కిరణ్ (ఫైల్) తల్లి కామేశ్వరి
కృష్ణ జిల్లా, విస్సన్నపేట (తిరువూరు) : పేగు తెంచుకు పుట్టిన బిడ్డలు వృద్ధాప్యంలో అండదండలుగా ఉంటారని ఎన్నో ఆశలతో తల్లితండ్రులు ఉంటారు. అయితే, కన్న కొడుకు పదేళ్లుగా ఉన్నాడా లేడా, ఉండి తమతో మాట్లాడటం లేదా అనే ఆవేదనతో ఓ మాతృమూర్తి హృదయం తల్లడిల్లుతోంది. తనను కొడుకు చూడనవసరం లేదయ్యా.. తనకు భర్త తరఫున పెన్షన్ వస్తోంది.. దాంతోనే తాను సుఖంగా జీవిస్తున్నాను. తమ తదనంతరం ఆస్తిపాస్తులు వాడికి అప్పగిస్తే బాధ్యత తీరుతుంది.. అని చెబుతోంది కన్న తల్లి ఉపద్రష్ట కామేశ్వరి.
స్థానిక శ్రీనివాసనగర్‌లో నివాసం ఉండే ఉపద్రష్ట సుబ్బారావు టెలికం డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం నిమిత్తం గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి విస్సన్నపేట వచ్చి చాలా ఏళ్లుగా స్థిరపడ్డారు. వీరి కుమారుడు ఉపద్రష్ట కిరణ్‌కుమార్ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసి విదేశాల్లో ఉద్యోగం నిమిత్తం 15 ఏళ్ల క్రితం లండన్ వెళ్లాడు. అక్కడ నోవా ఐటీ కన్సల్టింగ్ కంపెనీలో లీడ్ ఐటీ కన్సల్‌టెంట్‌గా పని చేసేవాడు. అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడు. రానురాను ఫోన్ చేయటం మానేశాడు. పదేళ్ల కిత్రం తండ్రి సుబ్బారావు మరణించాడని అతడి ఫోన్‌కు మెసేజ్ పంపినా స్పందించలేదు.
ఆ తర్వాత అతని సోదరుడు మరణించాడు. ఆ వార్త తెలిపినా అతీగతీ లేదు. అయితే, తన కొడుకు ఫోన్ నెంబరుకు కాల్ చేస్తే పలకటం లేదని, మెసేజ్‌లు పంపితే స్వీకరించినట్లు వస్తోందని కామేశ్వరి చెబుతోంది. ఎలాగైనా తన కొడుకును ఒక్కసారి మాట్లాడించాలని వేడుకుంటోంది. ఇదే విషయంపై గతంలో మీ కోసంలో కలెక్టరు కార్యాలయంలో అర్జీ కూడా ఇచ్చింది. ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో తన గోడు ‘సాక్షి’కి చెప్పుకుంది. ఎలాగైనా తన కొడుకుతో మాట్లాడించాలని వేడుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment