న్యూఢిల్లీ: ఆధార్ నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఆధార్ నంబర్ కలిగి ఉన్నవారు ఎన్‌రోల్‌మెంట్ తేదీ నుంచి పదేళ్లు పూర్తయ్యాక గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ వంటి పత్రాలను (సపోర్టింగ్ డాక్యుమెంట్స్) కనీసం ఒక్కసారైనా అప్‌డేట్ చేసుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల సీఐడీఆర్ డేటాబేస్‌లో ఆధార్‌కు సంబంధించిన సమాచారంలో కచ్చితత్వాన్ని కొనసాగింవచ్చని తెలియజేసింది. ఎన్‌రోల్‌మెంట్ జరిగాక ప్రతి పదేళ్లకోసారి సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఆప్‌డేట్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వివరించింది.
పదేళ్ల కంటే ఎక్కువ రోజుల క్రితం ఆధార్ కార్డు పొంది, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను అప్‌డేట్ చేసుకోనివారు వెంటనే ఆ పూర్తి చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) గత నెలలో విజ్ఞప్తి చేసింది. మై ఆధార్ పోర్టల్, మై ఆధార్ యాప్ ద్వారా లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాల్లో డాక్కుమెంట్లు సమర్పించి, వివరాలు ఆప్‌డేట్ చేసుకోవచ్చని సూచించింది. దేశంలో ఇప్పటిదాకా 134 కోట్ల మందికి ఆధార్ సంఖ్యలను జారీ చేశారు. గుర్తింపు కార్డులు, చిరునామా మారినవారు కూడా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి, ఆధార్ కార్డుల్లో వివరాలు మార్చుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ నంబర్ కలిగి ఉండడం తప్పనిసరిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment