సాక్షి, అమరావతి: ఆధార్‌లో అడ్రసు తదితర వివరాలను సొంతంగా అధికారిక ఆన్‌లైన్ వెబ్‌పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకునే వారికి ఆ సేవలను ఉచితంగా అందజేసే గడువును ఆధార్‌కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ మరోసారి వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ వరకు పొడిగించింది. ఆధార్‌కార్డులు కలిగి ఉన్న ఎవరైనా ఆ కార్డు పొందిన పదేళ్ల గడువులో ఒక్కసారైనా వారికి సంబంధించి తాజా అడ్రసు తదితర వివరాలను కచ్చితంగా అప్‌డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ గతంలోనే సూచించింది.
ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాల్లో ఆధార్ వినియోగం పెరిగిన నేపథ్యంలో వినియోగదారుడి పాత సమాచారం కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూఐడీఏఐ అప్పట్లో ప్రకటించింది. అదే సమయంలో.. ఆధార్‌కు సంబంధించి వివిధ రకాల సేవలను పొందాలంటే యూఐఏడీఐ నిర్ధారించిన నిర్ణీత ఫీజు చెల్లించాల్సి ఉండగా.. ఆన్‌లైన్‌లో సొంతంగా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకునే వారికి ఆ సేవలకు మినహాయింపు ఉంటుందని కూడా అప్పట్లో ప్రకటించింది.
మొదట 2023 ఫిబ్రవరి వరకే ఈ ఉచిత సేవలని యూఐడీఏఐ ప్రకటించగా.. అనంతరం ఆ గడువును మూడు దఫాలు పొడిగించింది. తాజాగా నాలుగోసారి 2024 మార్చి 14 వరకు గడువు పొడిగిస్తున్నట్టు పేర్కొంటూ యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ సీఆర్ ప్రభాకరన్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment