enrollment
-
29 సీబీఎస్ఈ స్కూళ్లలో డమ్మీ విద్యార్థులు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) అధికారుల ఆకస్మిక తనిఖీల్లో ‘డమ్మీ’ విద్యార్థుల బాగోతం బయటపడింది. ఆయా సీబీఎస్ఈ అఫిలియేటెడ్ పాఠశాలల్లో వాస్తవ విద్యార్థుల సంఖ్యకు మించి ఎన్రోల్మెంట్ ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ, బెంగళూరు, వారణాసి, బిహార్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలోని మొత్తం 29 పాఠశాలల్లో ఇలాంటి దందా జరుగుతున్నట్లు తేల్చారు. బాధిత పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. మౌలిక సదుపాయాల లేమి వంటి ఇతర నిబంధనల తీవ్ర ఉల్లంఘనకు పాల్పడిన ఈ పాఠశాలల యాజమాన్యాలపై న్యాయపరంగానూ చర్యలు తీసుకోనున్నారు.బుధ, గురువారాల్లో 29 బృందాలు ఈ మేరకు తనిఖీలు చేపట్టాయని సీబీఎస్ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా చెప్పారు. అవకతవకలను గుర్తించిన స్కూళ్లలో దేశ రాజధాని ఢిల్లీలోనివే 18 కాగా, వారణాసిలో మూడు, బెంగళూరు, పట్నా, అహ్మదాబాద్, బిలాస్పూర్, ఛత్తీస్‌గఢ్‌లలో రెండేసి చొప్పున ఉన్నాయన్నారు. ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రిపేరయ్యే విద్యార్థుల్లో కొందరు డమ్మీ స్కూళ్లలో ప్రవేశాలు పొంది, పరీక్షలకు సిద్ధమయ్యేందుకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు.తరగతులకు హాజరు కాకుండా వీరు నేరుగా బోర్డ్ పరీక్షలు రాసేలా ఆయా స్కూళ్లు వీరికి వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఏయే రాష్ట్రాల్లో మెడికల్ లేదా ఇంజినీరింగ్ సీట్లు పొందేందుకు అవకాశం ఉంటుందో చూసుకుని మరీ సంబంధిత ప్రాంతాల్లోని డమ్మీ స్కూళ్లలో ప్రవేశాలు తీసుకుంటున్నారు. చదవండి: కొబ్బరినూనెపై ‘పన్ను’ వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు -
Supreme Court: లాయర్లుగా ఎన్రోల్కు అంత ఫీజా?
న్యూఢిల్లీ: న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టేందుకు లాయర్లుగా ఎన్రోల్చేసుంటున్న న్యాయశాస్త్ర పట్టభద్రుల నుంచి రాష్ట్రాల బార్ కౌన్సిళ్లు(ఎస్బీసీ) భారీ స్థాయిలో ఫీజులు వసూలుచేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. నిబంధనల ప్రకారం ఎస్సీ–ఎస్టీ కేటగిరీ లా పట్టభద్రుల నుంచి రూ.125 ఫీజు, జనరల్ కేటగిరీ నుంచి రూ.750 మించి వసూలుచేయకూడదని ధర్మాసనం ఆదేశించింది. ఎస్బీసీలు వసూలుచేస్తున్న విపరీతమైన ఫీజుల కారణంగా అణగారిన, ఆర్థికంగా వెనకబడిన వర్గాల పేద, మధ్యతరగతి లా పట్టభద్రులు న్యాయవృత్తిలోకి రాలేని పరిస్థితి నెలకొంటోందని, వారు ఈ వృత్తిలో భాగస్వాములయ్యే అవకాశాలు తగ్గిపోతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆవేదన వ్యక్తంచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ తీర్పు వెలువరిచింది. -
ఈపీఎఫ్‌వో రికార్డ్.. భారీగా పెరిగిన ఉద్యోగాలు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మే నెలలో నికరంగా 19.5 లక్షల మంది సభ్యులను చేర్చుకుంది. 2018 ఏప్రిల్‌లో మొదటి పేరోల్ డేటా జారీ చేసినప్పటి నుంచి ఇదే అత్యధికం అని కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.గత రికార్డులో అత్యధికంగా 18.9 లక్షల చేరికలు ఏప్రిల్‌లో నమోదయ్యాయి. ఏడాది ప్రాతికదిన చూస్తే ఈ మే నెలలో సభ్యుల నికర చేరికలు 19.6% పెరిగాయి. పెరిగిన ఉపాధి అవకాశాలు, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, ఈపీఎఫ్ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌ల ప్రభావం వంటివి ఇందుగా కారణాలుగా తెలుస్తున్నాయి.మే నెలలో ఈపీఎఫ్‌వోలో దాదాపు 9,85,000 మంది కొత్త సభ్యులు నమోదు చేసుకున్నారు. ఇది గడిచిన ఏప్రిల్ నెలతో పోల్చితే 11% ఎక్కువ. 2023 మే కంటే 11.5% అధికం. కొత్త నమోదులలో 58% మంది 18-25 ఏళ్ల వారు ఉండటం హర్షణీయం. వ్యవస్థీకృత వర్క్‌ఫోర్స్‌లో చేరిన వ్యక్తులు యువత, ప్రధానంగా తాజా ఉద్యోగార్థులు అని మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇక ఈ నెలలో కొత్తగా చేరిన సభ్యులలో దాదాపు 2,48,000 మంది మహిళలు ఉన్నారని డేటా చూపుతోంది. ఇది 2023 మే నెలతో పోలిస్తే 12.2% పెరుగుదలను సూచిస్తుంది. అలాగే ఈ నెలలో మహిళా సభ్యుల నికర చేరిక దాదాపు 369,000 వద్ద ఉంది. ఏడాది ప్రాతిపదికన ఇది 17.24% పెరిగింది. -
ఈఎస్ఐసీ కిందకు 16.47 లక్షల మంది
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కింద ఏప్రిల్ నెలలో 16.47 లక్షల మంది కొత్తగా వచ్చి చేరారు. ఇందుకు సంబంధించిన గణాంకాలను కేంద్ర కార్మిక శాఖ తాజాగా విడుదల చేసింది.ఇందులో 47.60 శాతం అంటే 7.84 లక్షల మంది వయసు 25 ఏళ్లలోపే ఉందని, కొత్త ఉద్యోగాల కల్పనను ఈ గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని కార్మిక శాఖ పేర్కొంది. మొత్తం కొత్త సభ్యుల్లో 3.38 లక్షల మంది మహిళలు ఉన్నారు. ఈఎస్ఐసీ కింద 53 మంది ట్రాన్స్జెండర్లు కూడా నమోదు చేసుకున్నారు.సమాజంలో అన్ని వర్గాలకు ప్రయోజనాలు అందించడమే ఈ పథకం లక్ష్యంగా కార్మిక శాఖ తెలిపింది. ఇక ఏప్రిల్‌లో 18,490 కొత్త సంస్థలు ఈఎస్ఐసీ కింద రిజిస్టర్ చేసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈఎస్ఐ కవరేజీ వచ్చినట్టయింది. -
ఈపీఎఫ్‌వో కిందకు 15.62 లక్షల సభ్యులు
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో 15.62 లక్షల మంది సభ్యులు డిసెంబర్ నెలలో చేరారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే సభ్యుల చేరికలో 12 శాతం వృద్ధి నమోదైంది. అదే 2022 డిసెంబర్ నెల చేరికలతో పోలిస్తే 4.62 శాతం వృద్ధి కనిపించింది. ఉపాధి అవకాశాల పెరుగుదల, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, మరిన్ని సంస్థలకు చేరువ అయ్యేందుకు ఈపీఎఫ్‌వో చేపడుతున్న కార్యక్రమాలు సభ్యుల పెరుగుదలకు సాయపడుతున్నట్టు కేంద్ర కారి్మక శాఖ ప్రకటించింది. 8.41 లక్షల మంది ఈపీఎఫ్‌వో కింద మొదటిసారి నమోదు అయ్యారు. అంటే తొలిసారి వీరు సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. 2023 నవంబర్‌తో పోలిస్తే కొత్త సభ్యుల పెరుగుదల 14 శాతంగా ఉంది. పైగా డిసెంబర్ నెలకు సంబంధించిన నికర కొత్త సభ్యుల్లో 57 శాతం మంది 18–25 వయసులోని వారే కావడం గమనార్హం. మిగిలిన సభ్యులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం ద్వారా తమ ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకున్నారు. 