మస్కట్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా పదేళ్ల నిరీక్షణకు భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ తెరదించాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఒమన్ ఓపెన్ చాలెంజర్ ప్లస్ టోర్నమెంట్‌లో విజేతగా నిలిచాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో శరత్ కమల్ చాంపియన్ అయ్యాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో 37 ఏళ్ల శరత్ కమల్ 6–11, 11–8, 12–10, 11–9, 3–11, 17–15తో టాప్ సీడ్ ఫ్రెటాస్ మార్కోస్ (పోర్చుగల్)ను బోల్తా కొట్టించాడు. ఏథెన్స్, బీజింగ్, రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన శరత్ కమల్ చివరిసారి అంతర్జాతీయస్థాయిలో 2010లో ఈజిప్ట్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఆ తర్వాత అతను రెండు టోర్నమెంట్‌లలో (మొరాకో ఓపెన్–2011; ఇండియా ఓపెన్–2017) సెమీఫైనల్ చేరి ఓడిపోయాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో శరత్ 11–13, 11–13, 13–11, 11–9, 13–11, 8–11, 11–7తో కిరిల్ స్కచ్కోవ్ (రష్యా)పై గెలవగా... మరో భారత ఆటగాడు హర్మీత్ దేశాయ్ 11–5, 9–11, 11–6, 11–6, 8–11, 11–13, 3–11తో మార్కోస్ చేతిలో ఓడాడు.
Comments
Please login to add a commentAdd a comment