‘కామన్వెల్త్’కు సైనా దూరం
గాయం కారణంగా వైదొలిగిన షట్లర్
భారత్ పతకావకాశాలకు దెబ్బ
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభానికి ముందే భారత పతకావకాశాలకు దెబ్బ తగిలింది. కనీసం రెండు పతకాలు సాధిస్తుందనుకున్న భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్ నుంచి వైదొలిగింది. కామన్వెల్త్ గేమ్స్ ఈనెల 23 నుంచి ఆగస్టు 3 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో నగరంలో జరుగుతాయి. ‘జూన్ చివరి వారంలో సిడ్నీలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా తొలి రౌండ్ మ్యాచ్‌లో గజ్జల్లో గాయమైంది. ఆ తర్వాత పాదంలో బొబ్బలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ అన్నింటికీ ఓర్చుకొని టైటిల్ సాధించాను. స్వదేశానికి చేరుకున్నాక రెండున్నర వారాల సమయం లభించింది. కోలుకోవడానికి వారం పట్టింది. కానీ శిక్షణ తీసుకోవడానికి వారం కంటే తక్కువ సమయం లభించింది.
దాంతో కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను. ఈ నిర్ణయం నా మనసును ఎంతో గాయపరిచింది’ అని సైనా వివరించింది. నాలుగేళ్ల క్రితం సొంతగడ్డపై జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సైనా వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, టీమ్ విభాగంలో రజతం సాధించింది. ‘ప్రాక్టీస్ కూడా ప్రారంభించాను. కామన్వెల్త్‌లో వెళ్లి ఆడతానని కూడా అనుకున్నాను. కానీ మళ్లీ గాయపడదల్చుకోలేదు. తదుపరి సీజన్ కోసం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండటం తప్పనిసరి. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాను’ అని సైనా వ్యాఖ్యానించింది.