ten years
-
దివంగత క్రికెటర్ హ్యూస్ గౌరవార్థం...
పెర్త్: ఆట ఆడే మైదానంలో ఆయువు కోల్పోయిన ఆ్రస్టేలియన్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్కు దశమ వర్ధంతి సందర్భంగా క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) ఘనమైన నివాళులు అరి్పంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 6 నుంచి 10 వరకు అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టు ప్రారంభానికి ముందు సంస్మరణ కార్యక్రమం నిర్వహించనుంది. ఇందులో భాగంగా పదేళ్ల క్రితం మృతి చెందిన తమ క్రికెటర్‌ను ఆ జట్టు తరఫున 13వ ప్లేయర్‌గా ఆ టెస్టు జాబితాలో చేర్చనుంది. అలాగే 63 సెకన్ల పాటు (చివరగా అతను చేసిన స్కోరు) ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో అడిలైడ్ ఓవల్ మైదానం మార్మోగనుంది. దీంతోపాటు తమ దేశవాళీ క్రికెట్ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్ ట్రోఫీలో మూడు మ్యాచ్‌ల పాటు ఆటగాళ్లంతా నల్ల రిబ్బన్లతో (ఆర్మ్‌బ్యాండ్) బరిలోకి దిగుతారు. ఈ మూడు మ్యాచ్‌లు జరిగే వేదికల వద్ద ఆసీస్ జాతీయ పతాకాన్ని అవనతం చేయనున్నట్లు సీఏ తెలిపింది. 2014లో దేశవాళీ టోర్నీ ఆడుతున్న 25 ఏళ్ల హ్యూస్... పేసర్ సీన్ అబాట్ బౌన్సర్‌కు బలయ్యాడు. బుల్లెట్లా దూసుకొచి్చన బౌన్సర్ అంతే వేగంతో తల వెనుకవైపు బలంగా తాకింది. దీంతో ఉన్నపళంగా హ్యూస్ పిచ్‌పైనే నేలకొరిగాడు. వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేసినా... ఫలితం లేకపోయింది. కోమాలోకి వెళ్లిన బ్యాటర్ తన పుట్టినరోజు (30)కు మూడు రోజుల ముందు నవంబర్ 27న తుదిశ్వాస విడిచాడు. ఈ దివంగత లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఆసీస్ తరఫున అంతర్జాతీయ కెరీర్లో 26 టెస్టులు, 25 వన్డేలు, ఒక టి20 మ్యాచ్ ఆడాడు. -
Mallikarjun Kharge: లీకేజీలు, ప్రమాదాలు, దాడులు... ఇదే మోదీ ‘పిక్చర్’!
న్యూఢిల్లీ: ‘‘పదేళ్ల తన పాలన కేవలం ట్రైలరేనని, అసలు సినిమా ముందుందని లోక్‌సభ ఎన్నికల ప్రచారం పొడవునా మోదీ పదేపదే చెప్పుకున్నారు. ఆయన సినిమా ఎలా ఉండనుందో ఈ నెల రోజుల పాలన చెప్పకనే చెప్పింది. పేపర్ లీకేజీలు, కశీ్మర్లో ఉగ్ర దాడులు, రైలు ప్రమాదాలు, దేశమంతటా టోల్ ట్యాక్సుల పెంపు, బ్రిడ్జిలు, విమానాశ్రయాల పై కప్పులు కూలడాలు, చివరికి మోదీ ఎంతో గొప్పగా చెప్పుకున్న అయోధ్య రామాలయంలో కూడా లీకేజీలు... ఇదే మోదీ చూపిస్తానని చెప్పిన సినిమా!’’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో మోదీ ప్రభుత్వాన్ని అంశాలవారీగా ఏకిపారేశారు. సామాన్యుల కష్టాలను పట్టించుకోకుండా మోదీ కేవలం ‘మన్ కీ బాత్’కు పరిమితమయ్యారంటూ చురకలు వేశారు. గతంలో ఏ ప్రధాని చేయని విధంగా ఎన్నికల ప్రచారంలో విద్వేష వ్యాఖ్యలతో సమాజాన్ని విభజించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇటీవలి పేపర్ లీకేజీలతో 30 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం ప్రమాదంలో పడిందని ఖర్గే అన్నారు. మణిపూర్ హింసాకాండ వంటి దేశం ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్రపతి ప్రసంగంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదంటూ ఆక్షేపించారు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే క్రమంలో ఆరెస్సెస్‌పై ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు, విమర్శలు చేశారు. ‘‘ఆరెస్సెస్ విధానం దేశానికి చాలా ప్రమాదకరం. వర్సిటీలతో పాటు అన్ని విద్యా సంస్థల్లో వీసీలు, ప్రొఫెసర్ల నియామకాలపై దాని ప్రభావం ఉంటోంది’’ అంటూ ఆక్షేపించారు. ఆ వ్యాఖ్యలను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆరెస్సెస్ సభ్యుడు కావడమే నేరమన్నట్టుగా మీ మాటలున్నాయి. ఆ సంస్థలో ఎందరో మేధావులున్నారు. అది జాతి నిర్మాణానికి అవిశ్రాంతంగా పాటుపడుతోంది. అలాంటి సంస్థను నిందిస్తున్నారు మీరు’’ అన్నారు. మోదీపై, ఆరెస్సెస్‌పై ఖర్గే వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.కూర్చుని మాట్లాడతా: ఖర్గే అలాగే కానీయండి: ధన్‌ఖడ్ విపక్ష సభ్యుల తీవ్ర విమర్శలు, అధికార పక్ష ప్రతి విమర్శలతో వేడెక్కిపోయిన రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే వ్యాఖ్యలు, చైర్మన్ స్పందన నవ్వులు పూయించాయి. గంటన్నర పాటు ప్రసంగించిన ఖర్గే, తనకు మోకాళ్ల నొప్పులున్నందున కూర్చుని మాట్లాడేందుకు అనుమతి కోరారు. ‘మీకెలా సౌకర్యంగా ఉంటే అలా చేయండి. ఇబ్బందేమీ లేదు’ అంటూ ధన్‌ఖడ్ బదులిచ్చారు. కానీ కూర్చుని చేసే ప్రసంగం నిలబడి చేసినంత ప్రభావవంతంగా ఉండదని ఖర్గే అనడంతో సభ్యులంతా గొల్లుమన్నారు. ఆ విషయంలో మీకు వీలైనంత సా యం చేస్తా లెమ్మని ధన్‌ఖడ్ బదులివ్వడంతో సోనియాతో సహా అంతా మరోసారి నవ్వుకున్నారు. మరో సందర్భంలో ‘‘నేను దక్షిణాదికి చెందిన వాడిని. కనుక ద్వివేది, త్రివేది, చతుర్వేది పదాలు నన్ను చాలా అయోమయపరుస్తాయి’’ అని ఖర్గే అనడంతో ‘కావాలంటే వాటిపై ఓ అరగంట పాటు ప్రత్యేక చర్చ చేపడదాం’ అని ధన్‌ఖడ్ బదులిచ్చారు. దాంతో సభంతా మరోసారి నవ్వులతో దద్దరిల్లిపోయింది. -
బాలికపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
విజయవాడస్పోర్ట్స్: ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తి తిరుమల వెంకటేశ్వర్లు సోమవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన మహిళకు, నున్న గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భర్తతో మనస్పర్థల కారణంగా ఆమె పిల్లలను తీసుకుని ఇబ్రహీంపట్నంలోని పుట్టింట్లో ఉండేది.కొన్నాళ్ల తరువాత భర్త వచ్చి తన ఐదేళ్ల పెద్ద కుమార్తెను నున్నలోని తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాంబేకాలనీకి చెందిన 20 ఏళ్ల కుంచాల దుర్గారావు అలియాస్ తమ్మిశెట్టి దుర్గారావు అలియాస్ దుర్గా ఆ పాపను డాబాపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరుసటి రోజు పాపకు స్నానం చేయిస్తుండగా మర్మాంగాల వద్ద ఇన్ఫెక్షన్ రావడాన్ని గమనించిన తల్లి ఆరా తీయగా దుర్గారావు చేసిన అత్యాచారం బయటపడింది.వెంటనే పాపను చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పాపపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించడంతో పాప తల్లి ఇచి్చన ఫిర్యాదు మేరకు 2019 ఏప్రిల్ ఆరో తేదీన నున్న పోలీసులు కేసు నమోదు చేసి 2020 ఆగస్టు 12వ తేదీన నిందితుడు దుర్గారావును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో నిందితుడు దుర్గారావుకు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. -
పదేళ్ల పాలన ట్రెయిలరే...: నరేంద్ర మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏను స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత బలీయమైన, విజయవంతమైన సంకీర్ణంగా నరేంద్ర మోదీ అభివరి్ణంచారు. ‘‘మా సంకీర్ణం మూడుసార్లు పూర్తికాలం అధికారంలో కొనసాగింది. నాలుగోసారి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఎన్డీఏ కేవలం అధికారం కోసం పుట్టుకొచ్చిన కొన్ని పార్టీల కలయిక కాదు. జాతి హితమే ఏకైక లక్ష్యంగా ఆవిర్భవించిన కూటమి. మేమెన్నడూ ఓడిపోలేదు. నిన్నా మేమే గెలిచాం. నేడూ మేమే గెలిచాం. భవిష్యత్తులోనూ మేమే గెలుస్తాం. విజయాన్ని ఎలా జీర్ణించుకోవాలో మాకు బాగా తెలుసు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ ఘనవిజయం సాధించినా జూన్ 4 (లోక్‌సభ ఎన్నికల ఫలితాల) తర్వాత మేం వినమ్రంగా ప్రవర్తించిన తీరే అందుకు నిదర్శనం’’ అన్నారు. మరోవైపు విపక్షాలు కేవలం అధికార దాహంతోనే ఒక్కటయ్యాయంటూ ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. కేవలం లోక్‌సభ ఎన్నికల కోసమే కలిశామని అవి స్వయంగా పేర్కొన్నాయని గుర్తు చేశారు. ‘‘ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్నే దెబ్బ తీసేందుకు విపక్షాలు ప్రయత్నించాయి. ఎన్డీఏ ఎన్నికల విజయాన్ని కూడా ఓటమిగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాయి. ఫలితాలు వాటికి అనుకూలంగా రాలేదనే అక్కసుతో దేశవ్యాప్తంగా కల్లోలం రేపేందుకు కుట్ర చేశాయి’’ అంటూ మండిపడ్డారు. శుక్రవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన కూటమి ఎంపీలను, అనంతరం భాగస్వామ్య పక్షాల అధినేతలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ అవసరం. దేశాన్ని నడిపేందుకు అన్ని విషయాల్లోనూ ఏకాభిప్రాయం మరింత అవసరం. పదేళ్లుగా పార్లమెంటులో నాణ్యమైన చర్చలను ఎంతగానో మిస్సయ్యా. విపక్ష నేతలు ఈసారైనా జాతి ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంటులో అడుగు పెడతారని, అర్థవంతమైన చర్చలు చేస్తారని ఆశాభావంతో ఉన్నా’’ అన్నారు. ‘‘మన మధ్య పరస్పర వ్యతిరేకత ఉండొచ్చు. కానీ జాతి పట్ల వ్యతిరేకత ఉండకూడదు’’ అని విపక్షాలకు సూచించారు. ఎన్డీఏకు కొత్త నిర్వచనం లోక్‌సభ ఎన్నికల విజయం పట్ల ఎన్డీఏ నేతలను మోదీ అభినందించారు. ఇందుకు కారకులైన లక్షలాది మంది కార్యకర్తలకు తాను అభివాదం చేసి తీరాలన్నారు. కేంద్రంలో ఏర్పడబోయే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి అంశంలోనూ భాగస్వామ్య పక్షాలన్నింటి ఏకాభిప్రాయంతో, జాతి హితమే లక్ష్యంగా సాగుతుందని స్పష్టం చేశారు. ‘‘ప్రజలు మాకు స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. తద్వారా ప్రభుత్వాన్ని నడిపే సదవకాశమిచ్చారు. దీన్ని సది్వనియోగం చేసుకుంటామని, దేశాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి పథంలో నడుపుతామని మాటిస్తున్నా’’ అని చెప్పారు. ‘‘పదేళ్ల పాలనలో వృద్ధి పథంలో దేశాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు ఎంతగానో కృషి చేశాం. అదంతా కేవలం ట్రయిలర్ మాత్రమే. ఈ టర్ములో దేశాభివృద్ధి కోసం మరింతగా పాటుపడతాం. మేం కార్య సాధకులమని ప్రజలకు తెలుసు’’ అన్నారు. ‘‘సుపరిపాలనే మా కూటమికి పునాది. ఎన్డీఏ అంటే సరికొత్త (న్యూ), అభివృద్ధి చెందిన (డెవలప్డ్) , ఆకాంక్షల (ఆస్పిరేషనల్) ఇండియా’’ అని కొత్త నిర్వచనమిచ్చారు.కాంగ్రెస్‌పై చెణుకులు కాంగ్రెస్ పార్టీపై ఈ సందర్భంగా మోదీ చెణుకులు విసిరారు. ఆ పార్టీకి గత మూడు లోక్‌సభ ఎన్నికల్లోనూ కలిపి కూడా బీజేపీకి తాజా ఎన్నికల్లో వచ్చినన్ని స్థానాలు రాలేదంటూ ఎద్దేవా చేశారు. ఈసారి ఆ పార్టీ కనీసం వంద సీట్లు కూడా నెగ్గలేకపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అద్భుత ప్రదర్శన చేసిందంటూ కొనియాడారు. ‘‘దక్షిణాదిన ఎన్డీఏ జెండా ఎగిరింది. కేరళలో తొలిసారి ఖాతా తెరిచాం. ఏపీలో చరిత్రాత్మక విజయం సాధించాం. తమిళనాడులో కూడా ఎన్డీఏ గణనీయమైన ఓట్ల శాతం సాధించాం. కర్ణాటక, తెలంగాణల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అతి తక్కువ సమయంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి భారీగా సీట్లు కట్టబెట్టారు. ఇటు ఒడిశాలోనూ దుమ్ము రేపాం. అటు అరుణాచల్‌ప్రదేశ్‌లోనూ క్లీన్‌స్వీప్ చేశాం’’ అన్నారు. మంత్రి పదవులు ఇప్పిస్తామంటూ వచ్చేవారిని, ఫేక్ న్యూస్‌ను అస్సలు నమ్మొద్దని ఎన్డీఏ ఎంపీలకు మోదీ సూచించారు.ఈవీఎంలపై ఇప్పుడేమంటారు? విపక్షాలకు మోదీ చురకఇండియా కూటమి ప్రగతికి, ఆధునికతకు, టెక్నాలజీకి బద్ధ వ్యతిరేకి అని మోదీ ఆరోపించారు. విపక్షాలన్నీ గత శతాబ్దపు భావజాలంతో కొట్టుమిట్టాడుతున్నాయని, శరవేగంగా అగాథపు లోతుల్లోకి దిగజారుతున్నాయని దుయ్యబట్టారు. ఈవీఎంలపై చేసిన నిరాధార విమర్శలకు ఏం సమాధానమిస్తాయని ఎన్నికల్లో వాటి మెరుగైన ప్రదర్శనను ఉద్దేశించి ప్రశ్నించారు. ‘‘ఈవీఎంలపై, ఎన్నికల సంఘంపై అనుమానాలు రేకెత్తించేందుకు ఎన్నికల ప్రక్రియ పొడవునా విపక్షాలు శక్తివంచన లేకుండా కృషి చేశాయి. సుప్రీంకోర్టులో కేసుల ద్వారా ఈసీ పనితీరును అడ్డుకోజూశాయి. వాటి తీరు చూసి ఫలితాలొచ్చాక ఏకంగా ఈవీఎంల శవయాత్ర చేస్తాయేమో అనుకున్నా! తీరా ఫలితాలు చూశాక విపక్షాల నోళ్లన్నీ మూతబడ్డాయి! ఈవీఎంలు ఇంకా బతికే ఉన్నాయా, చనిపోయాయా అని ఫలితాలొస్తున్న క్రమంలో ఒకరిని నేనడిగాను’’ అంటూ వ్యంగ్యా్రస్తాలు విసిరారు. దేశాన్ని అంతర్జాతీయంగా కూడా అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయతి్నంచినందుకు విపక్షాలను జాతి ఎన్నటికీ క్షమించబోదన్నారు. -
అభివృద్ధి.. అప్పులు.. ఆరోపణలు పయనం పదేళ్లు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరి దశాబ్ద కాలం గడిచింది. అరవై ఏళ్ల పట్టుదలకు, పోరాటాలకు ప్రతిరూపంగా.. ముక్కోటి మంది మనోభావాలకు నిలువుటద్దంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. ఈ పదేళ్లలో బుడిబుడి అడుగులనుంచి సాధికారత వైపు పయనించింది. బాలారిష్టాలను దాటుకుని ప్రగతి నమూనాను ఆవిష్కరించే దిశగా ముందడుగు వేసింది. అనతి కాలంలోనే అగ్రరాష్ట్రాలతో పోటీపడే స్థాయికి ఎదిగింది. అప్పులు పెరుగుతున్నాయనే ఆందోళన ఉన్నా.. కొన్ని అంశాల్లో వివాదాలు, ఆరోపణలు ఉన్నా.. ప్రగతిపథంలో దూసుకెళ్లింది. తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లు నిండుతున్న నేపథ్యంలో.. ఇన్నేళ్లలో మారిన ముఖచిత్రం, కీలక రంగాల్లో జరిగిన పరిణామాలపై ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్వెలుగు.. చీకట్లుతెలంగాణ ఏర్పడితే చీకట్లో బతకాల్సిందేనన్న కొందరు నేతల విమర్శలను తిప్పికొట్టేలా రాష్ట్ర విద్యుత్ రంగం ఎదిగింది. సంప్రదాయేతర విద్యుత్‌కు పెద్దపీట వేయడంతో వేల మెగావాట్ల సౌర విద్యుత్, పవన విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. అలాగే భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే తెలంగాణ విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశలో పొరపాట్లు జరిగాయన్న విమర్శలు, ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చాయి. అదే సమయంలో అతి తక్కువ కాలంలో ప్రాజెక్టులు పూర్తయి నీటిని అందించారన్న అభిప్రాయాలూ ఉన్నాయి.వివాదాల మధ్య తనదైన ముద్రకీలక రంగాల్లోనే కాదు.. మరెన్నో అంశాల్లో తెలంగాణ తనదైన ముద్రను వేసింది. 125 అడుగుల భారీ అంబేడ్కర్ విగ్రహం, కొత్త సచివాలయ నిర్మాణం, గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలు, పోడు పట్టాల పంపిణీ, పామాయిల్ సాగుకు ప్రోత్సాహం, మిషన్ భగీరథ, సమీకృత జిల్లా కలెక్టరేట్లు, నూతన జోనల్ వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ సెంటర్, భరోసా కేంద్రాలు, మోడల్ శ్మశాన వాటికలు, సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా, పల్లె–పట్టణ ప్రగతి, యాదాద్రి ఆలయ అభివృద్ధి, బతుకమ్మ చీరలు, మెట్రో రైలు, హరితహారం లాంటి కార్యక్రమాలతో వేగంగా ముందుకు కదిలింది. రాజకీయాలు, వివాదాలు, విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నా.. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ముందుకెళ్లాలని... సామాజిక, ఆర్థిక అసమానతలు లేని ‘సమున్నత తెలంగాణ’ అతి త్వరలోనే ఆవిష్కృతం కావాలని ఆకాంక్షిద్దాం.అత్యధిక గురుకులాలుతెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన మొదలైంది. దేశంలోనే అత్యధిక గురుకులాలున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. అన్ని రకాల విద్యా సంస్థలు, హాస్టళ్లకు సన్న బియ్యం, ఉచితంగా పుస్తకాలు, యూనిఫారాలు అందుతున్నాయి. మన ఊరు– మన బడి వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ విద్య పట్ల ప్రజలను ఆకర్షితులను చేసే ప్రయత్నాలు జరిగాయి. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుదీకరణ, తాగునీరు, ఫర్నీచర్, కాంపౌండ్ వాల్స్, కిచెన్షెడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం గత పదేళ్లలో మంచి ప్రయత్నమే జరిగింది.‘ఐటీ’లో దాటేసి..తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో, అందులోనూ ప్రధానంగా ఐటీ రంగంలో వేగంగా అభివృద్ధి జరిగింది. దేశంలో సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరును దాటేసి.. హైదరాబాద్ ఐటీ రంగం ముందుకు వెళ్తోంది. ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటిపోయిందని రికార్డులు చెప్తున్నాయి. ఐటీ ఎగుమతులకు సంబంధించి 2030 సంవత్సరానికి పెట్టుకున్న లక్ష్యాలు కూడా ఇప్పటికే దాటిపోవడం గమనార్హం. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. మరిన్ని రానున్నాయి.‘ఆసరా’కు యత్నాలుతెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచీ ఆపన్నులకు మరింత ‘ఆసరా’ అందుతోంది. సంక్షేమ కార్యక్రమాల అమలు పెరిగింది. దళితబంధు, బీసీ బంధు వంటి పథకాలు పెద్దగా విజయవంతం కాకపోయినా.. మిగతా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణ ఖజానా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తోంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు.. ఇలా అవసరమున్న వారందరికీ ప్రతి నెలా ఠంచన్‌గా పింఛన్ అందుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12 వర్గాలకు ఆసరా పథకం కింద పింఛన్లు అందుతున్నాయి.ఇవి వారి ఆర్థిక అవసరాలకే కాకుండా సామాజిక భద్రతకు ఆలంబనగా నిలుస్తున్నాయి. ఆసరా పింఛన్ల కోసం ఏటా తెలంగాణ ఖజానా నుంచి దాదాపు రూ.12 వేల కోట్ల వరకు ఖర్చవుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలతో పేద వర్గాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు ఇప్పటివరకు రూ.12వేల కోట్ల వరకు అందజేశారు.కులాంతర వివాహాలకు ప్రోత్సహకాలు, అంబేడ్కర్ భవనాలు, హాస్టళ్లు, గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్షిప్లు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు, మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు, స్టడీ సర్కిళ్లు, రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలలు, అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు, అధికారికంగా ఆదివాసీల పండుగలు, గొల్లకుర్మలకు సబ్సిడీ గొర్రెలు, ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ, నేతన్నలకు బీమా, సెలూన్లకు ఉచిత విద్యుత్, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు, వేద పండితులకు గౌరవ భృతి, మౌజమ్, ఇమాంలకు గౌరవ వేతనం.. ఇలా అనేక పథకాలను అమలు చేస్తూ సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది.2 కోట్ల ఎకరాలకు సాగుతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కనిపించిన అతి పెద్ద మార్పు భారీగా ధాన్యం ఉత్పత్తి. 2014లో తెలంగాణలో 99.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తికాగా.. పదేళ్ల తర్వాత అది 2.48 కోట్ల టన్నులకు చేరింది రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి.. 2022–23 నాటికి 2.38 కోట్ల ఎకరాలకు చేరింది. వరి సాగు విస్తీర్ణం 49.63 లక్షల ఎకరాల నుంచి 97.97 లక్షల ఎకరాలకు పెరిగింది. గతంలో నిర్మించిన ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 15లక్షల ఎకరాల్లో పెరిగిన భూగర్భజలాలు వంటివి ఇందుకు దోహదపడ్డాయని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. దేశంలో తెలంగాణ మార్క్‌ను చూపిన రైతుబంధు పథకం.. రైతులు పంటలు వేసేందుకు పెట్టుబడి సాయంగా ఇతోధికంగా దోహదపడుతోంది.ఇప్పటివరకు ఎకరాకు ఏటా రూ.10 వేలు ఇస్తుండగా.. కొత్త ప్రభుత్వం దాన్ని రూ.15 వేలకు పెంచుతామని ప్రకటించింది. ఇక వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు రుణ మాఫీ, రైతు వేదికలు, సమీకృత మార్కెట్ల నిర్మాణం, గోదాముల సామర్థ్యం పెంపు, ధాన్యం సేకరణ వంటివి కూడా వ్యవసాయానికి అండగా నిలిచాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేషన్లలో తెచ్చిన మార్పులు, భూరికార్డుల నిర్వహణ కోసం అమల్లోకి తెచ్చిన ధరణి పోర్టల్ పలు వివాదాలకు కారణమైనా.. వ్యవసాయ, రెవెన్యూ వర్గాలను అనుసంధానం చేసే దిశలో సాగాయని నిపుణులు అంటున్నారు.కంటి వెలుగులు.. ఫ్రీ డయాలసిస్లుతెలంగాణ ఏర్పాటయ్యాక వైద్య రంగం అభివృద్ధి వైపు పయనించింది. పల్లె దవాఖానాలు, పట్టణ దవాఖానాల ఏర్పాటుతో వైద్యం పేదల ముంగిటకు చేరింది. కంటి వెలుగు పథకం పేదల చూపునకు అండగా నిలిచింది. తెలంగాణ డయాగ్నస్టిక్స్ పేరుతో పేదలకు ఉచితంగా రక్త పరీక్షల కార్యక్రమం వివిధ వ్యాధుల బాధితులను గుర్తించింది. నిమ్స్ విస్తరణ, టిమ్స్ ఆస్పత్రుల్లో 4 వేల పడకలు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖానాలో 2 వేల పడకలు, కొత్త ఏరియా, జిల్లా ఆస్పత్రుల ఏర్పాటు, విస్తరణ, పీహెచ్‌సీలు, యూపీహెచ్సీల ఆధునీకరణ వంటి కార్యక్రమాలు రాష్ట్ర వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడ్డాయి.తెలంగాణ ఏర్పాటయ్యాక వచ్చిన విప్లవాత్మక మార్పుల్లో ఒకటి ఉచిత డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం మూడు డయాలసిస్ కేంద్రాలుండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 102కు చేరింది. ఇక పెద్ద సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు కూడా గత పదేళ్లలో అభివృద్ధికి సూచిక. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఐదే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ఉండగా.. ఇప్పుడు తెలంగాణలోని 33 జిల్లాల్లో కలిపి 34 వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. 2014కు ముందు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 2,850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే.. ఇప్పుడు 8,515 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. -
PM Narendra Modi: అసలైన అభివృద్ధి ముందుంది
జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీ తమ పదేళ్లకాలంలో దేశంలో జరిగిన అభివృద్ధిని ఆకలి పుట్టించే స్టార్టర్‌గా అభివరి్ణంచారు. అసలైన అభివృద్ధి భోజనం ముందుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాజస్థాన్‌లోని చురులో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. భారత సైన్యాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ఇదే కాంగ్రెస్ అసలైన మనస్తత్వమని విపక్ష పార్టీపై మోదీ విమర్శలు గుప్పించారు. ‘ ఇప్పుడున్న నయా భారత్ శత్రువును ఇంట్లోకి చొరబడి మరీ దెబ్బ కొట్టగలదు. శత్రువు గడ్డపైనా దాడి చేసే సరికొత్త భారత్ ఆవిష్కృతమైంది’ అని అన్నారు. ‘‘ గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ట్రైలర్ మాత్రమే. అది భోజనాల వేళ ఆకలి పుట్టించే స్టార్టర్ మాత్రమే. అసలైన మెయిన్ కోర్సు భోజనం(అభివృద్ధి) ముందుంది. చేయాల్సిన అభివృద్ధి ఇంకా చాలా ఉంది. ఇంకా ఎన్నో కలలున్నాయి. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి మనం’ అని అన్నారు. -
ఇమ్రాన్‌కు పదేళ్ల జైలు
ఇస్లామాబాద్: ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికల్లో విజయం సాధించి, మళ్లీ అధికార పగ్గాలు చేపట్టాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్(పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(71)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పత్రాల లీకేజీ కేసులో ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషీకి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి అబ్దుల్ హస్నత్ మంగళవారం తీర్పు వెలువరించారు. రావల్పిండిలోని అడియాలా జైలులో కేసు విచారణ జరిగింది. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే ఇమ్రాన్ మూడేళ్ల జైలు శిక్ష అనుభవించారు. ఒకవైపు, ఆయన పార్టీ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్‌ను వాడరాదంటూ ఎన్నికల సంఘం నిషేధం విధించగా మరోవైపు ఇమ్రాన్, ఖురేషిలతోపాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతల నామినేషన్ పత్రాలు సైతం తిరస్కరణకు గురయ్యాయి. గత ఏడాది ఆగస్ట్‌లో తోషఖానా అవినీతి కేసును విచారించిన కోర్టు ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ 2022 మార్చి 7వ తేదీన జరిగిన బహిరంగ సభలో ఒక లెటర్‌ను ప్రజలకు చూపుతూ..తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు రాజకీయ విరోధులు ఓ విదేశంతో చేతులు కలిపారనేందుకు సాక్ష్యం ఇదేనని పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అమెరికా ప్రభుత్వం తనపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అనంతరం ఆయన పదవీచ్యుతు డయ్యారు. పాక్ మాజీ రాయబారి అమెరికా ఉన్నతాధికారితో జరిపిన భేటీకి సంబంధించిన ఆ పత్రాన్ని ఇమ్రాన్ బహిరంగంగా చూపడాన్ని రహస్య పత్రాల లీకేజీ నేరంగా పేర్కొంటూ గత ఏడాది ఆగస్ట్‌లో ఇమ్రాన్‌తోపాటు అప్పటి విదేశాంగ మంత్రి ఖురేషిపై కేసు నమోదైంది. మరో 9 రోజుల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ఇమ్రాన్, ఖురేషిలు జైలులోనే ఉన్నారు. తాజా తీర్పుతో వీరిద్దరూ అయిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోనున్నారు. -
దశాబ్దిలో రెండింతలు..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాల సంఖ్య గత పదేళ్ల కాలంగా గణనీయంగా పెరిగింది. 2013–14 ఆర్థిక సంవత్సరంలో 70,73,109 వాహనాలు ఉండగా.. 2022–23 నాటికి 1,54,77,512కు చేరాయి. సగటున ఏడాదికి 9% చొప్పున పెరుగుదల నమోదు అయినట్లు రవాణా శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఒక్క 2022–23 ఆర్థిక సంవత్సరంలోనే 10 లక్షల వాహనాలు కొత్తగా రోడ్లపైకి వచ్చాయి. ఇక రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో దాదాపు సగం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉండటం విశేషం. గణనీయంగా పెరుగుతున్న ఈవీలు తెలంగాణలోని మొత్తం 1.54 కోట్ల వాహనాల్లో ద్విచక్ర వాహనాలే 1.13 కోట్ల వరకు ఉన్నాయి. మోటారు కార్లు 20 లక్షలు, ఆటోలు 4.5 లక్షలు, స్కూలు బస్సులు 28,962, గూడ్స్ ఆటోలు 6.09 లక్షలు, ఈ–కార్ట్స్ 235, మోటారు క్యాబ్స్ 20,335, మ్యాక్సీ క్యాబ్స్ 31,060, కాంట్రాక్ట్ క్యారేజెస్ 9,244, ట్రక్కులు/ట్రాక్టర్లు 7 లక్షల వరకు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఉన్న 70 లక్షల వాహనాల్లో 50 లక్షలు ద్విచక్ర వాహనాలు కాగా కార్ల వంటి తేలికపాటి వాహనాలు 13 లక్షలు ఉన్నాయి. 2013–14 నాటికి రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉన్న 70.73 లక్షల వాహనాల్లో 8.22 లక్షలు రవాణా వాహనాలు ఉండగా... 63.68 లక్షలు సరుకు రవాణా వాహనాల కేటగిరీకి చెందినవి. అప్పట్లో ద్విచక్ర వాహనాలు 52.84 లక్షలు, కార్లు 7,96,232, జీపులు 14,989, ట్యాక్సీలు 74,097, బస్సులు 40,807, సరుకు రవాణా చేసే తేలికపాటి వాహనాలు 1,85,688, ట్రక్కులు/ట్రాక్టర్లు 1,25,240 ఉండేవి. సెకండ్ హ్యాండ్ మార్కెట్‌ను సైతం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు సహా కొన్ని ఉత్తరాది నగరాల్లోని బడాబా బులు, సంస్థలు ఆర్థిక సంవత్సరం ముగిసేటప్పుడు పెద్ద సంఖ్యలో కొత్త వాహనాలను ఖరీదు చేస్తుంటారు. ఆదాయపన్ను రిటర్న్స్‌లో లెక్కలు చూపించడానికే ఇలా చేస్తుంటారు. ఆయా సమ యాల్లో అక్కడ నుంచి భారీ సంఖ్యలో సెకండ్ హ్యాండ్ వాహనాలు దేశంలోని అనేక ప్రాంతాలకు వెళ్తుంటాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య 25 లక్షలు ఉండగా... గత దశాబ్ద కాలంగా ఏటా ఈ వాహనాలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని రోడ్లపై 46,937 విద్యుత్ (ఎలక్ట్రిక్) వాహనాలు రాకపోకలు సాగిస్తున్నట్లు రవాణశాఖ గణాంకాలు చెప్తున్నాయి. ఈ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ చార్జీలు మినహాయింపు ఇస్తోంది. దీంతో ఏటా ఈ వాహనాల సంఖ్య పెరుగుతోందని, రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ గణాంకాలు కేవలం తెలంగాణలో రిజిస్టర్ అయిన వాహనాలకు సంబంధించినవి మాత్రమే కాగా.. ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రిజిస్టర్ అయినవి కూడా రాష్ట్రంలో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో నగరానికి వచ్చేవీ పెద్ద సంఖ్యలోనే ఉంటున్నాయి. ఆయా రాష్ట్రాల నుంచి ఇక్కడకు తీసుకువచ్చే వాహనాలను రిజిస్టర్ చేయించి నంబర్ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది పూర్తి స్థాయిలో అమలు కాకపోవడంతో ఇప్పటికీ వేల సంఖ్యలో వాహ నాలు అక్కడి రిజిస్ట్రేషన్ నంబర్లతోనే తిరిగేస్తున్నా యి. ఈ కారణంగా వీటి సంఖ్య అధికారిక గణాంకాల్లోకి చేరట్లేదు. -
పదేళ్లలో మరో మహమ్మారి!.. ఆ నివేదికలో భయంకర విషయాలు
లండన్: కోవిడ్–19.. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించిన మహమ్మారి. లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది. నియంత్రణ చర్యలతోపాటు ఔషధాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా దేశాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరో పదేళ్లలో కోవిడ్–19 లాంటి భీకరమైన మహమ్మారి పంజా విసిరే అవకాశాలు ఉన్నాయని లండన్‌లోని ప్రెడిక్టివ్ హెల్త్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ సంస్థ ‘ఎయిర్ఫినిటీ’ వెల్లడించింది. వచ్చే పదేళ్లలో కొత్త మహమ్మారి తలెత్తడానికి 27.5 శాతం అవకాశాలు ఉన్నట్లు స్పష్టంచేసింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌లతోపాటు వాతావరణ మార్పులు, జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల ఆధారంగా ఈ సంస్థ అంచనాలు వెలువరిస్తూ ఉంటుంది. తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తించే కొత్త వైరస్ యూకేలో ఒక్కరోజులో 15,000 మందిని అంతం చేయగలదని తెలియజేసింది. ఎవియన్ ఫ్లూ తరహాలోనే ఇది మార్పులు చెందుతూ ఉంటుందని పేర్కొంది. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ది చేసుకోవడం, నియంత్రణ చర్యలను వేగవంతం చేయడం, 100 రోజుల్లో వ్యాక్సిన్లు అభివృద్ధి చేసుకోవడం ద్వారా కొత్త వైరస్ ముప్పు 27.5 శాతం నుంచి క్రమంగా 8.1 శాతానికి తగ్గిపోతుందని అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారులను ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధత అధ్వాన్నంగా ఉందని, ఈ పరిస్థితి చాలా మెరుగుపడాలని ఎయిర్ఫినిటీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు రాస్మస్ బెచ్ హన్సెన్ స్పష్టం చేశారు. -
పదేళ్లకోసారి ‘ఆధార్’ అప్డేట్ చేయాల్సిందే
న్యూఢిల్లీ: ఆధార్ నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఆధార్ నంబర్ కలిగి ఉన్నవారు ఎన్రోల్మెంట్ తేదీ నుంచి పదేళ్లు పూర్తయ్యాక గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ వంటి పత్రాలను (సపోర్టింగ్ డాక్యుమెంట్స్) కనీసం ఒక్కసారైనా అప్డేట్ చేసుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల సీఐడీఆర్ డేటాబేస్‌లో ఆధార్‌కు సంబంధించిన సమాచారంలో కచ్చితత్వాన్ని కొనసాగింవచ్చని తెలియజేసింది. ఎన్రోల్మెంట్ జరిగాక ప్రతి పదేళ్లకోసారి సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఆప్డేట్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వివరించింది. పదేళ్ల కంటే ఎక్కువ రోజుల క్రితం ఆధార్ కార్డు పొంది, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను అప్డేట్ చేసుకోనివారు వెంటనే ఆ పూర్తి చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) గత నెలలో విజ్ఞప్తి చేసింది. మై ఆధార్ పోర్టల్, మై ఆధార్ యాప్ ద్వారా లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల్లో డాక్కుమెంట్లు సమర్పించి, వివరాలు ఆప్డేట్ చేసుకోవచ్చని సూచించింది. దేశంలో ఇప్పటిదాకా 134 కోట్ల మందికి ఆధార్ సంఖ్యలను జారీ చేశారు. గుర్తింపు కార్డులు, చిరునామా మారినవారు కూడా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి, ఆధార్ కార్డుల్లో వివరాలు మార్చుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ నంబర్ కలిగి ఉండడం తప్పనిసరిగా మారింది. -
వారంలో ఓ డేట్ నైట్
Upasana Valentines Day Tips: ‘‘ప్రేమలో పడటం సులభమే. కానీ ఎప్పుడూ ప్రేమతో కొనసాగడం ప్రేమికులుగా పార్క్‌లో నడిచినంత సులభం కాదు’’ అంటున్నారు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన. సోమవారం వాలెంటెన్స్ డే సందర్భంగా తమ (రామ్‌చరణ్, ఉపాసన) వివాహం జరిగి పదేళ్లు పూర్తయ్యాయని, తమ సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ లైఫ్‌కి ఇవే కారణాలై ఉండొచ్చన్నట్లుగా ఉపాసన కొన్ని సలహాలు, సూచనలను ఓ వీడియో రూపంలో షేర్ చేశారు. ∙దాంపత్య జీవితంలో ఆరోగ్యానిదే అగ్రస్థానం. కాబట్టి ఇద్దరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉదయాన్నే నిద్రలేవడం వల్లే మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నేను నమ్ముతాను. చాలామంది మ్యారేజ్ గోల్స్‌ను పెయిన్‌ఫుల్‌గా భావిస్తారు. కానీ ప్రేమతో చేస్తే అవే బ్యూటిఫుల్‌గా ఉంటాయి. ∙ప్రతిరోజూ మన ప్రియమైన వారితో కాస్త సమయాన్ని గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పుకోవడం, కలిసి సినిమాలు చూడటం.. ఇలాంటివి జీవితాన్ని మరింత ప్రేమతో నింపి మరింత అందంగా మారుస్తాయి. అలాగే వారంలో ఓసారి డేట్ నైట్‌ను ప్లాన్ చేసుకోండి. మీ వివాహ బంధంలో ఏవైనా దూరాలు ఉంటే మళ్లీ కనెక్ట్ అవ్వండి. జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించండి. ∙పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటారు కానీ అది నిజం కాదని నా నమ్మకం. భూమి మీద ఓ ఇద్దరు చేసే ఎఫర్ట్స్పైనే వారి దాంపత్య జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ అంశాలతో పాటు మన జీవిత భాగస్వామిపట్ల అమితమైన ప్రేమ, గౌరవాన్ని కూడా కలిగి ఉండాలని మర్చిపోవద్దు. -
ప్రేమకై పదేళ్లు దాక్కుంది.. మరీ అంత చిన్న గదిలో!
ప్రేమ కోసం లైలా, పార్వతి, జూలియెట్‌లు పడిన బాధ, వేదన వారిని కాలంతోపాటు నిలబెట్టింది. కేరళకు చెందిన సజిత ఇప్పుడు వీరి సరసన చేరనుంది. ప్రేమ కోసం ఇంటి నుంచి పారిపోయిన సజిత తన ఇంటి పదిళ్ల అవతల తన ప్రేమికుడి ఇంట్లో గత పదేళ్లుగా దాక్కుంది. ఆమె తన గదిలో ఉన్నట్టు ప్రేమికుడికి తప్ప ఎవ్వరికీ తెలియదు. తాజాగా ఈ ప్రేమ కథ బయటపడి అంతా దిగ్భ్రాంతి చెందుతున్నారు. ప్రేమకు కుల మతాలు అడ్డుగా ఉంటాయని భయపడినంత కాలం ఇలాంటి ప్రేమికులు తారసపడుతూనే ఉంటారు. సలీమ్‌ను ప్రేమించిన అనార్కలీని సలీమ్ నుంచి విడగొట్టడానికి అక్బర్ పాదుషా చీకటి గుహల్లోకి ఆమెను పంపించాడని ఒక కథనం. అయితే ఇక్కడ సలీమ్ ఉన్నాడు. అనార్కలీ కూడా ఉంది. అతని ప్రేమ కోసం ఆమె ఒక గదిలో చాటులో ఒకటి కాదు రెండు కాదు పదేళ్లు ఉండిపోయింది. రెండు రోజుల క్రితం కేరళలో ఈ ఘటన బయటపడింది. 2010లో ఫిబ్రవరి 2, 2010న పాలక్కాడ్ జిల్లాలోని అలియూర్ అనే పల్లెలో వేలాయుధన్ అనే వ్యక్తి 18 ఏళ్ల తన కుమార్తె సజిత కనపడటం లేదని పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులు వెంటనే సజితను వెతకడం ప్రారంభించారు. ఆ ఊళ్లో ఉన్న కుర్రాళ్లను పిలిచి ఎంక్వయిరీ చేశారు. ఏమీ క్లూ దొరకలేదు. మరోవైపు సజిత తల్లిదండ్రులు అలుపెరగకుండా సజితను వెతికారు. కాని ఆమె కనిపించలేదు. ఏళ్లు గడిచే కొద్ది వారు ఆమెపై ఆశ వదులుకున్నారు. మెల్లగా ఆమె చనిపోయిందనే నిర్థారణకు వచ్చారు. రేషన్ కార్డులో ఆమె పేరు తీయించేశారు కూడా. కాని ఆమె బతికే ఉంది. వాళ్లింటికి పదిళ్ల అవతలే ఉంది. నాలుగు గోడల గదిలో సజిత తన వీధిలోనే ఉన్న రహమాన్‌ను ప్రేమించింది. అతను చిన్నపాటి ఎలక్ట్రీషియన్. పెయింటర్. అయితే ఇరువురి మతాలు వేరు కాబట్టి పెళ్లికి ఇద్దరి పెద్దలు అడ్డం పడతారని వాళ్లకు సందేహం వచ్చింది. మరోవైపు సజితకు పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. సొంతంగా పారిపోయి బతికే ధైర్యం రహమాన్‌కు లేదు. అలాగే ఆర్థికంగా ఆమెను పోషించే స్థితిలో లేడు. కనుక వాళ్లిద్దరూ ఒక ఆలోచన చేశారు. ఫిబ్రవరి 2, 2010న ఎవరూ లేని సమయంలో ఆమె అతని ఇంటికి వచ్చేసింది. ఆ ఇంట్లో అతనికి ప్రత్యేకం ఒక గది ఉంది. ఆ గదిలో ఉండిపోయింది. ఆ గది లో ఆమె ఉన్నట్టు రహమాన్‌కు తప్ప ఇంకెవరికీ తెలియదు. రహమాన్ తండ్రి అబ్దుల్ ఘని, అతని భార్య డైలీ లేబర్స్. వాళ్లు ఉదయాన్నే పనికి వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేవారు. రహమాన్‌కు ఒక చెల్లెలు ఉంది. ఆమె ఇంట్లో ఉండేది. అయినప్పటికీ గత పదేళ్లుగా సజిత రహమాన్ గదిలో దాక్కుని ఉండిపోయింది. రహమాన్‌కు ముక్కోపం. అదీగాక సజితను తన గదిలో దాచాక కావాలని తిక్క తిక్కగా వ్యవహరించేవాడు. దాంతో అతనికి కొంచెం స్క్రూలూజ్ అని అతని జోలికి ఎవరూ వచ్చేవారు కాదు. అతను ఇంట్లో ఉంటే గదిలో ఉండేవాడు. బయటకు వెళితే గదికి తాళం వేసుకొని వెళ్లేవాడు. ఆ తాళం ఎవరూ తీయకుండా ప్రత్యేకంగా చేయించాడు. ఆ గదిలోనే అన్నం తీసుకెళ్లి తినేవాడు. ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. అందుకని కిటికీ ఊచలను తొలగించి అవి అవసరం ఉన్నప్పుడు తీసి పెట్టుకునేలా ఏర్పాటు చేశాడు. సజిత తన టాయిలెట్ అవసరాలను ఆ కిటికీ గుండా రాత్రిళ్లు బయటకు వెళ్లి తీర్చుకునేది. గదిలో సజిత ఉన్నందున రహమాన్ తక్కువగా పనికి వెళ్లేవాడు. ఎక్కువగా ఇంట్లో లేదా గదిలో ఉండేవాడు. ఆమె లోపలే ఉండిపోయేది. ఒక టీవీ ఉంది ఆ గదిలో. అదే ఆమె కాలక్షేపం. ఎలా బయటపడింది? మూడు నెలల క్రితం రహమాన్ ఇంట్లో వాళ్లతో గొడవపడ్డాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. దాంతో రహమాన్ అన్న (మరో ఊరిలో ఉంటాడు) పోలీస్ కంప్లయింట్ ఇచ్చాడు. అయితే పోలీసులు ఇతణ్ణి వెతకలేకపోయారు. నాలుగు రోజుల క్రితం రహమాన్ అన్న ఏదో పని మీద దాపునే ఉన్న ‘నెమర’ అనే చిన్న టౌన్‌కి వెళితే అక్కడ మోపెడ్ మీద వెళుతున్న రహమాన్ కనిపించాడు. వెంటనే అన్న పోలీసులకు చెప్తే వాళ్లు అతణ్ణి పట్టుకున్నారు. ఆ సమయంలోనే అతను సజితతో ఒక అద్దె ఇంట్లో జీవిస్తున్నాడని తెలిసింది. ఇద్దరూ విముక్తులు పోలీసులు ఇద్దర్నీ కోర్టులో హాజరు పరిచారు. జడ్జి సజితను ‘ఎక్కడ ఉంటావమ్మా’ అని అడిగితే రహమాన్తోనే అని చెప్పింది. కోర్టు ఇద్దరినీ పంపించేసింది. అయితే ఈ సంగతి విన్న ఊరి వాళ్లు ఇరు పక్షాల పెద్దలు దిగ్భ్రమలో ఉండిపోయారు. పోలీసులు వీరి కథనాన్ని ఏ మాత్రం నమ్మలేదు. రహమాన్‌ను విడిగా, సజితను విడిగా ప్రశ్నిస్తే ఒకే కథ చెప్పారు ఇద్దరూ. వారు ఉన్న గదిని చూసి ఇంత చిన్న గదిలో ఇన్నాళ్లు ఈమె ఎలా ఉందా అని పోలీసులు ఆశ్చర్యపోయారు. సమాజం ఇంత ముందుకు పోయినా మన దగ్గర అమ్మాయిలు, అబ్బాయిలు తమ ప్రేమను, జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ పూర్తిగా లేదు. అడ్డంకులు జాస్తి. ఆ అడ్డంకులు జీవితాలను, ప్రాణాలను నాశనం చేసే వరకూ వెళతాయని అనేక ఘటనలు నేటికీ రుజువు చేస్తూనే ఉన్నాయి. కాని ప్రేమ ఆగదు. ప్రేమను గట్టిగా కాపాడుకోవాలనుకునేవారు అందుకై కొత్త కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటారు. అయితే సజిత ఎంచుకున్న మార్గం మాత్రం అనూహ్యం. ఏ వ్యక్తికీ అన్ని రోజులు అలా ఒక గదిలో ఉండటం సాధ్యం కాదు. బహుశా ప్రేమ ఆమెకు ఆ శక్తి ఇచ్చిందేమో. ప్రస్తుతానికి వీరి కథ సుఖాంతం. వీరి ప్రేమను విడగొట్టాలనే సాహసం ఇంత కథ విన్నాక ఏ పెద్దలూ చేయరేమో. సమాజం ఇంత ముందుకు పోయినా మన దగ్గర అమ్మాయిలు, అబ్బాయిలు తమ ప్రేమను, జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ పూర్తిగా లేదు. అడ్డంకులు జాస్తి. ఆ అడ్డంకులు జీవితాలను, ప్రాణాలను నాశనం చేసే వరకూ వెళతాయని అనేక ఘటనలు నేటికీ రుజువు చేస్తూనే ఉన్నాయి. కాని ప్రేమ ఆగదు. ప్రేమను గట్టిగా కాపాడుకోవాలనుకునేవారు అందుకై కొత్త కొత్త మార్గాలు వెతుకుతూనే ఉంటారు. అయితే సజిత ఎంచుకున్న మార్గం మాత్రం అనూహ్యం. – సాక్షి ఫ్యామిలీ -
మన ఆయుర్దాయం మరో పదేళ్లు!
న్యూఢిల్లీ: భారతీయుల ఆయుర్దాయం పదేళ్లకు పైగా పెరిగిందని లాన్సెట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 1990 నుంచి 2019 మధ్య భారతీ యుల ఆయుఃప్రమాణాలు పెరిగినప్పటికీ రాష్ట్రా నికీ, రాష్ట్రానికీ మధ్య తీవ్ర వ్యత్యాసాలు ఉన్నా యని పేర్కొంది. 1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకు పెరిగినట్టుగా లాన్సెట్ జర్నల్ ప్రచురించిన అధ్యయనం తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో మనుషుల ప్రాణాలు తీసే 286 వ్యాధులు ఎలా ప్రబలుతున్నాయో, మరో 369 వ్యాధుల తీవ్రత ఎలా ఉందో అంచనా వేసి సగటు ఆయుః ప్రమాణాలను అధ్యయనకారులు లెక్కించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్తల్లో ఒకరైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, గాంధీనగర్‌కి చెందిన ప్రొఫెసర్ శ్రీనివాస్ గోలి భారతీయుల్లో ఆయుర్దాయం పెరిగినంత మాత్రాన వారి ఆరోగ్యాలు మెరుగుపడ్డాయని చెప్పలేమన్నారు. చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల తో బాధపడుతూనే బతుకులీడుస్తున్నారని చెప్పారు. ► 1990లో 59.6 సంవత్సరాలుగా ఉన్న సగటు ఆయుర్దాయం 2019 నాటికి 70.8 ఏళ్లకి పెరిగింది. ► కేరళలో సగటు ఆయుర్దాయం అత్యధికంగా 77.3 సంవత్సరాలు కాగా, ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 66.9 ఏళ్లుగా ఉంది. ► భారత్‌లోని వ్యాధుల్లో 58% ఒకరి నుంచి మరొకరికి సంక్రమించని వ్యాధులే (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) ప్రబలుతున్నాయి ► గత 30 ఏళ్లలో గుండె, ఊపిరితిత్తులుæ, మధుమేహం, కండరాలకు సంబంధించిన వ్యాధులు అధికమయ్యాయి. ► 2019లో వాయుకాలుష్యం (16.7 లక్షల మృతులు), అధిక రక్తపోటు (14.7 లక్షలు), ► పొగాకు వినియోగం (12.3 లక్షలు), పౌష్టికాహార లోపం (11.8 లక్షలు) మధుమేహం (11.8 లక్షలు) కారణంగా మరణాలు ఎక్కువగా సంభవించాయి. ► దక్షిణాది రాష్ట్రాల్లో అధిక రక్త పోటు కారణంగా 10–20 శాతం మంది అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఊబకాయంతో కరోనా తీవ్రం భారత్‌తో పాటుగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ప్రజల ఆయుర్దాయాలు పెరిగాయని, అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయని అ«ధ్యయనం సహరచయిత గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ అలీ మొక్దాద్ చెప్పారు. ఊబకాయం, డయాబెటిస్ వంటి వాటితో కరోనా వైరస్ ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుందని చెప్పారు. భారత్‌లో ఒకప్పుడు మాతా శిశు మరణాలు అత్యధికంగా ఉండేవని, అవిప్పుడు బాగా తగ్గుముఖం పట్టాయన్నారు. -
రికార్డు వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: వానాకాలం.. పదేళ్ల అనంతరం కొత్త రికార్డ్‌ను నెలకొల్పింది. నైరుతి రుతుపవనాలు, అల్పపీడనాలకు తోడు కొత్తగా ఏర్పడ్డ షీర్జోన్తో కురిసిన కుంభవృష్టి తెలంగాణను నిండు కుం డలా మార్చేసింది. జూన్ మొదటి వారంలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సోమవారం నుంచి మొదలైంది. ఈ నాలుగు మాసాల్లో ఏకంగా 16 జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదవ్వగా.. 11 జిల్లాల్లో అధిక వర్షపాతం, 6 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయింది. వాస్తవానికి నాలుగు మాసాల్లో 711.7 మి.మీ.ల సగటు వర్షం కురువాల్సి ఉండగా ఏకంగా 1,071 మి.మీ.ల వర్షం కురిసింది. ఇది సాధారణ సగటుతో పోలిస్తే దాదాపు 50 శాతం అధికం.. ఇంత భారీ ఎత్తున వర్షాలు గడిచిన పదేళ్లలో 2010లో సాధారణ సగటు కంటే 32 శాతం అధికంగా నమోదు కాగా ఈ మారు ఆ రికార్డు చెరిగిపోయింది. సగం రోజులు వానలే.. ఈ సీజన్ ప్రారంభం నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో సగం రోజులు (రెయినీ డేస్) వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో జూలైలో 23 రోజులు, ఆగస్టులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25, ములుగులో 24, మహబూబాబాద్‌లో 23, ఆగస్టులో రంగారెడ్డిలో 18, ఆదిలాబాద్‌లో 17 రోజులు వర్షాలు కురిశాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఏర్పడ్డ 9 అల్పపీడనాల వల్ల కూడా భారీగా వర్షం నమోదైంది. జూన్ 9, జూలై 5, ఆగస్టులో 4, 9, 13, 19, 24, సెప్టెంబర్‌లో 13, 20 తేదీల్లో బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనాల ప్రభావ వర్షాలతో అన్ని పల్లెలు, పట్టణాలు తడిసి ముద్దయ్యాయి. వీటికి తోడు తెలంగాణ భూ ఉపరితలంపై 15–16 రేఖాంశాల మధ్య ఏర్పడ్డ షీర్‌జోన్ కూడా దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో కుండపోతకు కారణమయ్యాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో టాప్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రికార్డు వర్షాలు నమోదయ్యాయి. వనపర్తి జిల్లాలో 150 శాతం, నారాయణపేటలో 140, గద్వాలలో 130 శాతం వర్షాలు కురిశాయి. రాష్ట్రమంతా భారీ వర్షపాతం నమోదైనా.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కురువాల్సిన సాధారణ వర్షం కంటే కాస్త తక్కువగా నమోదు కావటం గమనార్హం. నిర్మల్‌లో 944.9 మి.మీ.కి 819 మి.మీలు, ఆదిలాబాద్‌లో 995.4 మి.మీకి గానూ 908.1 మి.మీ. కురిసింది. షీర్‌జోన్స్ అంటే.. వాతావరణ పరిభాషలో షీర్‌జోన్స్ అంటే.. తూర్పు, పడమర ప్రాంతాల్లో ఒకే అక్షాంశం (లాట్యిట్యూడ్)తో ఎదురెదురుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడితే ఆ మధ్య ప్రాంతాన్ని షీర్‌జోన్స్ అంటారు. రెండు ఉపరితల ఆవర్తనాల మధ్య ప్రాంతం షీర్‌జోన్ అన్నమాట. ఇవి సాధారణంగా 15 లేదా 16 లేదా 17 డిగ్రీల లాట్యిట్యూడ్స్లో ఏర్పడతాయి. ఈసారి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈ షీర్‌జోన్స్ అధికంగా ఏర్పడటంతోనే ఆయా ప్రాంతాల్లో ఎన్నడూ లేనంతగా వర్షపాతం నమోదైంది. అత్యధిక అల్పపీడనాల వల్లే.. ఈ సీజన్లో ఏకంగా 9 అల్పపీడనాల వల్ల భారీగా వర్షం కురిసింది. వీటి వల్ల రెయినీడేస్ బాగా పెరిగాయి. అల్పపీడనాలతో ఉత్తర తెలంగాణ జిల్లాలు, చీర్ జోన్స్ ఏర్పడటంతో దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. – రాజారావు, హైదరాబాద్ వాతావరణ అధికారి లానినో వల్లే.. ప్రతి ఐదేళ్లకు ఒకసారి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుం టాయి.. అందులో భాగంగానే ఎల్‌నినో, లానినోలు ఏర్పడతాయి. ఈ మారు లానినో ప్రభావం వల్లే అత్యధిక వర్షాలు కురిశాయి. సాధారణ కంటే అధికంగా కురిస్తే లాభం కంటే నష్టమే అధికం. అయితే రెయినీ డేస్ ఎక్కువగా ఉండటం వల్ల భూగర్భ జలాలు వృద్ధి అయ్యేందుకు అవకాశముండటం సంతోషకర పరిణామం. –డా. సాయిభాస్కర్రెడ్డి, శాస్త్రవేత్త -
టెల్కోలకు కాస్త ఊరట
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల భారంతో కుంగుతున్న టెలికం సంస్థలకు సుప్రీంకోర్టు కాస్త ఊరట కల్పించింది. బకాయిల చెల్లింపునకు 10 సంవత్సరాల వ్యవధినిచ్చింది. 2021 మార్చి 31లోగా బాకీలో 10 శాతం భాగాన్ని కట్టాలని ఆదేశించింది. ఆయా టెల్కోల మేనేజింగ్ డైరెక్టర్లు (ఎండీ) లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు (సీఈవో) బకాయిల చెల్లింపునకు సంబంధించి నాలుగు వారాల్లోగా వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. వాయిదాలను చెల్లించని పక్షంలో జరిమానా, వడ్డీ విధించడంతో పాటు కోర్టు ఆదేశాల ధిక్కరణ కింద చర్యలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇక దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థలు స్పెక్ట్రంను విక్రయించే అంశంపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తుది ఉత్తర్వులు ఇస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. బాకీల లెక్కింపునకు సంబంధించి టెలికం శాఖ లెక్కలు, గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో మార్పేమీ ఉండబోవని జస్టిస్ అరుణ్ మిశ్రా సారథ్యంలోని బెంచ్ స్పష్టం చేసింది. వాస్తవానికి బాకీల చెల్లింపునకు టెల్కోలు, టెలికం శాఖ (డాట్) 20 ఏళ్ల వ్యవధికి అనుమతి కోరాయి. కానీ దాన్ని తిరస్కరించిన సుప్రీం కోర్టు పదేళ్ల వ్యవధికి అనుమతించడం గమనార్హం. వొడాఫోన్‌కు కష్టం.. ఎయిర్‌టెల్‌కు ఫర్వాలేదు.. సుప్రీం కోర్టు తాజా ఆదేశాల ప్రకారం పదేళ్ల వ్యవధిలో బాకీలన్నీ కట్టాలంటే వొడాఫోన్ ఐడియాకు కష్టంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భారతీ ఎయిర్టెల్ మాత్రం షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు జరిపే అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంది. ఎనిమిది శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే ఏటా భారతీ ఎయిర్టెల్ రూ. 3,900 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 7,500 కోట్లు కట్టాల్సి వస్తుందని లెక్క వేసింది. ఒకవేళ వడ్డీ భారం గానీ లేకపోతే ఇది రూ. 2,600 కోట్లు /రూ. 5,000 కోట్లకు తగ్గవచ్చని వివరించింది. ఇంకా వడ్డీ రేటు విషయంలో నిర్దిష్ట ఉత్తర్వులేమీ లేవని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ (ఈక్విటీ స్ట్రాటెజిస్ట్ బ్రోకింగ్ విభాగం) హేమంగ్ జానీ తెలిపారు. ‘ఎయిర్‌సెల్, వీడియోకాన్ కట్టాల్సిన బాకీల భారం ఎయిర్‌టెల్‌పై పడదు. అలాగే ఆర్‌కామ్ బకాయిల భారం రిలయన్స్ జియోపై ఉండదు. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు ఎయిర్టెల్, రిలయన్స్‌లకు సానుకూలమైనవే కాగలవు‘ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రీపేమెంట్ గడువులోగా లైసెన్సుల వ్యవధి ముగిసిపోయే టెలికం సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని కేఎస్ లీగల్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్నర్ సోనమ్ చంద్వాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి టెల్కోలు లైసెన్సును రెన్యువల్ చేసుకోవడంలో విఫలమైతే పదేళ్ల వ్యవధి కన్నా ముందే బకాయి మొత్తం కట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఏం జరిగింది.. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) ఫార్ములా ప్రకారం స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజుల బాకీలను కేంద్రానికి టెలికం సంస్థలు కట్టాల్సిందేనని సుప్రీంకోర్టు గతేడాది అక్టోబర్‌లో ఆదేశాలు ఇచ్చింది. డాట్ లెక్కించిన దాని ప్రకారం టెల్కోలు దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు పైచిలుకు కట్టాల్సి ఉంది. అయితే, తమ సొంత లెక్కల ప్రకారం తమ బాకీలు అంత భారీ స్థాయిలో లేవంటూ టెల్కోలు కొంతమేర కట్టాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున మిగతాది కట్టేందుకు 20 ఏళ్ల వ్యవధినివ్వాలంటూ కోరాయి. అటు టెలికం శాఖ కూడా 20 ఏళ్ల వ్యవధినివ్వడంపై ఈ ఏడాది మార్చిలో అఫిడవిట్ దాఖలు చేసింది. వాయిదా పద్ధతిలో బాకీలు చెల్లించడంపై జూలై 20న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసి ఉంచింది. అయితే, బాకీ మొత్తం విషయానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులేమీ ఉండబోవంటూ స్పష్టం చేసింది. ఇదే క్రమంలో టెలికం కంపెనీల గత పదేళ్ల ఖాతాలు సమర్పించాలని సూచించింది. అటు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), రిలయన్స్ జియో మధ్య స్పెక్ట్రం షేరింగ్ ఒప్పందం వివరాలు కూడా ఇవ్వాలని ఆగస్టు 14న సూచించింది. తాజాగా బాకీల చెల్లింపు వ్యవధి విషయంలో ఆదేశాలు జారీ చేసింది. -
నిరీక్షణకు తెర...
మస్కట్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా పదేళ్ల నిరీక్షణకు భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ తెరదించాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఒమన్ ఓపెన్ చాలెంజర్ ప్లస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో శరత్ కమల్ చాంపియన్ అయ్యాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో 37 ఏళ్ల శరత్ కమల్ 6–11, 11–8, 12–10, 11–9, 3–11, 17–15తో టాప్ సీడ్ ఫ్రెటాస్ మార్కోస్ (పోర్చుగల్)ను బోల్తా కొట్టించాడు. ఏథెన్స్, బీజింగ్, రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన శరత్ కమల్ చివరిసారి అంతర్జాతీయస్థాయిలో 2010లో ఈజిప్ట్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఆ తర్వాత అతను రెండు టోర్నమెంట్లలో (మొరాకో ఓపెన్–2011; ఇండియా ఓపెన్–2017) సెమీఫైనల్ చేరి ఓడిపోయాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో శరత్ 11–13, 11–13, 13–11, 11–9, 13–11, 8–11, 11–7తో కిరిల్ స్కచ్కోవ్ (రష్యా)పై గెలవగా... మరో భారత ఆటగాడు హర్మీత్ దేశాయ్ 11–5, 9–11, 11–6, 11–6, 8–11, 11–13, 3–11తో మార్కోస్ చేతిలో ఓడాడు. -
చిరంజీవి ఇంట్లో తారల సందడి
‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ రీయూనియన్ పదో యానివర్సరీ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా జరుపుకున్నారు స్టార్స్. 1980లలో నటించిన స్టార్స్ ప్రతీ ఏడాది సరదాగా కలసి రీయూనియన్ జరుపుకుంటారు. ఈ ఏడాది పదో యానివర్సరీని చిరంజీవి హోస్ట్ చేశారు. ఈ పార్టీ హైదరాబాద్‌లోని చిరంజీవి స్వగృహంలో జరిగింది. ఈ వేడుకకు 40మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలకు చెందిన నటీనటులున్నారు. పైన ఉన్న ఫొటోలో ప్రభు, జయరామ్, సురేశ్, రెహమాన్, ఖుష్భూ, వెంకటేశ్, రాధిక, భానుచందర్, సుమన్, శోభన, నదియా, రాధ, సరిత, అమల, జగపతిబాబు, జయసుధ, సుమలత, నాగార్జున, మోహన్‌లాల్, లిజీ, భాగ్యరాజ్, జయసుధ, శరత్‌కుమార్, వీకే నరేశ్, రమేశ్ అరవింద్, జాకీ ష్రాఫ్, సుహాసిని, రేవతి తదితరులు ఉన్నారు. ప్రతీ ఏడాది జరిగే పార్టీకి ఓ డ్రెస్‌కోడ్ ఉంటుంది. ఈ ఏడాది డ్రెస్ కోడ్ బ్లాక్, గోల్డ్ కలర్స్. అందరూ అదే రంగు దుస్తుల్లో హాజరయ్యారు. ఈ పార్టీలో అంత్యాక్షరీ, మ్యూజికల్ చైర్స్ వంటి సరదా ఆటలతో కాలక్షేపం చేశారని తెలిసింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆఫ్టర్ టెన్ ఇయర్స్..మనమూ రిచెస్ట్
మరో దశాబ్ద కాలంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అత్యంత సంపన్న నగరంగా అవతరించనుంది. అంతేకాదు విశ్వవ్యాప్తంగా సంపన్న నగరాల జాబితాలో ర్యాంక్ సాధించి గ్రేటర్ సిటీ బాద్షా కానుందని నైట్‌ఫ్రాంక్ సంస్థ తాజాగా విడుదల చేసిన న్యూ వరల్డ్ వెల్త్ రిపోర్ట్‌లో వెల్లడించింది. దేశంలో ఫార్మా రాజధానిగా భాసిల్లుతున్న హైదరాబాద్‌లో ఐటీ, బీపీఓ, రియల్టీ రంగాలు శరవేగంగా పురోగమిస్తుండటంతో పలు దిగ్గజ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నట్లు ఈ నివేదికలో వెల్లడించింది. కాగా, ప్రపంచ సంపన్న నగరాల జాబితాలో అమెరికాలోని న్యూయార్క్ 3 ట్రిలియన్ డాలర్ల సంపదతో అగ్రభాగాన నిలవగా.. మన దేశ వాణిజ్య రాజధాని ముంబై 0.96 ట్రిలియన్ డాలర్ల సంపదతో 12వ ర్యాంక్ సాధించడం విశేషం. పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచిన ఢిల్లీ, బెంగళూరు సైతం రాబోయే పదేళ్లలో సంపన్న నగరాల జాబితాలో చోటు దక్కించుకోవడం ఖాయమని ఈ నివేదిక తెలిపింది. సుమారు 90 దేశాల్లోని 100 నగరాల్లో వ్యాపార, వాణిజ్య, పెట్టుబడులు తదితర అంశాలను అధ్యయనం చేసి టాప్–20 సంపన్న నగరాల జాబితాను ఈ నివేదిక ప్రకటించింది. – సాక్షి, హైదరాబాద్ హైదరా‘బాద్షా’ఇలా... హైదరాబాద్ రాబోయే పదేళ్లలో సంపన్న నగరాల జాబితాలో చోటు దక్కించుకోవడం ఖాయమని ఈ నివేదిక అంచనా వేసింది. బల్క్ డ్రగ్, ఫార్మా, ఐటీ, బీపీఓ ఎగుమతులు, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు హైదరాబాద్ నగరానికి ఆర్థిక రంగంలో చోదక శక్తులుగా నిలవనున్నాయని ఈ నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 2.07 బి. డాలర్ల మేర ఫార్మా ఎగుమతు ఉండటం విశేషమని పేర్కొంది. ఐటీ ప్రగతి ఇలా... ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఐసీటీ, హార్డ్‌వేర్ పాలసీలతోపాటు ఇమేజ్, ఇన్నోవేషన్, డ్రోన్ పాలసీ, సైబర్ సెక్యూరిటీ పాలసీలు ఐటీ రంగ వృద్ధికి దోహదం చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా తెలంగాణ ఐటీ ఎగుమతులు గతేడాది రూ.1.09 లక్షల కోట్ల మేర ఉన్నాయని తెలిపాయి. కాగా గ్రేటర్ కేంద్రంగా పలు దిగ్గజ సంస్థలకు చెందిన 647 ఐటీ కంపెనీల బ్రాంచీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. టాప్–5 సంపన్ననగరాలివే.. 1.న్యూయార్క్(3 ట్రి.డా.) 2.టోక్యో(2.50 ట్రి.డా.) 3.శాన్ఫ్రాన్సిస్కో(2.40 ట్రి.డా.) 4.లండన్(2.40 ట్రి.డా.) 5.బీజింగ్(2.10 ట్రి.డా.)(సంపద ట్రిలియన్ డాలర్లలో) -
జొకోవిచ్ కొత్త చరిత్ర
పారిస్: ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఓపెన్ శకంలో వరుసగా పదేళ్లు ఈ టోర్నీలో కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 6–3, 6–2, 6–2తో జాన్ లెనార్డ్ స్ట్రాఫ్ (జర్మనీ)పై అలవోకగా గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు. 2005 నుంచి క్రమం తప్పకుండా ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న జొకోవిచ్ 2010 నుంచి ఇప్పటివరకు నాలుగుసార్లు క్వార్టర్ ఫైనల్‌కు, రెండుసార్లు సెమీఫైనల్‌కు, నాలుగుసార్లు ఫైనల్‌కు చేరుకున్నాడు. బుధవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో ఐదో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జొకోవిచ్ ఆడతాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో జ్వెరెవ్ 3–6, 6–2, 6–2, 7–6 (7/5)తో తొమ్మిదో సీడ్ ఫాగ్నిని (ఇటలీ)పై... ఏడో సీడ్ నిషికోరి (జపాన్) 6–2, 6–7 (8/10), 6–2, 6–7 (8/10), 7–5తో బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై, నాలుగో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 6–4, 6–4, 6–2తో మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. పెయిర్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక ఐదో సెట్లో నిషికోరి 1–4, 3–5తో వెనుకబడినప్పటికీ పుంజుకొని నెగ్గడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్‌తో నిషికోరి తలపడతాడు. క్వార్టర్స్‌లో హలెప్, కీస్ మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సిమోనా హలెప్ (రొమేనియా), ఎనిమిదో సీడ్ యాష్లే బార్టీ (ఆస్ట్రేలియా), 14వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), అన్‌సీడెడ్ అనిసిమోవా (అమెరికా) క్వార్టర్ ఫైనల్లోకి చేరారు. ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో హలెప్ 6–1, 6–0తో స్వియాటెక్ (పోలాండ్)పై, యాష్లే బార్టీ 6–3, 3–6, 6–0తో సోఫియా కెనిన్ (అమెరికా)పై, కీస్ 6–2, 6–4తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, 17 ఏళ్ల అనిసిమోవా 6–3, 6–0తో క్వాలిఫయర్ అలియోనా బొల్సోవా (స్పెయిన్)పై విజయం సాధించారు. మూడో రౌండ్లో టాప్ సీడ్ నయోమి ఒసాకా (జపాన్)పై నెగ్గిన సినియకోవా, అమెరికా దిగ్గజం సెరెనాను ఓడించిన సోఫియా కెనిన్ ప్రిక్వార్టర్ ఫైనల్లో మాత్రం తడబడ్డారు. -
జనమే సాక్షి
-
మరో దాడి జరిగితే యుద్ధమే..!
ముంబై పీడకలకు పదేళ్లు. దేశ ఆర్థిక రాజధానిని తూటాల వర్షంతో చిన్నాభిన్నం చేసిన ఉగ్ర విధ్వంసం జరిగి దశాబ్దం గడిచింది. దేశ భద్రతకు సవాలుగా నిలిచిన పాకిస్తాన్ ఉగ్ర కుట్ర జరిగి పదేళ్లయింది. నేటికి సరిగ్గా పదేళ్ల కిత్రం ముంబైపై ఆధునిక ఆయుధాలతో విరుచుకుపడిన 12 మంది లష్కరే రాక్షసుల బారిన పడి 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్లో ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఆధునిక శిక్షణ పొందిన ఆ ఉగ్రవాదులను మట్టుపెట్టే క్రమంలో సందీప్ ఉన్నికృష్ణన్, హేమంత్ కర్కరే, విజయ్ సలాస్కర్, అశోక్ కామ్టే తదితర సాహస అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటనకు పదేళ్లయిన సందర్భంగా కొన్ని జ్ఞాపకాలు.. ముంబై/వాషింగ్టన్: 26/11 అంతటి తీవ్ర దాడులు భారత్‌పై మరోసారి జరిగితే భారత్, పాక్‌ల మధ్య ప్రాంతీయ యుద్ధం సంభవించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. 2008 నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైలో మారణహోమం సృష్టించి 166 మందిని పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. ఈ దాడికి సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ పాకిస్తాన్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడనీ, దాడికి కారకులను శిక్షిస్తామని ఇచ్చిన మాటను పాక్ నిలబెట్టుకోలేదని వారు పేర్కొన్నారు. అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) మాజీ అధికారి బ్రూస్ రీడెల్ మాట్లాడుతూ ‘26/11 దాడి సూత్రధారులకు శిక్ష పడటాన్ని బాధిత కుటుంబాలు ఇంకా చూడాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ వైఖరి చూస్తుంటే ఇది దాదాపుగా అసాధ్యమనిపిస్తోంది. ఇంతటి తీవ్రమైన దాడి మరోసారి జరిగితే ఇక యుద్ధం అనివార్యం కావొచ్చు’ అని అభిప్రాయ పడ్డారు. దాడుల సమయంలో అమెరికాలో పాక్ రాయబారిగా పనిచేసిన హుస్సేన్ హక్కానీ మాట్లాడుతూ ‘ఇంకో దాడి జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అయితే 26/11 దాడుల సూత్రధారులను శిక్షిస్తామన్న తమ హామీని పాక్ నిలబెట్టుకోవాలి. కానీ వారందరినీ పాక్ వదిలేసింది. అందరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అంటే భారత్‌పై ఉగ్రదాడికి పాల్పడిన వారిని తాము ఉపేక్షిస్తామని పాక్ పరోక్షంగా చెబుతోంది’ అని అన్నారు. దాడుల సమయంలో అమెరికా జాతీయ భద్రతా మండలి దక్షిణాసియా విభాగ డైరెక్టర్‌గా ఉన్న అనీశ్ గోయెల్ మాట్లాడుతూ ‘భారత్–పాక్‌ల యుద్ధాన్ని నివారించడమే నాడు మా ప్రధాన లక్ష్యం. నాటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, నాటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఫోన్ చేసి సంయమనం పాటించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఓ దశలో పాక్‌పై భారత్ యుద్ధానికి దిగుతుందని కూడా నాడు అనిపించింది’ అని చెప్పారు. పోలీసులు ఉగ్రవాదుల్ని పారిపోనిచ్చారు ఫొటో జర్నలిస్ట్ సెబాస్టియన్ ముంబై మారణహోమం సందర్భంగా ఉగ్రవాదులను నిలువరించే అవకాశమున్నప్పటికీ భయపడ్డ మహారాష్ట్ర పోలీసులు వారిని పారిపోనిచ్చారని కసబ్ ఫొటోను షూట్చేసిన జర్నలిస్ట్ సెబాస్టియన్ డిసౌజా అలియాస్ సబీ(67) తెలిపారు. ముంబై దాడులకు నేటితో పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘2008, నవంబర్ 26న నేను ఆఫీసులో పనిచేసుకుంటుండగా పక్కనే ఉన్న సీఎస్టీలో కాల్పుల శబ్దం వినిపించింది. వెంటనే నా కెమెరా, లెన్సులు తీసుకుని కిందకు పరిగెత్తాను. రైల్వేస్టేషన్‌లోకి దూరి ఓ బోగీలో దాక్కున్నా. కానీ అక్కడి నుంచి ఫొటో తీయడానికి యత్నించగా కుదరలేదు. దీంతో మరో బోగీలోకి వెళ్లి ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఉగ్రవాదుల ఫొటోలు తీశాను’ అని చెప్పారు. క్రూరంగా నవ్వుతూ కాల్పులు సీఎస్టీ అనౌన్సర్ విష్ణు ఛత్రపతి శివాజీ టెర్మినస్(సీఎస్టీ) రైల్వేస్టేషన్ లో క్రూరంగా నవ్వుతూ అమాయకులపై గుళ్ల వర్షం కురిపించిన ఉగ్రవాది కసబ్ ముఖం తనకు ఇంకా గుర్తుందని ఆరోజు అనౌన్సర్‌గా విధులు నిర్వర్తిస్తున్న విష్ణు జెందె(47) గుర్తుచేసుకున్నారు. ‘నవంబర్ 26న రాత్రి 9.15 గంటల సమయంలో రైల్వేస్టేషన్లో పెద్ద శబ్దం వినిపించగానే ఏదో పేలుడు జరిగిందనుకున్నా. కానీ ఇద్దరు వ్యక్తులు తుపాకులు పట్టుకుని వస్తుండటాన్ని చూడగానే ఇది ఉగ్రదాడి అని అర్థమైపోయింది. ప్రయాణికులందరూ రైల్వేస్టేషన్ నుంచి వెళ్లిపోవాలనీ, ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారని ప్రజల్ని అప్రమత్తం చేశా. ఉగ్రవాదులకు దూరంగా ఉన్న ప్లాట్‌ఫామ్ 1 దగ్గరి నుంచి బయటకు వెళ్లిపోవాలని చెప్పా. ఘటనాస్థలికి చేరుకోవాల్సిందిగా రైల్వే పోలీసులను కోరాను. మరోవైపు సహచరుడితో కలిసి ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్న కసబ్ క్రూరంగా నవ్వుతూ, దూషిస్తూ ప్రయాణికులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు’ అంటూ నాటి అనుభవాలను విష్ణు గుర్తుచేసుకున్నారు. రెండుసార్లు ఫెయిల్ ముంబైలో ఉగ్రదాడికి పాల్పడ్డ పాక్ పౌరుడు కసబ్‌కు లష్కరే తోయిబా కరాచీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు తాజాగా వెల్లడైంది. ప్రము ఖ చరిత్రకారుడు సరోజ్ కుమార్ రత్ కసబ్ విచారణాధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ రాసిన ‘ఫ్రజైల్ ఫ్రంటియర్స్: ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ముంబై టెర్రర్ అటాక్స్’ పుస్తకంలో ఈ అంశాలను ప్రస్తావించారు. ‘కసబ్‌కు తొలుత నావికుడిగా, చేపలుపట్టేలా ఐఎస్ఐ అధికారులు, లష్కరే తోయిబా కమాండర్లు రెండేళ్లు శిక్షణ ఇచ్చారు. అయితే ఉగ్రదాడి కోసమే ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పలేదు. ఇది ఎవరికైనా తెలిస్తే భారత్‌పై దాడిచేసే మార్గాలు మూసుకుపోతాయన్న భయంతో టాప్ కమాండర్లు హఫీజ్ సయీద్, జకీవుర్ రెమ్మాన్ లఖ్వీ గోప్యత పాటించారు. ముంబైపై 2008, నవంబర్ 26న దాడికి ముందు లష్కరే చేసిన రెండు ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2008, సెప్టెంబర్‌లో ఉగ్రవాదులను తీసుకెళుతున్న బోటు సముద్రంలో ఓ రాయిని ఢీకొని మునిగిపోయింది. దీంతో లష్కరే వర్గాలు కొనప్రాణాలతో ఉన్న తమ ఉగ్రవాదుల్ని కాపాడాయి. ఇక రెండోసారి నవంబర్ 7న ఉగ్రవాదుల బృందం మరోసారి భారత్‌కు బయలుదేరింది. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన ఓ బోటు కెప్టెన్‌ను లొంగిపోవాల్సిందిగా ఉగ్రవాదులు కోరగా, అతను నిరాకరించి పడవను వేగంగా తీసుకెళ్లిపోయాడు. ‘ఆపరేషన్ కసబ్’ ఇలా.. ప్రాణాలతో చిక్కిన ఉగ్రవాది కసబ్‌ను ఉరితీసేందుకు ఏర్పాట్లు చాలా రహస్యంగా సాగాయని ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘కసబ్‌ను ఉరితీయడం కోసం ఆర్థర్రోడ్ జైలులోని అండా సెల్ నుంచి పుణెలోని ఎర్రవాడ కేంద్ర కారాగారానికి తరలించడానికి నవంబర్ 20న రాత్రి ఏర్పాట్లు పూర్తిచేశాం. రాత్రిపూట కసబ్‌ను పోలీస్ వ్యానులో ఎక్కించాం. మహారాష్ట్ర పోలీసులకు చెందిన ఫోర్స్ వన్ కమాండో బృందం ఈ వాహనానికి రక్షణగా బయలుదేరింది. ఎక్కువ కార్లు ఒకేసారి వెళితే అనుమానం రావొచ్చన్న ఆలోచనతో రాష్ట్ర రిజర్వు పోలీస్ బలగాలు కొంతదూరం నుంచి ఈ వాహనాలను వెంబడించాయి. ఈ ఆపరేషన్ ముగిసేవరకూ ఇందులో పాల్గొన్న అధికారుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నాం. అర్ధరాత్రి కసబ్‌ను ఎర్రవాడ జైలు అధికారులకు అప్పగించగానే..‘పార్సిల్ రీచ్డ్ ఫాక్స్’ అంటూ పోలీస్ ఉన్నతాధికారి సంకేత భాషలో మిగతావారికి సమాచారం చేరవేశారు. ఉరితీత నోటీసులను వారంరోజుల కసబ్‌కు అందజేశాం. చివరికి నవంబర్ 21న తెల్లవారుజామున 3 గంటలకు కసబ్‌ను ఉరితీశారు. ఆ తర్వాత కసబ్ ఉరి వార్త ప్రపంచమంతా తెలిసిపోయింది’ అని అప్పటి అనుభవాలను గుర్తుచేసుకున్నారు. -
పదేళ్ల తర్వాత మహిళ అధ్యక్షతన రాజ్యసభ
న్యూఢిల్లీ: రాజ్యసభకు గత పదేళ్లలో తొలిసారి ఓ మహిళ అధ్యక్షత వహించారు. తొలిసారి ఎంపీగా సభలో కాలుపెట్టిన వ్యక్తి కావడం అధ్యక్షతవహించడం విశేషం. తొలిసారి సభ్యురాలైన జేడీయూ ఎంపీ కహక్‌శాన్ పర్వీన్ గురువారం ప్రశ్నోత్తరాల సందర్భంగా సభను నడిపించారు. జీరో అవర్ తర్వాత సభా కార్యక్రమాలను పర్వీన్ నడిపిస్తారంటూ రాజ్యసభ చైర్మన్ వెంకయ్య చెప్పారు. సభ ప్రారంభం కాగానే పర్వీన్ అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. దీంతో సభ్యులంతా బల్లలు చరిచి అభినందించారు. తర్వాత వెంకయ్య పర్వీన్‌ను ‘బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించారం’టూ అభినందించారు. కొందరు మహిళా సభ్యులు మార్చి 8 (మహిళా దినోత్సవం సందర్భంగా)న చేసిన డిమాండ్ ఆధారంగా వెంకయ్య పర్వీన్‌ను వైస్ చైర్‌పర్సన్‌గా నియమించారు. వైస్ చైర్‌పర్సన్స్ ప్యానెల్లో పర్వీన్ ఏకైక మహిళా అభ్యర్థి. -
నా కొడుకు ఎక్కడ సారూ..?
కృష్ణ జిల్లా, విస్సన్నపేట (తిరువూరు) : పేగు తెంచుకు పుట్టిన బిడ్డలు వృద్ధాప్యంలో అండదండలుగా ఉంటారని ఎన్నో ఆశలతో తల్లితండ్రులు ఉంటారు. అయితే, కన్న కొడుకు పదేళ్లుగా ఉన్నాడా లేడా, ఉండి తమతో మాట్లాడటం లేదా అనే ఆవేదనతో ఓ మాతృమూర్తి హృదయం తల్లడిల్లుతోంది. తనను కొడుకు చూడనవసరం లేదయ్యా.. తనకు భర్త తరఫున పెన్షన్ వస్తోంది.. దాంతోనే తాను సుఖంగా జీవిస్తున్నాను. తమ తదనంతరం ఆస్తిపాస్తులు వాడికి అప్పగిస్తే బాధ్యత తీరుతుంది.. అని చెబుతోంది కన్న తల్లి ఉపద్రష్ట కామేశ్వరి. స్థానిక శ్రీనివాసనగర్‌లో నివాసం ఉండే ఉపద్రష్ట సుబ్బారావు టెలికం డిపార్ట్మెంట్లో ఉద్యోగం నిమిత్తం గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి విస్సన్నపేట వచ్చి చాలా ఏళ్లుగా స్థిరపడ్డారు. వీరి కుమారుడు ఉపద్రష్ట కిరణ్‌కుమార్ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసి విదేశాల్లో ఉద్యోగం నిమిత్తం 15 ఏళ్ల క్రితం లండన్ వెళ్లాడు. అక్కడ నోవా ఐటీ కన్సల్టింగ్ కంపెనీలో లీడ్ ఐటీ కన్సల్టెంట్‌గా పని చేసేవాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడు. రానురాను ఫోన్ చేయటం మానేశాడు. పదేళ్ల కిత్రం తండ్రి సుబ్బారావు మరణించాడని అతడి ఫోన్‌కు మెసేజ్ పంపినా స్పందించలేదు. ఆ తర్వాత అతని సోదరుడు మరణించాడు. ఆ వార్త తెలిపినా అతీగతీ లేదు. అయితే, తన కొడుకు ఫోన్ నెంబరుకు కాల్ చేస్తే పలకటం లేదని, మెసేజ్‌లు పంపితే స్వీకరించినట్లు వస్తోందని కామేశ్వరి చెబుతోంది. ఎలాగైనా తన కొడుకును ఒక్కసారి మాట్లాడించాలని వేడుకుంటోంది. ఇదే విషయంపై గతంలో మీ కోసంలో కలెక్టరు కార్యాలయంలో అర్జీ కూడా ఇచ్చింది. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో తన గోడు ‘సాక్షి’కి చెప్పుకుంది. ఎలాగైనా తన కొడుకుతో మాట్లాడించాలని వేడుకుంటోంది. -
ఆడపిల్లాడు!
సుల్తాన్పూర్ (అఫ్ఘానిస్థాన్) : సితార.. అనగానే సినిమా తారలే గుర్తుకొస్తారు. యాక్షన్ అని చెప్పినప్పుడు మాత్రమే తారలు నటిస్తారు. కానీ అఫ్ఘాన్‌కు చెందిన సితార మాత్రం అనుక్షణం నటిస్తూనే ఉంది. గత పదేళ్లుగా మగపిల్లాడిలా మారువేషంలో జీవిస్తూనే ఉంది. వివరాల్లోకెళ్తే.. మగసంతానం లేని దంపతులు ఆడపిల్లల్లో ఒకరిని మగాడిలా పెంచాలని ముచ్చటపడతారు. చిన్నప్పటి నుంచే మగపిల్లల డ్రెస్సులు వేస్తూ తమ ముచ్చట తీర్చుకుంటారు. అఫ్ఘానిస్థాన్లోని సితార వఫాదార్ తల్లిదండ్రులు కూడా ఆమెను అలాగే పెంచారు. ఐదుగురు ఆడపిల్లల తర్వాత ఆరో సంతానంగా జన్మించడంతో మగపిల్లాడి ముచ్చట తీర్చుకునేందుకు అలా పెంచుతున్నారని అంతా అనుకున్నారు. సితార కూడా చిన్నప్పుడు మగపిల్లాడిగా పెరిగేందుకే ముచ్చట పడింది. ఆ ముచ్చటే ఆమెను ఇప్పుడు ఇటుక బట్టీలో కూలీని చేసింది. కుటుంబ బాధ్యతలు మోసే కొడుకులా.. తండ్రితో కలిసి సితార కూడా రోజూ ఇటుక బట్టీలో పనిచేసేందుకు వెళ్తుంది. అయితే అక్కడ ఎవరికీ ఆమె ఆడపిల్ల అనే విషయం తెలియదు. ఒకవేళ తెలిస్తే అక్కడ ఆమెకు పనే ఉండదు. అదీగాక మరెన్నో సమస్యలు ఎదుర్కోవాల్సిందే. అందుకే కాస్త పొడవుగా ఉన్న వెంట్రుకలను చున్నీతో కప్పేస్తూ.. గొంతును తగ్గించుకొని మాట్లాడుతూ.. తనపని తాను చేసుకుంటుంది. రోజుకు 500 ఇటుకలు చేస్తే ఆమె చేతికి వచ్చేది 160 రూపాయలు. అవి రాకపోతే కుటుంబం పస్తులుండాల్సిందే. ఎప్పటికైనా తెలిసిపోతుంది కదా.. అఫ్ఘానిస్థాన్‌లో మగసంతానం లేని చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఇలా పెంచడం సాధారణమే. అయితే కొంత వయసు వచ్చేవరకే దానిని పరిమితం చేస్తారు. ఆ తర్వాత ఆడపిల్లలా బతకాల్సిందే. కానీ సితార అలా కాదు.. అసలు ఆమె ఆడపిల్ల అనే విషయమే బయటి ప్రపంచానికి తెలియదు. మరి ఎప్పటికైనా తెలిసిపోతుంది కదా? అని అడిగితే.. తెలిసే వరకు ఇలాగే ఉంటానని చెబుతోంది. మేమే మగపిల్లాణ్ని చేశాం.. ‘సితారను ఆడపిల్ల అని చెప్పుకోవడం కంటే మగపిల్లాడిగానే ప్రపంచానికి పరిచయం చేయడానికి మేం ఇష్టపడుతున్నాం. ఎందుకంటే ఆమె ఆడపిల్ల అని తెలిస్తే.. కుటుంబంలో బయటకు వెళ్లి పనిచేసేవారు ఎవరూ ఉండరు. ఆమె తండ్రి ఇప్పటికే వృద్ధుడైపోయాడు. నాకు మందులు తేవాలన్నా, డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలన్నా మగపిల్లాడు కావాల్సిందే. అందుకే సితారను మా అవసరాల కోసమే మగపిల్లాణ్ని చేశామంటోంది సితార తల్లి. -
పది వసంతాల పయనం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరకీర్తికిరీటంలో కలికితురాయి లాంటి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పది వసంతాలు పూర్తి చేసుకోనుంది. ప్రపంచంలోని అన్ని ప్రధాననగరాలకు, దేశంలోని అన్ని మెట్రోపాలిటన్నగరాలకు విమాన సర్వీసులు అందిస్తున్నఅందజేస్తోన్న శంషాబాద్ విమానాశ్రయం‘ఎయిర్‌పోర్టు సిటీ’గా విస్తరించేందుకు సిద్ధమైంది. ప్రయాణికుల రవాణాలో, కార్గో రవాణా రంగంలోనూ అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్న ఎయిర్‌పోర్టు ఐటీ ఆధారిత సేవల వినియోగంలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. ఈ నెల 23వ తేదీకి పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. అంచలంచెలుగా ఎదిగి.. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం జీఎమ్మార్, ఎయిర్‌పోర్టు అథారిటీస్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో ఆవిర్భవించింది. 2008 మార్చి 23న ప్రయాణికులకు ఇక్కడ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఏటా సుమారు కోటి మంది ప్రయాణికులు, 1.50 మిలియన్ టన్నుల కార్గో రవాణా లక్ష్యంగా ఈ ఎయిర్‌పోర్టును నిర్మించారు. తొలి ఏడాది సుమారు 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా.. ఇప్పుడు ఆ సంఖ్య 1.80 కోట్లకు చేరింది. మొదట్లో 28 జాతీయ, అంతర్జాతీయ నగరాలకు మాత్రమే ఫ్లైట్ సర్వీసులు అందుబాటులో ఉండగా ప్రస్తుతం 9 జాతీయ, 15 అంతర్జాతీయ, 3 ఇండియన్ ఎయిర్‌లైన్స్ ద్వారా 60 జాతీయ, అంతర్జాతీయ నగరాలకు సర్వీలు నడుస్తున్నాయి. గత సంవత్సరం కొలంబో, వాషింగ్టన్ డీసీ, కువైట్, షార్జా, దోహ తదితర నగరాలకు సైతం డైరెక్ట్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ ఎయిర్‌పోర్టు ప్రారంభించిన ఏడాదిలోనే ప్రతిష్టాత్మకమైన ‘లీడ్’ అవార్డును సొంతం చేసుకుంది. సోలార్ విద్యుత్ వినియోగం, పర్యావరణ హితమైన ప్రమాణాల అమలులోనూ ముందుంది. ‘ఎయిర్‌పోర్టు సిటీ’కి శంకుస్థాపన.. శుక్రవారం విమానాశ్రయంలోని హజ్ టర్మినల్ వద్ద నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. పలువురు ప్రముఖులు పాల్గొనే ఈ వేడుకలో ఎయిర్‌పోర్టు విస్తణకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ‘హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సిటీ’గా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపడతారు. సుమారు 600 ఎకరాల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్ హాల్స్, మాల్స్, హోటళ్లు, హాస్పిటళ్లు, ఉద్యానవనాలు వంటి ఏర్పాట్లతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేవిధంగా ఈ సిటీని నిర్మించనున్నారు. డిజిటల్ ఎయిర్‌పోర్టు దిశగా పరుగులు.. అన్ని విభాగాల్లోను సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడంతో ‘డిజిటల్ ఎయిర్‌పోర్టు’గా గుర్తింపు పొందింది. ప్యాసింజర్ ఈజ్ ప్రైమ్ కార్యక్రమంలో భాగంగా తనిఖీలను ‘స్మార్ట్’గా మార్చారు. త్వరలో ‘ఫేస్ రికగ్నైజేషన్’ యంత్రాలు సైతం అందుబాటులోకి రానున్నాయి. రెగ్యులర్ ప్రయాణికుల ‘ట్రావెల్ హిస్టరీ’ని నమోదు చేసేందుకు చర్యలు చేపట్టారు. దీంతో వారు తక్కువ సమయంలోనే తనిఖీలు పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. హ్యాండ్‌బ్యాగ్ స్కానింగ్, స్వతహాగా నడవలేని ప్రయాణికుల కోసం ఒక్క అలారంతో పార్కింగ్ వద్దకే వీల్‌చైర్ సేవలను అందుబాటులోకి తేవడం, బయోటాయిలెట్లు, పేపర్‌లెస్ సర్వీసులు తదితర సదుపాయాల ద్వారా ఎయిర్‌పోర్టును పూర్తిగా డిజిటలైజ్ చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. -
సుప్రీం తీర్పుతో శశికళ ఆశలు ఆవిరి..
అమ్మ తర్వాత అమ్మగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి, తమిళనాడలో చక్రం తిప్పాలనుకున్న శశికళకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో స్పెషల్ కోర్టు తీర్పును సమర్థిస్తూ శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వెంటనే సరెండర్ కావాలని ఆదేశించింది. దీంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడును ఏలాలనుకున్న శశికళ ఆశలు ఆవిరయ్యాయి. పదేళ్ల పాటు ఎన్నికలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాంకేతికంగా దోషిగా నిర్ధారైన వారు ఆరేళ్లే రాజకీయ జీవితానికి దూరంగా ఉండాల్సి ఉన్నా.. ఆమె జైలు శిక్షను పరిగణలోకి తీసుకుని మొత్తం పదేళ్లు ఆమె ప్రజాప్రతినిధిగా పోటీ చేయడానికి వీలులేదు. దీంతో శశికళను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్న ఆమె వర్గానికి తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. అంతకముందు కూడా శశికళ, జయలలిత పోటీచేసే ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీచేయాలని నిర్ణయించారు. కానీ అక్కడి ప్రజలు శశికళను వ్యతిరేకించారు. అమ్మ మరణించిన తర్వాత పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన శశికళ, ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి తమిళనాడు రాష్ట్రాన్ని ఏలాలని నిర్ణయించారు. నేటి సుప్రీం తీర్పుతో ఆమె కలలు కల్లలయ్యాయి. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. -
పదేళ్ల ఐఫోన్ గురించి 10 ఆసక్తికర విషయాలు...
ఆపిల్ ఐఫోన్ అంటే ఎవరూ తెలియని వారండరేమో.. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రొడక్ట్ తెగ ఫేమస్ అయింది. కుర్రకారు మదిని ఎక్కువగా దోచుకున్న స్మార్ట్ ఫోన్ ఏదైనా ఉందా అంటే అది ఐఫోనే. అంతలా ఇష్టపడతారు యువత. ఎలాగైనా ఆపిల్ ఐఫోన్ కొనుక్కోవాలని యువత ఉత్సాహ పడుతుంటారు. కుర్రకారును ఇంతగా ఆకట్టుకున్న ఐఫోన్‌కు జనవరి 9 అంటే నేడు చాలా స్పెషల్. ఆ స్పెషల్ ఏమిటో తెలుసా? నేటికి ఐఫోన్ పదేళ్లు పూర్తిచేసుకుంది. ఐఫోన్ నుంచి ఇంకా ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్ రావాల్సిఉందని 10వ వార్షికోత్సవ సందర్భంగా ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్ అభిప్రాయం వ్యక్తంచేశారు. అంటే పదేళ్ల వార్షికోత్సవంగా మరో సూపర్ ఐఫోన్ ను మన ముందుకు తీసుకురాబోతున్నారని సిగ్నల్ ఇచ్చేశారు. 10వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఐఫోన్ గురించి మరిన్ని విశేషాలు: 2007 జనవరి 7న ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టారు. శాన్ఫ్రాన్సిస్కో వేదికగా లాంచ్ అయిన ఈ ఫోన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన మొదటి ఐఫోన్. మొదటి తరం ఐఫోన్ మొదట అమెరికాలోనే ప్రవేశపెట్టారు. 2007 నవంబర్‌లో యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌లలో ఐఫోన్‌ను విక్రయించడం ప్రారంభించారు. అయితే మొదటి ఐఫోన్‌ను భారత్‌లో ప్రవేశపెట్టలేదు. భారత్‌లోకి ఐఫోన్ 2008 ఆగస్టులో ప్రవేశించింది. ఐఫోన్ 3జీ ఫోన్‌ను మొదట భారత్ లో లాంచ్ చేశారు. వొడాఫోన్, ఎయిర్టెల్ నెట్‌వర్క్‌తో భారత్‌లోకి ప్రవేశించింది. ఐఫోన్ లాంచ్ చేసినప్పుడు, దీనికసలు ఎలాంటి యాప్ స్టోర్ లేదు. స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ను ప్రవేశపెట్టిన కొన్ని రోజులకే సిస్కో దీనిపై దావా వేసింది. 'ఐఫోన్' ట్రేడ్ మార్కు వాస్తవానికి తమదంటూ సిస్కో ఉత్తర కాలిఫోర్నియా ఫెడరల్ జిల్లా కోర్టులో దావా వేసింది. అనంతరం రెండు కంపెనీలు కూర్చొని ట్రేడ్ మార్కు సమస్యను సెటిల్ చేసుకున్నాయి. 2016 లో టైమ్ మ్యాగజీన్ విడుదల చేసిన అన్ని సమయాల్లో అత్యంత ప్రభావితమైన 50 గాడ్జెట్ల జాబితాల్లో ఐఫోన్ టాప్‌లో నిలిచింది. ఐఫోన్ టెక్నాలజీకి సంబంధించిన 200 పేటెంట్ హక్కులు ఆపిల్ వద్ద ఉన్నాయి. 2016 జూన్ నాటికి ఆపిల్ ఐఫోన్ విక్రయాలు 1 బిలియన్(100 కోట్ల) మార్కును చేధించాయి. కూపర్టినోలో జరిగిన ఉద్యోగుల సమావేశంలో ఈ విషయాన్ని ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వెల్లడించారు. 1 బిలియన్ మార్కును కంపెనీ చేధించి, రికార్డు సృష్టించిందని ఆయన ఆనందం వ్యక్తంచేశారు. ఐఫోన్ ఫోన్లలో అత్యంత ఖరీదైన భాగమేదంటే అది రెటీనా స్క్రీనే. 2007 జూన్ నుంచి ఐఫోన్ విక్రయాలు ప్రారంభం అయిన తర్వాత కంపెనీకి ఎక్కువ రెవెన్యూలు ఈ ఫోన్నుంచే వస్తున్నాయి. గత త్రైమాసికంలో(2016 క్యూ4) కంపెనీ రెవెన్యూలో ఐఫోన్ విక్రయాలు 60 శాతం నమోదు అయ్యాయి. ఈ రెవెన్యూలు మరో 14 శాతం పెరిగే అవకాశముందని కంపెనీ వ్యక్తంచేస్తోంది. ఆపిల్ ఐఫోన్ యాడ్ లో ఎప్పుడూ సమయం 9.41am గానే కనిపిస్తోంది. ఇందుకు కారణం స్టీవ్ జాబ్స్ మొదట ఐఫోన్ ను ఆ సమయంలోనే ప్రవేశపెట్టారు. -
పదేళ్లుగా చీకటి గదిలోనే
మానసిక వ్యాధితో బాధపడుతున్న యువకుడు సింధనూరు టౌన్ : పదేళ్లుగా చీకటి గదిలోనే గడిపిన ఓ యువకుని ఉదంతం తాలూకాలోని తిప్పనహట్టి సమీపంలోని కల్యాణ హుడేవ్ గ్రామంలో వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దొడ్డనగౌడ, బసమ్మ దంపతుల పెద్ద కుమారుడు బసవరాజ్ పదేళ్లుగా మానసిక అస్వస్థతతో బాధపడుతూ ఇహలోకంలోని అన్ని భావాలను కోల్పోయాడు. ఎవరైనా మాట్లాడిస్తే కోపోద్రిక్తుడై ప్రతిస్పందించేవాడు. అతనిని పలు చోట్ల చూపించగా, నయం కాకపోవడంతో చివరకు కుటుంబ సభ్యులు చీకటి గదిలో బంధీ చేశారు. ఈ విషయంపై బసవరాజ్ తల్లి బసమ్మను సంప్రదించగా, చెట్టంత కొడుకు ఇలా కావడం తనను ఎంతో బాధిస్తోందని వాపోయింది. చుట్టుపక్కల వారు ఈసడించుకోవడం కన్నా తన కుమారుడు గదిలో బంధీ కావడమే మేలని, అన్నింటికీ ఆ భగవంతునిపైనే భారం వేశానన్నారు. ఇదిలా ఉండగా గురువారం సీనియర్ ఆరోగ్య సహాయకుడు రంగనాథ గుడి తిప్పనహట్టి గ్రామాన్ని సందర్శించి ఆ యువకుడి కుటుంబంతో చర్చించారు. కుటుంబ సభ్యులు సహకరిస్తే బసవరాజ్‌ను తమ శాఖ తరఫున రాయచూరులోని రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తామని బసవరాజ్ తల్లికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. -
అత్యాచారం కేసులో వ్యక్తికి పదేళ్ల జైలు
న్యూఢిల్లీ: మహిళపై దాడి చేసి అత్యాచారం చేయడంతోపాటు ఆమెను హతమార్చడానికి యత్నించిన కేసులో 45 ఏళ్ల వ్యక్తికి ఢిల్లీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. 2014 జూన్ 24న తన ఇంటిలో ఒంటరిగా ఉన్న మహిళ వద్దకు వచ్చిన ఓ డ్రైవర్.. తాగడానికి నీరు కావాలని అడిగాడు. ఇంతలోనే ఆమెపై అమాంతం దాడికి పాల్పడి సెల్‌ఫోన్ చార్జర్ సాయంతో ఆమెను కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతోపాటు ఆమెను చంపేందుకు యత్నించాడు. ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు.. అతడి చర్యను అత్యంత పాశవిక, ఆటవికమైనదిగా అభివర్ణించింది. నేరస్తుడికి కుటుంబం ఉన్నప్పటికీ బాధిత మహిళ ఆక్రందనను దృష్టిలో ఉంచుకొని అతనికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు అడిషనల్ సెషన్స్ జడ్జి సంజీవ్ జైన్ గురువారం తీర్పు వెలువరించారు. -
ఒక్కడే ఏడంతస్తులు కట్టేశాడు
బీజింగ్: సాధారణంగా ఉన్న స్థలమంతా తనకే కావాలని తోడబుట్టిన సోదరులను కూడా మోసం చేసే సోదరులున్న ఈ రోజుల్లో చైనాలో మాత్రం లేని తన సోదరుల కోసం ఓ సోదరుడు ఒక్క కూలి లేకుండా సొంతంగా ఏడంతస్తుల నివాసం కట్టాడు. అయితే, అత్యంత హంగులు, సొబగులతో ఉన్నదికాదు. కాంక్రీటు, ఇనుప చువ్వలు, సున్నం రంగులు వంటివి దానికి ఉపయోగించలేదు. ఒక్క కూలీని కూడా పెట్టలేదు. మట్టి, రాళ్లు, కట్టెలు, పాత రేకులు ఇవే ఆ ఇంటి నిర్మాణం కోసం ఉపయోగించిన సామాగ్రి. ఆ ఇంటి నిర్మాణాన్ని అతడు పూర్తి చేయడానికి అతడికి పట్టిన సమయం సరిగ్గా పదేళ్లు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చైనాలోని షడాంగ్ లోగల లిన్ కూ అనే ప్రాంతంలో హు గాంగ్ జౌ(55) అనే ఓ రైతు ఉన్నాడు. అతడికి ఆరుగురు సోదరులు ఉన్నారు. అయితే, వాస్తవానికి వారు ఎప్పుడో చనిపోయారని స్థానిక మీడియా చెప్తోంది. కానీ, అతడు మాత్రం తన సోదరులు ఇంకా బతికే ఉన్నారని భావిస్తున్నాడు. వారు ఏదో ఒకరోజు తిరిగి వస్తారని వారికోసమే ఆ ఇల్లు నిర్మించానని చెప్తున్నాడు. ఈ ఇంటిని నిర్మించే క్రమంలో పలుమార్లు అనారోగ్యం పాలయ్యాడు. రెండో అంతస్తు నిర్మించే సమయంలో ఏకంగా మంచాన పడ్డాడు. అయినా, ఎలాగైన ఏడంతస్తులు పూర్తి చేయాలన్న తన సంకల్పం అతడిని మంచం నుంచి బయటపడేసింది. తిరిగి ఏడు స్టేర్లు పూర్తి చేశాడు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే సుదీర్ఘకాలంపాటు ఈ పనిలో నిమగ్నమై ఉన్నాడని, అతడి చర్యను ఎవరు అడ్డుకున్న వారిపట్ల అతడి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో అని భయపడి కనీసం ప్రభుత్వాధికారులు కూడా అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆ ఇల్లు కాస్త జపాన్ యానిమేటెడ్ చిత్రం హాల్స్ మూవింగ్ క్యాజిల్ లోని ఇల్లు మాదిరిగా తయారై అలా ఉండిపోయింది. చుడ్డానికి ఎబ్బేట్టుగా కనిపించే ఆ ఇంటికి సందర్శకుల తాకిడేం తక్కువ కాదు. ఎంతోమంది ఆ ఇంటిని చూడ్డానికి వచ్చి వారంతా ఫొటోలు తీసుకుని వెళుతుంటే.. మట్టి రాళ్లు కలిపి అంతెత్తు కట్టిన ఆ ఇల్లు గాలి వానకు ఎప్పుడు కూలి తమపై పడుతుందో అని చుట్టుపక్కల వారు మాత్రం హడలెత్తిపోతున్నారు. ఇక గాంగ్ జౌ ఖాళీ సమాయాల్లో ఆ ఇంటికి రిపేర్లు చేసుకుంటూ కూర్చున్నాడు. -
వయోపరిమితి సడలింపు పదేళ్లు?
ఉద్యోగాల భర్తీపై సర్కార్ ఆలోచన యూనిఫాం సర్వీసులకు ఐదేళ్లు సడలింపు! హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ట వయో పరిమితి సడలింపును పదేళ్లకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. నిరుద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ దిశగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో భర్తీ చేసే పోస్టుల గరిష్ట వయోపరిమితికి పదేళ్లు సడలింపు ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కేబినెట్ సబ్‌కమిటీ టీఎస్పీఎస్సీ పరీక్షల విధానం, వయోపరిమితి సడలింపు తదితర అంశాలపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. అందులో ఐదేళ్ల సడలింపును ప్రతిపాదించింది. గడిచిన నాలుగేళ్లలో ఉద్యోగ నోటిఫికేషన్లు రానందున.. ఐదేళ్ల సడలింపు సరిపోతుందని, పదేళ్లు పెంచితే కొన్ని కేటగిరీల్లో ఉద్యోగి సర్వీసు కాలం తగ్గిపోతుందని పేర్కొంది. కానీ నిరుద్యోగులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలసి గరిష్ట వయోపరిమితిని పదేళ్లు సడలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పదేళ్ల సడలింపునకు సీఎం అంగీకరించినట్లు సమాచారం. మరోవైపు యూనిఫాం (పోలీసు వంటి) సర్వీసుల్లో ఇంతకుముందు గరిష్ట వయోపరిమితిని పెంచలేదు. కానీ ఈసారి వాటిల్లోనూ గరిష్ట వయోపరిమితికి ఐదేళ్లు సడలింపు ఇవ్వాలన్న యోచనకు వచ్చినట్లు తెలిసింది. దీనిపై రెండు మూడు రోజుల్లో అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. -
ఈడు మగాడ్రా బుజ్జీ !
మగాడంటే మన లెక్కలో మగాడు. అది కానివాడు మగాడెలా అవుతాడు? అసలు మగాడంటే ఎవరు? పది మంది గురించి పట్టించుకునేవాడు, తన గురించి పట్టించుకోనివాడు మగాడు. మరి వాట్ అబౌట్ అవర్ మాడర్న్ మగాడు? మొన్నెప్పుడో ఫేస్‌ప్యాక్‌తో మొదలుపెట్టాడు. ఆ తర్వాత రీసెంట్గా క్రీములు అలుకుతున్నాడు. వద్దంటే అలుగుతున్నాడు. ఇప్పుడేదో బొటాక్స్ అంట... ఒక్క సూది గుచ్చితే టెన్ ఇయర్స్ యంగరంట. ఇవాళ చిత్రంగా మాట్లాడుకుంటున్నాం. రేపు ఇదే మన చిత్రం కావచ్చు. ‘‘ఆడు మగాడ్రా బుజ్జీ’’ అంటాడు ‘అతడు’ సినిమాలో తనికెళ్ల భరణి.. బ్రహ్మాజీతో. భరణి ‘మగాడు’ అన్నది మహేశ్‌బాబు గురించి. అంతకు ముందే భరణి దగ్గర్నుంచి పొలం కాగితాల్ని విడిపించుకుని ఉంటాడు మహేశ్‌బాబు. ఆ తర్వాత భరణి మనుషుల్ని ఒక్కొక్కడినీ తుక్కురేగ్గొడతాడు. దీన్ని బట్టి ప్రాథమికంగా అర్థమయేదేమిటంటే.. మగాడు రఫ్‌గా ఉండాలని. పరిస్థితుల్ని ఫేస్ చెయ్యాలని. అయితే ఇప్పుడు కొత్త మగాళ్లు బయల్దేరారు. పరిస్థితుల్ని ఫేస్ చేస్తూనే, తన ఫేస్‌ని ఫెయిర్‌గా ఉంచుకునేందుకు వయసు తెచ్చే ముడుతలతో వాళ్లు ఫైట్ చేస్తున్నారు. లంచ్‌టైమ్‌లో వెళ్లి ఫేస్‌కి ‘బొటాక్స్’ ఇంజక్షన్ చేయించుకుని వస్తున్నారు. ఇది బ్రిటన్ సంగతి. మన ఆఫీసుల్లో కూడా కొందరు మగాళ్లు పని మధ్యలో తరచు వాష్‌రూమ్‌కి వెళ్లి, ముఖం కడుక్కునో, తలదువ్వుకునో వస్తుంటారు. అయితే బ్రిటన్ ఉద్యోగులు ఫ్రెష్ లుక్ కోసం ఇక్కడితో ఆగిపోవడం లేదు. బొటాక్స్ ఇంజెక్షన్ చేయించుకుంటున్నారు. బ్రిటన్‌లో ఇలాంటి మగాళ్లు పది శాతం వరకూ ఉన్నారని తాజాగా అక్కడ జరిగిన సర్వే వెల్లడించింది. ఈ పదిమందిలో సగం మంది, మిగతా ఐదుగురికి తెలియకుండా భోజనవిరామ సమయంలో గుట్టుగా వెళ్లి ముఖానికి బొటాక్స్ ఇంజెక్షన్ చేయించుకుని వచ్చి, ఏమీ ఎరుగని అమాయకుల్లా కొత్త గ్లోతో తమ సీట్లలోకి వచ్చి కూర్చుంటున్నారట. ఇంటికి కూడా అదే గ్లోతో వెళ్లినప్పటికీ అసలు రహస్యాన్ని వీళ్లు తమ భార్యలకు కూడా చెప్పడం లేదని సర్వేలో బయటపడింది. బొటాక్స్ ఇంజక్షన్ చేయించుకోవడం వల్ల ముఖంపై ముడతలు దాదాపుగా వెంటనే మాయమైపోతాయి. బ్రిటన్‌లో ప్రధానంగా 35-45 ఏళ్ల మధ్య వయసు గలిగిన మగవాళ్లు, కొత్తగా విడాకుల తీసుకున్న మగాళ్లు (బహుశా ఇంకో పెళ్లి కోసం కావచ్చు) రహస్యంగా బొటాక్స్‌ను ఆశ్రయించి ఇన్‌స్టంట్‌గా మన్మథావతారం ఎత్తుతున్నారు. ఈ రహస్యం అక్కడితో ఆగడం లేదు! బ్యాంకు, క్రెడిట్ కార్టు అకౌంట్లలో కనిపించకుండా ఉండడం కోసం వీరు తమ కార్డులను వాడకుండా, క్యాష్ రూపంలో మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారు. ఇంత కష్టం ఎందుకబ్బా? ఫేస్‌ప్యాక్ చేయించుకుని ఫ్రెష్‌గా లుక్ ఇవ్వచ్చు కదా. ఇవ్వొచ్చు కానీ, ఏదో చేయించుకుని వచ్చినట్లు కనిపించడం వారికి ఇష్టం లేదని ఈ సర్వేను చేసిన ‘రైట్ క్లినిక్’ చెబుతోంది. ఇంతకీ ఈ క్లినిక్ ఫౌండర్ ఎవరో తెలుసా? డాక్టర్ గణేశ్ రావ్. మన తెలుగాయనలానే ఉన్నాడు. బొటాక్స్ సూది అప్పటికప్పుడు ముఖంపై ముడతల్ని అదృశ్యం చెయ్యడంతోపాటు, ఆత్మవిశ్వాసాన్నీ ఇంజెక్ట్ చేస్తుందట! ఆయన అలా అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అందమే ఆనందం, ఆత్మవిశ్వాసం కదా. చూస్తుంటే డాక్టర్ గ ణేశ్ రావ్ పురుష పక్షపాతిలా ఉన్నారు. అందుకే వెయ్యిమంది పురుషుల రహస్య సౌందర్యకాంక్షపై వివరాలను రాబట్టి వారిని సమర్థిస్తూ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ‘‘ఏం? మగువలు మాత్రమే సౌందర్య సాధనాలు వాడాలా? మగవాళ్లకు మాత్రం ఎవర్‌గ్రీన్‌గా ఉండాలనిపించదా? ’’ అని అడుగుతున్నారు. ఈ ధోరణి ఇండియాకు ఇంకా రాలేదు. వస్తే బొటాక్స్‌కు కొరత ఏర్పడుతుందేమో! చెప్పలేం. వయసును దాచేసుకోవాలని ఏ మగాడికి మాత్రం ఉండదు? సో... అమ్మాయిలూ జాగ్రత్త. బొటాక్స్ బాబులు అందంలో మిమ్మల్ని మించిపోతారేమో! మిమ్మల్ని బురిడీ కొట్టిస్తారేమో?! బొటాక్స్ ఎలా పుట్టింది? బొటాక్స్ అనేది ఒక విష పదార్థం. క్లాస్ట్రీడియమ్ బోట్యులినమ్ అనే ఒక బ్యాక్టీరియా క్రిమి నుంచి ఈ విషం పుడుతుంది. ఇదొక ప్రోటీన్. దీన్ని ప్యూరిఫైడ్ డిరైవ్డ్ ప్రోటీన్ అంటారు. ఎందుకంటే విషాన్ని ఎంతగానో శుద్ధి చేసి అందులోంచి దీన్ని రాబడతారు. బోట్యులినమ్ క్రిమి నుంచి వస్తుంది. ఇది ఒక టాక్సిన్ (విషపదార్థం) కాబట్టి ఆ రెండు పేర్లనూ కలుపుకుని దీనికి ‘బొటాక్స్’ అనే పేరు పెట్టారు. ఏమిటి చరిత్ర చరిత్రలో మొట్టమొదటిసారి 1970లలో డాక్టర్ అలాన్ స్కాట్ అనే వైద్యుడు మెల్లకన్ను (స్ట్రాబి స్మస్)తో బాధపడుతున్న ఒక కోతికి బొటాక్స్‌తో చికిత్స చేసి చూశారు. అలా తన క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టిన ఆయన... కొద్దికాలంలోనే (అంటే ఏడేళ్ల వ్యవధిలో) దాన్ని మనుషుల మీద కూడా ప్రయోగించారు. ఇక వైద్యచికిత్స కోసమే గాక... అందాన్ని ఇనుమడింపజేసేందుకూ ఇది ఉపయోగ పడుతుందని డాక్టర్ రిచర్డ్ క్లాక్ అనే శాక్రిమెంటో (కాలిఫోర్నియా)కు చెందిన ప్లాస్టిక్ సర్జన్ తెలుసుకున్నాడు. దీన్ని ప్రయోగించి ముఖంపై ఉన్న ముడుతలను తొలగించాడాయన. ఎలా పని చేస్తుంది? అనేక రకాల చికిత్సలతో పాటు... అందాన్ని ఇనుమడింపజేసే ప్రక్రియలకూ బొటాక్స్ ఉపయోగపడుతుందని తేలింది.అందుకే ముఖం మీద ముడుతలను తొలగించి వయసు తగ్గినట్లుగా కనిపించడానికి దీన్ని ఉపయోగిస్తున్నారు. ఇంజెక్షన్ ద్వారా ముఖం మీద అనేక పొరల్లోకి దీన్ని క్రమక్రమంగా 4-6 నెలల పాటు ప్రవేశపెడుతూ చేసే చికిత్స ద్వారా ముఖం ముడుతలను తొలగించవచ్చు. ముడుతలు తొలగిపోయాక ముఖ చర్మం మునుపటికంటే బిగుతుగా ఉన్నట్లు కనిపించడంతో వయసు తగ్గినట్లుగా అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి బొటాక్స్ చికిత్సను చాలా అనుభవజ్ఞులైన, నిపుణులైన డాక్టర్లతో మాత్రమే చేయించాలి. ఆ ఇంజెక్షన్ మోతాదు మీరితే వచ్చే దుష్ర్పభావాల గురించి నిపుణులైన వారికి మాత్రమే బాగా తెలుసు. అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల కూడా వారికి అవగాహన ఉంటుంది. ఉదాహరణకు మోతాదు మించినప్పుడు కనురెప్పలు, కనుబొమలు, కింది పెదవులు కిందికి మరింతగా జారినట్లుగా అనిపించవచ్చు. అందుకే ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి నిపుణులైన డాక్టర్ల చేతనే బొటాక్స్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. -
‘మావో' కెరటానికి పదేళ్లు
మావోయిస్టు పార్టీ పదేళ్లు పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో బలంగా ఉన్న భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు-లెనినిస్టు) పీపుల్స్‌వార్ పార్టీ... జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో బలంగా ఉన్న మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా అనే రెండు విప్లవ పార్టీలు 2004 సెప్టెంబర్ 21న విలీనమై.. మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. ఈ విలీనానికి ఆదివారంతో పదేళ్లు పూర్తికానున్నాయి. పెద్దపల్లి : దేశంలో కీలక మైలురాయిగా నిలిచిన ఈ ఘట్టం ఆవిష్కృతమై పదేళ్లవుతున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విప్లవ రచయితల సంఘం(విరసం) బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. 1980లో తెలంగాణ ప్రాంతంలోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పురుడు పోసుకున్న పీపుల్స్‌వార్ పార్టీ కొండపల్లి వర్గంగా కార్యకలాపాలు విస్తృతపరిచింది. జననాట్య మండలి పాటలతో గ్రామాల్లో పెత్తందార్లను ఎదిరించి పాలేర్ల సమ్మెతో వందలాది ఎకరాల్లో ఎర్ర జెండాలు పాతి ఆక్రమణకు పాల్పడ్డ పీపుల్స్‌వార్ 35 ఏళ్ల కాలంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించింది. పీపుల్స్‌వార్ పార్టీ తొలుత 1998లో బీహార్‌కు చెందిన సీపీఐ(ఎంఎల్) పార్టీ యూనిటీని తనలో కలుపుకుంది. ఆ తరువాత ఎంసీపీఐతో కలసి మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డ తరువాత దేశ వ్యాప్తంగా ఆ పార్టీపై నిషేధం విధించారు. మావోయిస్టుల పురిటిగడ్డ అయిన తెలంగాణపై కేంద్ర, రాష్ట్ర బలగాలు గురి పెట్టాయి. నల్లమల నుంచి మహదేవ్పూర్ వరకు అటవీ ప్రాంతాల్లోని దళాలను టార్గెట్ చేసి పోలీసులు దెబ్బతీశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన మల్లోజుల కోటేశ్వరరావు ఉరఫ్ కిషన్‌జీ, సందె రాజమౌళి, వడ్కాపూర్ చంద్రమౌళి, మంగపేట చిన్నన్న, చెరుకూరి రాజ్‌కుమార్, శాకమూరి అప్పారావు, పటేల్ సుధాకర్‌రెడ్డి తదితర చురకత్తులాంటి నాయకులను మావోయిస్టు పార్టీ ఈ పదేళ్లలోనే కోల్పోయింది. ‘సల్వాజుడుం’పై దాడి ఆదివాసీలతో ఏర్పాటైన సల్వాజుడుం నుంచి ముప్పుతిప్పలు పడ్డ మావోయిస్టులు నిరుడు ఛత్తీస్‌గఢ్‌లో జరిపిన సామూహిక హత్యాకాండలో సల్వాజుడుం రూపకర్త మహేంద్రకర్మతోపాటు సల్వాజుడుం సంస్థను మట్టుబెట్టారు. ఈ 35 ఏళ్ల కాలంలో మహేంద్రకర్మపై జరిపిన దాడిని అతి పెద్ద దాడిగా పేర్కొనవచ్చు. ప్రభుత్వం నుంచి దెబ్బతిన్న దళాల్లో మిగిలిన కొద్ది మంది నాయకులు ఛత్తీస్‌గఢ్, బస్తర్, జార్ఖండ్ లాంటి ప్రాంతాలకు తరలివెళ్లారు. దండకారణ్యానికి పరిమితమైన పార్టీ నూతన ప్రజాస్వామిక విప్లవ దశలో భాగంగా క్రాంతికార్, జనతన సర్కార్ పేరిట ప్రభుత్వానికి సమాంతర పాలన కొనసాగిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో పార్టీ నాయకత్వంలో సహకార సంఘాలను ఏర్పాటు చేస్తూ వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, మహిళా రంగాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ పార్టీ నాయకత్వం, గ్రామ రాజ్య కమిటీల నాయకత్వంలో ముందుకెళ్తోంది. మైదాన ప్రాంతంలో సెల్టవర్ల ఏర్పాట్లు, రియల్ ఎస్టేట్, మద్యం దందాల ఎదుగుదలతో మిలిటెంట్ల వ్యవస్థను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. మైదాన ప్రాంతాల్లో తేరుకోలేని రీతిలో దెబ్బతిన్న మావోయిస్టులు ఆదివాసీల మధ్యన సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని అటవీ ప్రాంతాల్లో విప్లవ పాఠాలు, పోరాటాలు నేర్చుకున్నారు. గ్రామ రాజ్య కమిటీల నిర్మాణంతో జనతన సర్కార్‌ను నడుపుతున్న మావోయిస్టు పార్టీని ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం మానవరహిత విమానాలను సైతం ప్రయోగించే దశలో ఉంది. ఇంతకుముందు రూ.10 లక్షల నుంచి పాతిక లక్షలకు పరిమితమైన నక్సలైట్ల పెద్ద‘తలలకు’ రివార్డులను ప్రకటించడంతో ఒక్కో కేంద్ర కమిటీ సభ్యుని తలపై రివార్డ్ రూ.కోటి దాటింది. పార్టీ కేంద్ర కమిటీ కార్యద ర్శి గణప తి తలకు వివిధ రాష్ట్రాలు, కేంద్ర దర్యా ప్తు సం స్థ కలిసి ఏకంగా రూ. 2.5 కోట్లు ప్రకటించాయి. -
సీమాంధ్రకు పదేళ్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి
శ్రీకాకుళం అర్బన్: రాష్ట్ర పున:నిర్మాణంలో భాగంగా సీమాంధ్రకు పదేళ్లపాటు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ సమాఖ్య అధ్యక్షుడు బి.వి.రామారావు డిమాండ్ చేశారు. పట్టణంలోని ఆర్అండ్బీ అతిధి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం దత్తత తీసుకుని అన్ని రంగాల్లో అభివృద్ది చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు పదేళ్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు వడ్డీరేట్లను తగ్గించడంతోపాటు కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మౌళిక వసతులు కల్పించేందుకు నాలుగు లక్షల కోట్లు విడుదల చేయాలన్నారు. రాష్ట్రంలో చిన్న, సూక్ష్మ పరిశ్రమలు అభివృద్ది కాకపోవడానికి కారణం జాతీయ బ్యాంకులేనని, డబ్బు ఉన్నవారికే బ్యాంకు రుణాలు ఇస్తున్నాయన్నారు. గత యూపీఏ ప్రభుత్వం 2006లో ప్రవేశపెట్టిన సీజీటీఎంఎస్ఇ (క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో స్మాల్ ఎంటర్‌ప్రైజస్ స్కీం) పథకం మన రాష్ట్రంలో సరిగా అమలు కాకపోవడంలేదన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ది కోసం సూక్ష్మ, చిన్న, మధ్య, భారీ పారిశ్రామికవేత్తలతో ఈనెల 28న విశాఖపట్టణంలో సదస్సు నిర్వహించి వారి సూచనలు, సలహాలను తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పిస్తామన్నారు.