2.09 లక్షల మంది మహిళలు.. 8.41 లక్షల కొత్త సభ్యుల్లో 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే 7.57 శాతం అధికం. రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది చేరారు. డిసెంబర్ నెలకు సంబంధించి కొత్త చేరికల్లో 58.33 శాతం ఈ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఇందులో మహారాష్ట్ర వాటా 21.63 శాతంగా ఉంది. ఐరన్ అండ్ స్టీల్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్, జనరల్ ఇన్సూరెన్స్ రంగాలు ఎక్కువ మందికి అవకాశం కల్పించాయి. -
డీమ్యాట్ నామినీ నమోదు గడువు పెంపు
న్యూఢిల్లీ: డీమ్యాట్ ఖాతాదారులు నామినేషన్‌కు సంబంధించి తమ ఎంపికను తెలియజేసేందుకు గడువును సెబీ డిసెంబర్ చివరి వరకు పొడిగించింది. వాస్తవానికి అయితే ఈ నెల 30తో ఈ గడువు ముగుస్తోంది. ప్రస్తుత డీమ్యాట్ ఖాతాదారులు తమ ఖాతాలకు సంబంధించి నామినీ నమోదు లేదంటే నామినీ నిలిపివేయడం ఏదో ఒక ఆప్షన్ ఇవ్వడం తప్పనిసరి. ఇందుకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇక ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్ ఎంపికను స్వచ్ఛందం చేస్తున్నట్టు సెబీ ప్రకటించింది. ట్రేడింగ్ ఖాతాలకు ఇవ్వడమా, ఇవ్వకపోవడమా అనేది ఇన్వెస్టర్ల అభీష్టానికే విడిచిపెట్టింది. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు, డిపాజిటరీలు, బ్రోకర్ల అసోసియేషన్లు, ఇతర భాగస్వాముల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్‌ను స్వచ్ఛందం చేసినట్టు సెబీ తెలిపింది. డీమ్యాట్ ఖాతాలకు సంబంధించి నామినేషన్ ఎంపిక గడువును డిసెంబర్ 31వరకు పొడిగించినట్టు ప్రకటించింది. ఇక ఫిజికల్‌గా షేర్లు కలిగిన వారు తమ ఫోలియోలకు సంబంధించి పాన్, నామినేషన్, కాంటాక్ట్ వివరాలు, బ్యాంక్ ఖాతా, స్పెసిమెన్ సిగ్నేచర్ (సంతకం)ను డిసెంబర్ 31 వరకు ఇవ్వొచ్చని సెబీ స్పష్టం చేసింది. -
వైద్యవిద్య పీజీ ప్రవేశాల వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్ అభ్యర్థులు https:// pgcq.ysruhs.com వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆప్షన్ల నమోదు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వీసీ డాక్టర్ బాబ్జీ సూచించారు. పలు కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలపై ఎన్ఎంసీ పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతి పత్రాలు వెలుగులోకి రావడంతో తొలిదశ కౌన్సెలింగ్‌ను రద్దుచేసినట్లు తెలిపారు. ఎన్ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్‌ను వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. తొలిదశలో కేటాయించిన సీట్లు రద్దుచేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. జీఎస్ఎల్, మహారాజాల్లోను ఫేక్ అనుమతులుశాంతీరామ్ వైద్యకళాశాలలో ఫేక్ అనుమతుల వ్యవహారం బయటపడటంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు మిగిలిన కళాశాలల్లో సీట్లను పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని జీఎస్ఎల్, విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రైవేట్ వైద్యకళాశాలల్లోని పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్లకు మధ్య వ్యత్యాసం గుర్తించారు. దీంతో ఎన్ఎంసీకి ఈ వ్యవహారంపై లేఖ రాశారు. ఆయా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలకు తాము అనుమతులు ఇవ్వలేదని ఎన్ఎంసీ శుక్రవారం స్పష్టం చేసింది. సీట్లు పెంచుతూ వెలువడిన అనుమతులు ఫేక్/ఫోర్జరీవని తెలిపింది. మరోవైపు 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల డీఎంఈలు ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు సైతం ఇతర మాధ్యమాల్లో పొందుపరిచే సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. -
AP: 2023–24లో వంద శాతం నమోదు కోసం విద్యా శాఖ ప్రణాళిక
సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరంలో బడి ఈడు పిల్లలందరినీ బడుల్లో చేర్పించాలని విద్యా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. నూరు శాతం విద్యార్థుల నమోదు కోసం ఐదువారాల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించడం, ఒక తరగతి నుంచి మరో తరగతిలో పిల్లలు చేరేలా చర్యలు తీసుకోవడం, పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాక తదుపరి విద్యాభ్యాసం కోసం చేరికల డేటాను సేకరించడం, ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో అసలు బడిలో చేరని, డ్రాపవుట్, బాల కార్మికులను గుర్తించడం, వీరి కోసం ప్రత్యేక ఎన్రోల్మెంట్ డ్రైవ్ వంటివి నిర్వహించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నూరు శాతం విద్యార్థుల నమోదు కోసం ఈ నెల 12 వరకు డిప్యూటీ ఈవోలు, సెక్టోరల్ అధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో డీఈవోలు సమావేశాలు నిర్వహించాలి. అలాగే ఈ నెల 15 నుంచి 19 వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో భాగంగా సంబంధిత పాఠశాలలు పిల్లల గణన చేపట్టాలి. ఉపాధ్యాయుల సహాయంతో బడి ఈడు పిల్లల జనాభాను లెక్కించి రిజిస్టర్లో నమోదు చేయాలి. ఇందుకు అంగన్వాడీ టీచర్లు, గ్రామ, వార్డు వలంటీర్లు, విద్య–సంక్షేమ సహాయకులు, ఏఎన్ఎంలు సహకరిస్తారు. బడి ఈడు పిల్లల జాబితాను వయసుల వారీగా, బాలబాలికలవారీగా తయారుచేయాలి. ఈ డేటాను సంబంధిత గ్రామ, స్కూల్, మండల స్థాయిల్లో ఉంచాలి. మండల స్థాయి తుది జాబితాను సంబంధిత ఎంఈవోకు, డీఈవోకు సమర్పించాలి. పథకాల ప్రయోజనాలను వివరించాలి.. పేరెంట్–టీచర్స్, సర్పంచ్, వార్డు సభ్యులు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సంబంధిత ప్రజాప్రతినిధులు సమావేశాలను నిర్వహించాలి. వీటిలో బడి ఈడు పిల్లల జాబితాను ప్రదర్శించాలి. ఆయా స్కూల్స్‌లో విజయాలతోపాటు మన బడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి తదితర పథకాల వల్ల కలిగే లబ్ధి గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించాలి. ఇందుకు సంబంధించిన పోస్టర్లను, బ్యానర్లను గ్రామ కేంద్రాల్లో ప్రదర్శించాలి. పిల్లల నమోదు కోసం ర్యాలీలు నిర్వహించాలి. సమీపంలోని పాఠశాలల్లో నమోదు చేయడానికి ఐదేళ్లు, ఆ పై వయసు గల పిల్లలను, ఫౌండేషన్ స్కూళ్లలో 2వ తరగతి పూర్తి చేసిన పిల్లలను గుర్తించాలి. వీరిని సమీపంలోని పాఠశాలల్లో మూడో తరగతిలో చేర్పించాలి. అలాగే ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన పిల్లలను గుర్తించి సమీపంలోని పూర్వ ఉన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతిలో నమోదు చేయించాలి. ప్రీ హైస్కూల్స్‌లో 7వ తరగతి, 8వ తరగతి పూర్తి చేసిన పిల్లలను గుర్తించి సమీపంలోని హైస్కూల్స్‌లో 9వ తరగతిలో చేర్పించాలి. ఉన్నత విద్యలో ప్రవేశం పొందడానికి విద్యార్థులకు రికార్డ్ షీట్స్, బదిలీ సర్టిఫికెట్ జారీ చేయాలి. ప్రభుత్వ లేదా ఇతర సంస్థల్లో వారి ప్రవేశాన్ని నిర్ధారించుకోవాలి. బాల కార్మికులను గుర్తించాలి.. ఈ నెల 22 నుంచి 26 వరకు పదో తరగతిలో ఉత్తీర్ణులైనవారు తదుపరి విద్యా సంస్థల్లో చేరుతున్నారో, లేదో తెలుసుకోవాలి. విద్యా సంవత్సరంలో డ్రాపవుట్ అడ్మిషన్ల జాబితాను తయారు చేయాలి. మే 29 నుంచి జూన్ 2 వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్‌లో భాగంగా అసలు ఎప్పుడూ బడిలో చేరని, డ్రాపవుట్స్, బాల కార్మికుల జాబితాలను గుర్తించాలి. వారి ఎన్రోల్మెంట్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. ఆ జాబితాలను సంబంధిత ఎంఈవోకు సమర్పించాలి. పాఠశాల సంసిద్ధత జూన్ 5 నుంచి 9 వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ సమయంలో ప్రవేశ ప్రక్రియను ప్రారంభించాలి. పాఠశాలను పునఃప్రారంభించే ముందు దానిలో భద్రతా చర్యలను పరిశీలించాలి. పాఠశాల ఆవరణ, రూఫ్ టాప్స్, క్రీడా మైదానాలు, ఆర్వో ప్లాంట్లు, తాగునీటి సరఫరా ట్యాంకులు, కిచెన్ షెడ్, పాత్రలు, టాయిలెట్లను శుభ్రం చేయాలి. నీటి సరఫరా ఉండేలా చూడాలి. చిన్న మరమ్మతులు ఏవైనా ఉంటే వాటిని ముందుగానే పూర్తి చేయాలి. కిచెన్ షెడ్లో గడువు ముగిసిన స్టాక్ ఏదైనా ఉంటే వాటిని పారేయాలి. విద్యుత్ మరమ్మతులు ఏవైనా ఉంటే చేయించాలి. తగిన సంఖ్యలో జగనన్న విద్యా కానుక కిట్లు ఉన్నాయో, లేదో నిర్ధారించుకోవాలి. బియ్యం, గుడ్లు, చిక్కీలు, రాగి మాల్ట్, రికార్డులు, రిజిస్టర్లు, ఇతర స్టేషినరీ లభ్యతను చూసుకోవాలి. రాబోయే విద్యా కార్యకలాపాల నిర్వహణ కోసం సంస్థాగత ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. చదవండి: సందడి ముగిసింది.. తెల్లపులి కుమారి ఇకలేదు.. -
వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఆధార్ నమోదు
సాక్షి, అమరావతి: వయోవృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన రోగపీడితులకు తమ ఇంటి వద్దే ఆధార్ నమోదు చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను రాష్ట్రాలకు పంపింది. ఈ విధానాన్ని బుధవారం నుంచే ఆందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికకు, ఇతర అవసరాలకు ఆధార్ తప్పనిసరి కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వయోవృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన రోగపీడితులు తమ సమాచారాన్ని ఈ–మెయిల్ ద్వారా యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) రీజనల్, రాష్ట్ర కార్యాలయాలకు అందిస్తే ఏడు పనిదినాల్లో వారి ఇంటికే వెళ్లి ఆధార్ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇంటికే వెళ్లి ఆధార్ నమోదు చేసినందుకు అదనపు సర్వీస్ చార్జీలు వసూలు చేస్తారు. ఒక అడ్రెస్ ఉన్న ఇంటిలో మొదటి వ్యక్తికి రూ.700, ఆ తర్వాత ఎంత మంది ఉన్నా ప్రతి ఒక్కరికి రూ.350 చొప్పున జీఎస్టీతో కలిపి సేవా రుసుం వసూలు చేస్తారు. యూఐడీఏఐ ప్రాంతీయ, రాష్ట్ర కార్యాలయాలను https://www.uidai.gov.in/en/ contact&support/regional&offices. html అనే వెబ్సైట్ ద్వారా సంప్రదించాలని సూచించింది. -
పదేళ్లకోసారి ‘ఆధార్’ అప్డేట్ చేయాల్సిందే
న్యూఢిల్లీ: ఆధార్ నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఆధార్ నంబర్ కలిగి ఉన్నవారు ఎన్రోల్మెంట్ తేదీ నుంచి పదేళ్లు పూర్తయ్యాక గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ వంటి పత్రాలను (సపోర్టింగ్ డాక్యుమెంట్స్) కనీసం ఒక్కసారైనా అప్డేట్ చేసుకోవాలని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల సీఐడీఆర్ డేటాబేస్‌లో ఆధార్‌కు సంబంధించిన సమాచారంలో కచ్చితత్వాన్ని కొనసాగింవచ్చని తెలియజేసింది. ఎన్రోల్మెంట్ జరిగాక ప్రతి పదేళ్లకోసారి సపోర్టింగ్ డాక్యుమెంట్లు ఆప్డేట్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వివరించింది. పదేళ్ల కంటే ఎక్కువ రోజుల క్రితం ఆధార్ కార్డు పొంది, ఇప్పటిదాకా ఒక్కసారి కూడా గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను అప్డేట్ చేసుకోనివారు వెంటనే ఆ పూర్తి చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) గత నెలలో విజ్ఞప్తి చేసింది. మై ఆధార్ పోర్టల్, మై ఆధార్ యాప్ ద్వారా లేదా ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల్లో డాక్కుమెంట్లు సమర్పించి, వివరాలు ఆప్డేట్ చేసుకోవచ్చని సూచించింది. దేశంలో ఇప్పటిదాకా 134 కోట్ల మందికి ఆధార్ సంఖ్యలను జారీ చేశారు. గుర్తింపు కార్డులు, చిరునామా మారినవారు కూడా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించి, ఆధార్ కార్డుల్లో వివరాలు మార్చుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ నంబర్ కలిగి ఉండడం తప్పనిసరిగా మారింది. -
కుమార్తెను ప్రభుత్వ బడిలో చేర్పించిన జూనియర్ సివిల్ జడ్జి
కొంత మంది ఆదర్శాలు వల్లిస్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఆదర్శాలను ఆచరించి చూపిస్తుంటారు. ఈ కోవకే చెందుతారు నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జి. తమ గారాలపట్టిని సర్కారుబడిలో చేర్చి శభాష్ అనిపించుకున్నారు. ఖలీల్‌వాడి : నిజామాబాద్ జూనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్, ప్రియాంక జాదవ్ దంపతులు తమ అయిదేళ్ల కుమార్తె అంబికా జాదవ్‌ను చంద్రశేఖర్ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతిలో బుధవారం చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నవారు ప్రభుత్వ పాఠశాలల్లో తమ సంతానాన్ని చేర్పిస్తే స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. (క్లిక్: నువ్వొస్తేనే నేనెళ్తా.. హామీ ఇచ్చేవరకు కదిలేదే లేదు!) -
మూడ్రోజులు మంటలే..
