ఒలింపిక్స్‌కు ముందు ‘కామన్వెల్త్‌’ నిర్వహించండి.. భారత్‌కు సీజీఎఫ్‌ చీఫ్‌ సూచన | Conducting 2030 CWG Will Be Right Step In India Goal To Host 2036 Olympics, Says Commonwealth Games Federation CEO Sadleir | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌కు ముందు ‘కామన్వెల్త్‌’ నిర్వహించండి.. భారత్‌కు సీజీఎఫ్‌ చీఫ్‌ సూచన

Published Tue, Feb 18 2025 9:00 AM | Last Updated on Tue, Feb 18 2025 9:00 AM

Conducting 2030 CWG Will Be Right Step In India Goal To Host 2036 Olympics, Says Commonwealth Games Federation CEO Sadleir

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఇటీవల తరచూ ఒలింపిక్స్‌ ఆతిథ్యం కోసం తహతహలాడుతోంది. 2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు ఆసక్తి కనబరుస్తోంది. అయితే భారత్‌ లక్ష్యం విశ్వక్రీడలైతే ముందుగా కామన్వెల్త్‌ క్రీడలు నిర్వహిస్తే ఇది మెగా ఈవెంట్‌కు ముందు మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని కామన్వెల్త్‌ క్రీడల సమాఖ్య (సీజీఎఫ్‌) సీఈఓ కేటీ సాడ్లియెర్‌ సూచించారు. 

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌’లో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఏ దేశానికైనా ఒలింపిక్స్‌ ఆతిథ్యమనేది గొప్ప కీర్తిని తెస్తుంది. అయితే అలాంటి ప్రతిష్టాత్మక క్రీడలకు ముందు కామన్వెల్త్‌ క్రీడలు (2030) నిర్వహిస్తే మేటి అంతర్జాతీయ ఈవెంట్‌కు సరైన సన్నాహకంగా, చక్కని ముందడుగుగా ఉపయోగపడుతుంది’ అని అన్నారు. 

భవిష్యత్తులో ఒలింపిక్స్‌ పతకాల పట్టికలో భారత్‌ టాప్‌–10లో నిలుస్తుందని ఆమె చెప్పారు. ‘భారత్‌ దశ, దిశ ఇప్పుడు మారుతోంది. సరైన నాయకత్వం, మౌలిక వసతుల కల్పన, ప్రామాణిక శిక్షణతో క్రీడల భవిష్యత్‌ మారబోతోంది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై ప్రదర్శన, పతకాలనేవి ఆ దేశ ప్రతిష్టను కచ్చితంగా పెంచుతాయి. తప్పకుండా భారత్‌ క్రీడాశక్తిగా ఎదుగుతుంది’ అని కేటీ సాడ్లియెర్‌ తెలిపారు. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం భారత్‌ ఒకే ఒక్కసారి 2010లో కామన్వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement