త్రిసూర్/తిరువనంతపురం/తిరునల్వేలి: గత దశాబ్దాకాలంగా ఎన్‌డీఏ పాలనాకాలంలో దేశం చవిచూసిన అభివృద్ధి ట్రైలర్ మాత్రమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి సాకారంకానుందని ఆయన ప్రకటించారు. సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యతనిస్తూ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ‘సంకల్ప పత్రం’ విడుదల చేసిన మరుసటి రోజే ప్రధాని మోదీ ఆ హామీలను పునరుద్ఘాటించారు.
కేరళలోని కున్నమ్‌కులమ్, కట్టకడ వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభల్లో మోదీ ప్రసంగించారు. రాహుల్‌గాంధీపై పరోక్ష విమర్శలు చేశారు. ‘‘ కాంగ్రెస్ యువరాజుకు ఉత్తరప్రదేశ్‌లో దశాబ్దాలుగా తమ కుటుంబ గౌరవం(అమేథీ ఎంపీ స్థానం)ను కాపాడే సత్తాలేదుగానీ కేరళకు వచ్చి ఓట్లడుగుతారు.
కేరళీయుల ఓట్లడిగే ఆయన సీపీఐ(ఎం) ఏలుబడిలో కరువన్నూర్ సహకార బ్యాంక్‌లో వెలుగుచూసిన కుంభకోణంపై నోరు మెదపరెందుకు? నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా రాజకీయ విభాగం సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు కాంగ్రెస్‌కు ఉంది. ఈ రెండింటి మధ్య చీకటి ఒప్పందం కుదిరింది. కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్‌కు పాల్పడి ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఈ మోసంపై నేనే ఈడీ దర్యాప్తు నకు ఆదేశించా’’ అని అన్నారు.
లెఫ్ట్ ఉంటే అంతా లెఫ్ట్ అయినట్లే
‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి, అధికార ఎల్‌డీఎఫ్ కూటములు కేరళలో అభివృద్ధికి ప్రతిబంధకాలుగా తయా రయ్యాయి. త్రిపుర, పశ్చిమబెంగాల్, కేరళ ఈ రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉందీ అంటే అక్కడ అంతా పోయినట్లే(లెఫ్ట్ అయినట్లే). అక్కడ మంచి అనేదే జరగదు. పశ్చిమబెంగాల్, త్రిపురలో ఏం చేశారని, కొత్తగా కేరళకు చేయడానికి?’ అంటూ ధ్వజమెత్తారు.
కచ్ఛతీవు ఉదంతాన్ని 4 దశాబ్దాలు దాచారు
తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగిన సభలోనూ మోదీ ప్రసంగించారు. కచ్ఛ తీవు ను శ్రీలంకకు ఇచ్చేసి కాంగ్రెస్, డీఎంకే ఈ ఉదంతాన్ని 40 ఏళ్లు దాచిపెట్టాయని మోదీ ఆరోపించారు. అక్కడ తమిళ మత్స్య కారులు తరచూ అరెస్ట్ అవుతున్నారని, ఈ పాపం ఆ పార్టీలదేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment