ఎద్దేవా చేశారు. ఈసారి ఆ పార్టీ కనీసం వంద సీట్లు కూడా నెగ్గలేకపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అద్భుత ప్రదర్శన చేసిందంటూ కొనియాడారు. ‘‘దక్షిణాదిన ఎన్డీఏ జెండా ఎగిరింది. కేరళలో తొలిసారి ఖాతా తెరిచాం. ఏపీలో చరిత్రాత్మక విజయం సాధించాం.
తమిళనాడులో కూడా ఎన్డీఏ గణనీయమైన ఓట్ల శాతం సాధించాం. కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అతి తక్కువ సమయంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి భారీగా సీట్లు కట్టబెట్టారు. ఇటు ఒడిశాలోనూ దుమ్ము రేపాం. అటు అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ క్లీన్‌స్వీప్ చేశాం’’ అన్నారు. మంత్రి పదవులు ఇప్పిస్తామంటూ వచ్చేవారిని, ఫేక్ న్యూస్‌ను అస్సలు నమ్మొద్దని ఎన్డీఏ ఎంపీలకు మోదీ సూచించారు.
ఈవీఎంలపై ఇప్పుడేమంటారు?
విపక్షాలకు మోదీ చురక
ఇండియా కూటమి ప్రగతికి, ఆధునికతకు, టెక్నాలజీకి బద్ధ వ్యతిరేకి అని మోదీ ఆరోపించారు. విపక్షాలన్నీ గత శతాబ్దపు భావజాలంతో కొట్టుమిట్టాడుతున్నాయని, శరవేగంగా అగాథపు లోతుల్లోకి దిగజారుతున్నాయని దుయ్యబట్టారు. ఈవీఎంలపై చేసిన నిరాధార విమర్శలకు ఏం సమాధానమిస్తాయని ఎన్నికల్లో వాటి మెరుగైన ప్రదర్శనను ఉద్దేశించి ప్రశ్నించారు. ‘‘ఈవీఎంలపై, ఎన్నికల సంఘంపై అనుమానాలు రేకెత్తించేందుకు ఎన్నికల ప్రక్రియ పొడవునా విపక్షాలు శక్తివంచన లేకుండా కృషి చేశాయి.
సుప్రీంకోర్టులో కేసుల ద్వారా ఈసీ పనితీరును అడ్డుకోజూశాయి. వాటి తీరు చూసి ఫలితాలొచ్చాక ఏకంగా ఈవీఎంల శవయాత్ర చేస్తాయేమో అనుకున్నా! తీరా ఫలితాలు చూశాక విపక్షాల నోళ్లన్నీ మూతబడ్డాయి! ఈవీఎంలు ఇంకా బతికే ఉన్నాయా, చనిపోయాయా అని ఫలితాలొస్తున్న క్రమంలో ఒకరిని నేనడిగాను’’ అంటూ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. దేశాన్ని అంతర్జాతీయంగా కూడా అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయతి్నంచినందుకు విపక్షాలను జాతి ఎన్నటికీ క్షమించబోదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment