ఈ ఏడాది కొనసాగుతున్న టైటిల్ నిరీక్షణ | This year, the title of the ongoing expectation | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది కొనసాగుతున్న టైటిల్ నిరీక్షణ

Published Mon, Oct 21 2013 1:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM

ఈ ఏడాది  కొనసాగుతున్న టైటిల్ నిరీక్షణ

ఈ ఏడాది కొనసాగుతున్న టైటిల్ నిరీక్షణ

సాక్షి క్రీడావిభాగం
 గత నాలుగేళ్లలో అంతర్జాతీయస్థాయిలో ప్రముఖ టైటిల్స్ సాధించి భారత బ్యాడ్మింటన్‌కు పర్యాయపదంగా మారిపోయిన సైనా నెహ్వాల్ దూకుడు ఈ ఏడాది మాత్రం తగ్గిపోయింది. 2009 నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒక అంతర్జాతీయ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ హైదరాబాదీ ఈ ఏడాది మాత్రం ఏ ఒక్క టోర్నీలోనూ కనీసం ఫైనల్‌కు చేరుకోలేకపోయింది. ఇప్పటి వరకు ఈ సంవత్సరం సైనా పది టోర్నమెంట్లలో బరిలోకి దిగింది. మలేసియా ఓపెన్, ఇండోనేసియా ఓపెన్‌లో మినహా మిగతా టోర్నమెంట్లలో ఆమె క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని అధిగమించడంలో విఫలమైంది.
 
 ఒకప్పుడు చైనా క్రీడాకారిణుల నుంచే గట్టిపోటీని ఎదుర్కొన్న సైనాను ఇటీవల కాలంలో ఇతర దేశాల వారూ ఓడిస్తున్నారు. బ్యాడ్మింటన్ రాకెట్ పట్టినప్పటి నుంచి చిరకాల స్వప్నంగా నిలిచిన ఒలింపిక్ పతకాన్ని గత ఏడాదే నెగ్గడం... సూపర్ సిరీస్ టైటిల్స్ కూడా సాధించడం... ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ పతకం... కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం... ఇలా సైనా నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఒక్కోటి అధిగమిస్తూ వస్తోంది. అయితే ఏడాది కాలంగా సైనా ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే ఆమె రాకెట్‌లో పదును తగ్గినట్టే అనిపిస్తోంది.
 
 సైనా ఆటతీరుపై, వ్యూహాలపై ఆమె ప్రత్యర్థులు పక్కా హోంవర్క్ చేసి బరిలోకి దిగుతున్నారు. ఇన్నాళ్లు చైనా క్రీడాకారిణుల ఆధిపత్యాన్ని సవాలు చేసిన సైనాకు కొత్త ప్రత్యర్థులు ఎదురవుతున్నారు. ఈ ఏడాది సైనాను ఎనిమిది వేర్వేరు దేశాల క్రీడాకారిణులు ఓడించడం గమనార్హం.
 
 
 డెన్మార్క్ ఓపెన్‌లో సుంగ్ జీ హున్ (దక్షిణ కొరియా)... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో యోన్ జూ బే (దక్షిణ కొరియా)... సింగపూర్ ఓపెన్‌లో లిందావెని ఫనెత్రి (ఇండోనేసియా)... ఇండోనేసియా ఓపెన్‌లో జూలియన్ షెంక్ (జర్మనీ)... థాయ్‌లాండ్ ఓపెన్‌లో జువాన్ గూ (సింగపూర్)... ఇండియా ఓపెన్‌లో యు హషిమోటో (జపాన్)... స్విస్ ఓపెన్‌లో షిజియాన్ వాంగ్ (చైనా)... ఆల్ ఇంగ్లండ్ ఓపెన్‌లో ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్).... మలేసియా ఓపెన్‌లో జూ యింగ్ తాయ్ (చైనీస్ తైపీ)... కొరియా ఓపెన్‌లో లీ హాన్ (చైనా) సైనాను ఓడించారు.
 ఈ ఏడాది సైనా మరో మూడు సూపర్ సిరీస్ టోర్నమెంట్లలో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్‌లో నాలుగో సీడ్‌గా పోటీపడనున్న సైనాకు ఈ టోర్నీలోనూ క్లిష్టమైన ‘డ్రా’ ఎదురయింది. ఆమె పార్శ్వంలోనే సింధు, యోన్ జూ బే, రత్చనోక్, లీ హాన్, షిజియాన్ వాంగ్ ఉన్నారు. ఈ టోర్నీ తర్వాత నవంబరు 12 నుంచి 17 వరకు చైనా ఓపెన్‌లో... నవంబరు 19 నుంచి 24 వరకు హాంకాంగ్ ఓపెన్‌లో సైనా బరిలోకి దిగే అవకాశాలున్నాయి. డిసెంబరు 11 నుంచి 15 వరకు జరిగే సీజన్ ముగింపు టోర్నీ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లోనూ ఈ భారత స్టార్ పోటీపడవచ్చు. 23 ఏళ్ల సైనా తన ఆటతీరులోని లోపాలను సరిదిద్దుకొని... పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలో దిగి... మెరుపులు మెరిపిస్తే ఆమెకు తదుపరి టోర్నీలలో విజయావకాశాలున్నాయి.
 
 ఈ ఏడాది సైనా ప్రదర్శన
 డెన్మార్క్ ఓపెన్-క్వార్టర్ ఫైనల్
 ప్రపంచ చాంపియన్‌షిప్-క్వార్టర్ ఫైనల్
 సింగపూర్ ఓపెన్-క్వార్టర్ ఫైనల్
 ఇండోనేసియా ఓపెన్-సెమీఫైనల్
 థాయ్‌లాండ్ ఓపెన్-క్వార్టర్ ఫైనల్
 ఇండియా ఓపెన్-ప్రిక్వార్టర్ ఫైనల్
 స్విస్ ఓపెన్-సెమీఫైనల్
 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్-సెమీఫైనల్
 మలేసియా ఓపెన్-సెమీఫైనల్
 కొరియా ఓపెన్-క్వార్టర్ ఫైనల్
 
 గత నాలుగేళ్లలో సైనా నెగ్గిన టైటిల్స్
 2009-2 (ఇండోనేసియా ఓపెన్, ఇండియా గ్రాండ్‌ప్రి గోల్డ్)
 2010-4 (ఇండోనేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, హాంకాంగ్ ఓపెన్, ఇండియా ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్)
 2011-1 (స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్)
 2012-4 (ఇండోనేసియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్, థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement