international title
-
అన్మోల్కు తొలి అంతర్జాతీయ టైటిల్
భారత బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ అన్మోల్ ఖరబ్ తన కెరీర్లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించింది. శనివారం ముగిసిన బెల్జియం ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో హరియాణాకు చెందిన 17 ఏళ్ల అన్మోల్ మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 222వ స్థానంలో ఉన్న అన్మోల్ 59 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో 24–22, 12–21, 21–10తో ఏడో సీడ్ అమెలీ షుల్జ్ (డెన్మార్క్)పై గెలిచింది. -
సీజన్లో తొలి టైటిల్‌కు విజయం దూరంలో...
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. అమెరికాలోని ఒహాయోలో జరుగుతున్న క్లీవ్‌ల్యాండ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–క్రిస్టినా మెకేల్ (అమెరికా) జంట ఫైనల్‌కు చేరింది. శనివారం జరిగిన డబుల్స్ సెమీఫైనల్లో సానియా–క్రిస్టినా ద్వయం 7–6 (7/5), 6–2తో ఐకెరి (నార్వే) –కేథరిన్ హ్యారిసన్ (అమెరికా) జోడీపై గెలుపొందింది. గంటా 23 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను సానియా జంట నాలుగు సార్లు బ్రేక్ చేసింది. మ్యాచ్ ముగిశాక తన కుమారుడు ఇజ్‌హాన్‌తో కలిసి సానియా ఆనందం పంచుకుంది. ఫైనల్లో టాప్ సీడ్ సుకో అయోమా–ఎనా షిబహార (జపాన్) జోడీతో సానియా–క్రిస్టినా జంట తలపడుతుంది. -
టైటిల్‌కు విజయం దూరంలో...
బాసెల్: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో జమ చేసుకోవడానికి భారత స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం దూరంలో నిలిచింది. స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ సింధు 22–20, 21–10తో ప్రపంచ 11వ ర్యాంకర్ మియా బ్లిచ్‌ఫెల్డ్ (డెన్మార్క్)పై గెలిచింది. 43 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదుర్కొన్న సింధు రెండో గేమ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఈ గెలుపుతో గత జనవరిలో థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీలో మియా చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకున్నట్లయింది. నేడు జరిగే ఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు ఆడుతుంది. మారిన్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 5–8తో వెనుకబడి ఉంది. భారత కాలమానం ప్రకారం సింధు–మారిన్ ఫైనల్ మ్యాచ్ రాత్రి 7 గంటల తర్వాత మొదలయ్యే అవకాశముంది. శ్రీకాంత్ పరాజయం పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. ప్రపంచ మాజీ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 13–21, 19–21తో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి (భారత్) జంట 10–21, 17–21తో కిమ్ అస్ట్రప్–ఆండెర్స్ రస్ముసెన్ (డెన్మార్క్) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
నిరీక్షణకు తెర...
మస్కట్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా పదేళ్ల నిరీక్షణకు భారత అగ్రశ్రేణి టేబుల్ టెన్నిస్ (టీటీ) క్రీడాకారుడు ఆచంట శరత్ కమల్ తెరదించాడు. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఒమన్ ఓపెన్ చాలెంజర్ ప్లస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో శరత్ కమల్ చాంపియన్ అయ్యాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో 37 ఏళ్ల శరత్ కమల్ 6–11, 11–8, 12–10, 11–9, 3–11, 17–15తో టాప్ సీడ్ ఫ్రెటాస్ మార్కోస్ (పోర్చుగల్)ను బోల్తా కొట్టించాడు. ఏథెన్స్, బీజింగ్, రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన శరత్ కమల్ చివరిసారి అంతర్జాతీయస్థాయిలో 2010లో ఈజిప్ట్ ఓపెన్ టైటిల్ సాధించాడు. ఆ తర్వాత అతను రెండు టోర్నమెంట్లలో (మొరాకో ఓపెన్–2011; ఇండియా ఓపెన్–2017) సెమీఫైనల్ చేరి ఓడిపోయాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో శరత్ 11–13, 11–13, 13–11, 11–9, 13–11, 8–11, 11–7తో కిరిల్ స్కచ్కోవ్ (రష్యా)పై గెలవగా... మరో భారత ఆటగాడు హర్మీత్ దేశాయ్ 11–5, 9–11, 11–6, 11–6, 8–11, 11–13, 3–11తో మార్కోస్ చేతిలో ఓడాడు. -
స్లొవేనియా ఓపెన్ విజేత సౌరభ్ వర్మ
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ అగ్రశ్రేణి క్రీడాకారుడు సౌరభ్ వర్మ ఈ ఏడాది తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్ గెలిచాడు. శనివారం ముగిసిన స్లొవేనియా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నీలో ఈ మధ్యప్రదేశ్ ప్లేయర్‌గా చాంపియన్‌గా అవతరించాడు. ఫైనల్లో టాప్ సీడ్ సౌరభ్ 21–17, 21–12తో నాలుగో సీడ్ మినోరు కొగా (జపాన్)పై నెగ్గాడు. మహిళల డబుల్స్ విభాగంలో దండు పూజ–సంజన (భారత్) ద్వయం రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో టాప్ సీడ్ పూజ–సంజన జోడీ 14–21, 20–22తో జెన్నీ మూర్–విక్టోరియా (ఇంగ్లండ్) జంట చేతిలో పరాజయం పాలైంది. -
రన్నరప్ సాయిప్రణీత్
చాలా రోజుల తర్వాత నా ఆటతీరు సంతృప్తినిచ్చింది. ఫైనల్లో రెండో గేమ్‌లో కీలకదశలో రెండేసి పాయింట్ల చొప్పున కోల్పోవడం మలుపు తిప్పింది. సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్ చెన్ లాంగ్‌పై సాధించిన గెలుపు నా కెరీర్‌లోని గొప్ప విజయాల్లో ఒకటి. వచ్చే వారం భారత్‌లో జరిగే ఇండియా ఓపెన్‌లో టైటిల్ సాధించేందుకు కృషి చేస్తాను. –‘సాక్షి’తో సాయిప్రణీత్ బాసెల్ (స్విట్జర్లాండ్): దాదాపు రెండేళ్లుగా ఊరిస్తోన్న అంతర్జాతీయ టైటిల్ కొరతను తీర్చుకోవాలని ఆశించిన భారత షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్‌కు నిరాశ ఎదురైంది. స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సాయిప్రణీత్ రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్ సాయిప్రణీత్ 21–19, 18–21, 12–21తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ షి యుకి (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 2017లో థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్ గెలిచిన తర్వాత స్విస్ ఓపెన్ రూపంలో మరో అంతర్జాతీయ టోర్నీలో ఫైనల్ చేరిన ఈ హైదరాబాద్ ప్లేయర్ తుది మెట్టుపై తడబడ్డాడు. 68 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సాయిప్రణీత్ తొలి గేమ్‌ను నెగ్గినా... రెండో గేమ్ నుంచి అతనికి గట్టిపోటీ ఎదురైంది. ఈ గేమ్‌లో పలుమార్లు స్కోరు సమంగా నిలిచింది. అయితే స్కోరు 18–18 వద్ద షి యుకి వరుసగా మూడు పాయింట్లు గెలిచి గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో షి యుకి జోరు పెంచగా, సాయిప్రణీత్ డీలా పడ్డాడు. విజేత షి యుకికి 11,250 డాలర్లు (రూ. 7 లక్షల 75 వేలు)... రన్నరప్ సాయిప్రణీత్‌కు 5,700 డాలర్లు (రూ. 3 లక్షల 93 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ►దాదాపు ఆరున్నర దశాబ్దాల చరిత్ర కలిగిన స్విస్ ఓపెన్‌లో గతంలో భారత క్రీడాకారులు శ్రీకాంత్ (2015), ప్రణయ్ (2016), సమీర్ వర్మ (2018), సైనా (2011, 2012) టైటిల్స్ నెగ్గగా... భారత్ నుంచి రన్నరప్‌గా నిలిచిన తొలి ప్లేయర్ సాయిప్రణీత్. -
తాల్ ర్యాపిడ్ చెస్ టోర్నీ విజేత ఆనంద్
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ సొంతం చేసుకున్నాడు. మాస్కోలో జరిగిన ప్రతిష్టాత్మక తాల్ స్మారక టోర్నమెంట్లో 48 ఏళ్ల ఆనంద్ ర్యాపిడ్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ తొమ్మిది రౌండ్లకుగాను ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగు గేముల్లో గెలిచి, మరో నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్ ఒక గేమ్‌లో ఓడిపోయాడు. -
ప్రతుల్‌కు తొలి టైటిల్
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ యువతార ప్రతుల్ జోషి తన కెరీర్లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను సాధించాడు. బహ్రెరుున్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్ ఫైనల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన 22 ఏళ్ల ప్రతుల్ 21-17, 12-21, 21-15తో తన తమ్ముడు ఆదిత్య జోషిపై విజయం సాధించాడు. సెమీఫైనల్స్‌లో ప్రతుల్ 21-16, 22-20తో సిద్ధార్థ్ ఠాకూర్ (భారత్)పై నెగ్గగా... ప్రపంచ జూనియర్ మాజీ నంబర్‌వన్ ఆదిత్య 21-19, 21-7తో టాప్ సీడ్ ఆనంద్ పవార్ (భారత్)పై సంచలన విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో విఘ్నేశ్ దేవాల్కర్-రోహన్ కపూర్ జోడీ; మహిళల డబుల్స్‌లో ఫర్హా మాథెర్-ఆష్నా రాయ్ జంట రన్నరప్‌గా నిలిచారుు. -
ఈ ఏడాది కొనసాగుతున్న టైటిల్ నిరీక్షణ
సాక్షి క్రీడావిభాగం గత నాలుగేళ్లలో అంతర్జాతీయస్థాయిలో ప్రముఖ టైటిల్స్ సాధించి భారత బ్యాడ్మింటన్‌కు పర్యాయపదంగా మారిపోయిన సైనా నెహ్వాల్ దూకుడు ఈ ఏడాది మాత్రం తగ్గిపోయింది. 2009 నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ హైదరాబాదీ ఈ ఏడాది మాత్రం ఏ ఒక్క టోర్నీలోనూ కనీసం ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఇప్పటి వరకు ఈ సంవత్సరం సైనా పది టోర్నమెంట్లలో బరిలోకి దిగింది. మలేసియా ఓపెన్, ఇండోనేసియా ఓపెన్‌లో మినహా మిగతా టోర్నమెంట్లలో ఆమె క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది. ఒకప్పుడు చైనా క్రీడాకారిణుల నుంచే గట్టిపోటీని ఎదుర్కొన్న సైనాను ఇటీవల కాలంలో ఇతర దేశాల వారూ ఓడిస్తున్నారు. బ్యాడ్మింటన్ రాకెట్ పట్టినప్పటి నుంచి చిరకాల స్వప్నంగా నిలిచిన ఒలింపిక్ పతకాన్ని గత ఏడాదే నెగ్గడం... సూపర్ సిరీస్ టైటిల్స్ కూడా సాధించడం... ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ పతకం... కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం... ఇలా సైనా నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఒక్కోటి అధిగమిస్తూ వస్తోంది. అయితే ఏడాది కాలంగా సైనా ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే ఆమె రాకెట్లో పదును తగ్గినట్టే అనిపిస్తోంది. సైనా ఆటతీరుపై, వ్యూహాలపై ఆమె ప్రత్యర్థులు పక్కా హోంవర్క్ చేసి బరిలోకి దిగుతున్నారు. ఇన్నాళ్లు చైనా క్రీడాకారిణుల ఆధిపత్యాన్ని సవాలు చేసిన సైనాకు కొత్త ప్రత్యర్థులు ఎదురవుతున్నారు. ఈ ఏడాది సైనాను ఎనిమిది వేర్వేరు దేశాల క్రీడాకారిణులు ఓడించడం గమనార్హం. డెన్మార్క్ ఓపెన్‌లో సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో యోన్ జూ బే (దక్షిణ కొరియా)... సింగపూర్ ఓపెన్‌లో లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)... ఇండోనేసియా ఓపెన్‌లో జూలియన్ షెంక్ (జర్మనీ)... థాయ్‌లాండ్ ఓపెన్‌లో జువాన్ గూ (సింగపూర్)... ఇండియా ఓపెన్‌లో యు హషిమోటో (జపాన్)... స్విస్ ఓపెన్‌లో షిజియాన్ వాంగ్ (చైనా)... ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్).... మలేసియా ఓపెన్‌లో జూ యింగ్ తాయ్ (చైనీస్ తైపీ)... కొరియా ఓపెన్‌లో లీ హాన్ (చైనా) సైనాను ఓడించారు. ఈ ఏడాది సైనా మరో మూడు సూపర్ సిరీస్ టోర్నమెంట్లలో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్‌లో నాలుగో సీడ్‌గా పోటీపడనున్న సైనాకు ఈ టోర్నీలోనూ క్లిష్టమైన ‘డ్రా’ ఎదురయింది. ఆమె పార్శ్వంలోనే సింధు, యోన్ జూ బే, రత్చనోక్, లీ హాన్, షిజియాన్ వాంగ్ ఉన్నారు. ఈ టోర్నీ తర్వాత నవంబరు 12 నుంచి 17 వరకు చైనా ఓపెన్‌లో... నవంబరు 19 నుంచి 24 వరకు హాంకాంగ్ ఓపెన్‌లో సైనా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. డిసెంబరు 11 నుంచి 15 వరకు జరిగే సీజన్ ముగింపు టోర్నీ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లోనూ ఈ భారత స్టార్ పోటీపడవచ్చు. 23 ఏళ్ల సైనా తన ఆటతీరులోని లోపాలను సరిదిద్దుకొని... పూర్తి ఫిట్నెస్తో బరిలో దిగి... మెరుపులు మెరిపిస్తే ఆమెకు తదుపరి టోర్నీలలో విజయావకాశాలున్నాయి. ఈ ఏడాది సైనా ప్రదర్శన డెన్మార్క్ ఓపెన్-క్వార్టర్ ఫైనల్ ప్రపంచ చాంపియన్‌షిప్-క్వార్టర్ ఫైనల్ సింగపూర్ ఓపెన్-క్వార్టర్ ఫైనల్ ఇండోనేసియా ఓపెన్-సెమీఫైనల్ థాయ్‌లాండ్ ఓపెన్-క్వార్టర్ ఫైనల్ ఇండియా ఓపెన్-ప్రిక్వార్టర్ ఫైనల్ స్విస్ ఓపెన్-సెమీఫైనల్ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్-సెమీఫైనల్ మలేసియా ఓపెన్-సెమీఫైనల్ కొరియా ఓపెన్-క్వార్టర్ ఫైనల్ గత నాలుగేళ్లలో సైనా నెగ్గిన టైటిల్స్ 2009-2 (ఇండోనేసియా ఓపెన్, ఇండియా గ్రాండ్‌ప్రి గోల్డ్) 2010-4 (ఇండోనేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, హాంకాంగ్ ఓపెన్, ఇండియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్) 2011-1 (స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్) 2012-4 (ఇండోనేసియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్, థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్)