గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ భారీ బృందాన్ని పంపనుంది. 14 అంశాల్లో మొత్తం 224 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు.
న్యూఢిల్లీ: గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ భారీ బృందాన్ని పంపనుంది. 14 అంశాల్లో మొత్తం 224 మంది అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు. ఇందులో ఏడుగురు పారా అథ్లెట్లు ఉన్నారు. కోచ్‌లు, సహాయక సిబ్బందితో కలిసి 90 మంది అధికారులు కూడా ఈ బృందం వెంట వెళతారు. ఈనెల 23 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న ఈ టోర్నీలో 17 అంశాల్లో 261 మెడల్ ఈవెంట్స్ ఉన్నాయి.
అయితే నెట్‌బాల్, రగ్బీ, ట్రయథ్లాన్‌లలో భారత్ పాల్గొనడం లేదు. పారా అథ్లెట్స్ 22 ఈవెంట్స్‌లో పోటీపడనున్నారు. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 495 మంది అథ్లెట్లను బరిలోకి దించి రికార్డు స్థాయిలో 101 పతకాలు సాధించింది. గ్లాస్గో గేమ్స్‌లో ఆర్చరీ, టెన్నిస్‌లను పక్కనబెట్టడంతో భారత్ పతకాలు గెలిచే అవకాశాలపై కాస్త ప్రభావం చూపనుంది.
అయితే వీలైనన్ని ఎక్కువ పతకాలు సాధించేందుకు కృషి చేస్తామని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఈ క్రీడలకు అదనంగా మరో 100 కోట్లు కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు. సమయం లేకపోవడం వల్ల ఆసియా గేమ్స్-2019 బిడ్‌ను దాఖలు చేయలేకపోయామన్నారు. అయితే ఇందులో ఐఓఏను గానీ, క్రీడా శాఖను గానీ తప్పుబట్టలేమని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఆసియా గేమ్స్‌ను నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.