సాక్షి, హైదరాబాద్: వేసవి ముదరకముందే ఎండలతో తెలంగాణ మండిపోతోంది. సాధారణం కంటే 2,3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ బుధవారం భానుడి భగభగలతో అల్లాడిపోయింది. సాధారణం కంటే 3.5 డిగ్రీలు అధికంగా 40.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్‌లో 42.3డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 41డిగ్రీలు, మహబూబ్‌నగర్, మెదక్‌లలో 40 డిగ్రీలకు పైగా నమోదయ్యింది. కాగా వచ్చే మూడు రోజులు ఉత్తర తెలంగాణా జిల్లాలతో పాటు నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్ తదితర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా 2 నుండి 4 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలోని ఉత్తర, వాయువ్య జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరించింది. మార్చి చివరి వారంలోనే ఈ విధంగా ఎండలు దంచి కొడుతుండటంతో ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఎండల తీవ్రతను బట్టి అలర్ట్‌లు వాతావరణ శాఖ ఎండల తీవ్రతను బట్టి ప్రజలను అప్రమత్తం చేస్తుంటుంది. సాధారణం కంటే ఆరు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైతే అత్యంత తీవ్రమైన ఎండగా గుర్తించి రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. నాలుగైదు డిగ్రీల వరకు ఎక్కువగా నమోదైతే తీవ్రమైన ఎండగా గుర్తించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. సాధారణం కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైతే గుర్తించి ఎల్లో (హీట్ వేవ్ వార్నింగ్) అలర్ట్ ఇస్తారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలున్నప్పుడు వైట్ అలర్ట్ జారీ చేస్తారు. వడదెబ్బతో అనారోగ్యం.. అధిక ఎండలతో పలుచోట్ల కోతకు సిద్ధమైన వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి కూలీలు ఎండలకు మాడిపోతున్నారు. కాగా బయట తిరిగేవారు, పిల్లలు, వృద్ధులు తీవ్రమైన ఎండలు, వడదెబ్బతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు డయేరియా బారిన పడే ప్రమాదముంది. వడదెబ్బ తగిలితే వాంతులు, విరోచనాలయ్యే అవకాశం ఉంది. తలనొప్పి, తల తిరగడం, నీరసం, తీవ్రమైన జ్వరం, అధికనిద్ర, మూర్ఛ, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితికి గురయ్యే ప్రమాదముందని నిజామాబాద్ మెడికల్ కాలేజీ క్రిటికల్ కేర్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ మాదల చెబుతున్నారు. కెరమెరి@43.9 తిర్యాణి (ఆసిఫాబాద్): రాష్ట్రంలో ఆదిలాబాద్‌లో అత్యధిక ఉష్ణోగ్రత (42.3) నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండల కేంద్రంలో 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు సమా చారం అందింది. అదే జిల్లాలోని కౌటాల మండల కేంద్రంలో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలుపు కాటన్ దుస్తులు మంచిది ► ఆరుబయట పనిచేసేవారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయ ట తిరిగేవారు గొడుగు వాడాలి. తరచూ నీళ్లు, ఇతర ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ► తెలుపు లేదా లేత వర్ణం కలిగిన పలుచటి కాటన్ దుస్తులు ధరించాలి. ► తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి లేదా రుమాలు చుట్టుకోవాలి. ► ఇంటి వాతావరణం చల్లగా ఉంచుకోవాలి. ఫ్యాను వాడాలి. చల్లని నీటితో స్నానం చేయాలి. ► వేడి లోనికి దిగకుండా ఇంటిపై కప్పులపై వైట్ పెయింట్ వేయించాలి. కూల్ రూఫ్ టెక్నాలజీ, క్రాస్ వెంటిలేషన్, థర్మోకోల్ ఇన్సులేషన్ వంటివి ఎండ వేడిమిని తగ్గిస్తాయి. పిల్లలు, వృద్ధులపై ఎక్కువ ప్రభావం ► మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 3 గంటల మధ్య బయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పనిచేయరాదు. ► నలుపురంగు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు. ► బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు. వీరిపై ఎండ త్వరగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ► శరీరాన్ని డీహైడ్రేట్ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ మానుకుంటే మంచిది. అధిక ప్రోటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే పదార్థాలను తీసుకోవద్దు. ► ఎక్కువ ప్రకాశించే విద్యుత్ బల్బులను వాడకూడదు. అవి అధిక వేడిని విడుదల చేస్తాయి. ► ఎండలో నుంచి వచ్చిన వెంటనే తేనె వంటి తీపి పదార్థాలు తీసుకోకూడదు. ► శీతల పానీయాలు, ఐస్ వంటివి తీసుకుంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బకు గురైతే.. ► వడదెబ్బ తగిలిన వారిని నీడలో, చల్లని ప్రదేశంలో ఉంచాలి. ► మజ్జిగ, గ్లూకోజు నీరు, చిటికెడు ఉప్పు.. చెంచా చక్కెర ఒక గ్లాసులో కలుపుకొని ఇంటిలోనే తయారుచేసిన ఓఆర్ఎస్ ద్రావణం తాగితే వడదెబ్బ నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది. ► శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణ ఉష్ణోగ్రత వచ్చేవరకు తడి గుడ్డతో తుడుస్తూ ఉండాలి. వేడి నీటిలో ముంచిన గుడ్డతో తుడవరాదు. ► ప్రాథమిక చికిత్స అనంతరం సాధారణ స్థితికి రాకుంటే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాలి. -
సిటీలో జనాభాకు మించి ఆధార్ కార్డులు.. ఎందుకో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ఆధార్ నమోదులో హైదరాబాద్ రికార్డు సృష్టించింది. ఇక్కడి స్థానిక జనాభా కంటే ఎక్కువ సంఖ్యలో ఆధార్ కార్డులను జారీ చేసి.. దేశంలోనే టాప్‌లో నిలిచింది. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చినవారు, హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఉన్న విద్యా సంస్థల్లో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు.. ఇలా చాలా మంది ఇక్కడే ఆధార్‌కు నమోదు చేసుకోవడం. దీనికి కారణం. 2021 ఏప్రిల్ 10వ తేదీ నాటికి గ్రేటర్ హైదరాబాద్‌లో ఆధార్ కార్డులు తీసుకున్నవారి సంఖ్య 1.21 కోట్లకు చేరినట్లు ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ)’గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భాగ్యనగరం దేశంలో టాప్‌లో నిలవగా.. ఢిల్లీ, ముంబై నగరాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి. అక్కడ కూడా వలసలు ఎక్కువగా ఉండటమే జనాభా సంఖ్యను మించి ఆధార్ కార్డులు జారీ కావడానికి కారణమని అధికారవర్గాలు చెప్తున్నాయి. ఉపాధికి, చదువుకు కేంద్ర బిందువుగా.. హైదరాబాద్ నగర జనాభా కోటి దాటేసింది. ఉపాధి, విద్యావకాశాలు ఎక్కువగా ఉండటం మన రాష్ట్రంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, ప్రాంతాల వారు సిటీకి వలస వస్తున్నారు. హైదరాబాద్ ఐటీ, హెల్త్, పారిశ్రామిక హబ్‌గా మారింది. స్థిరాస్తి, నిర్మాణ రంగం పుంతలు తొక్కుతున్నాయి. అన్ని ప్రాంతాల వారు నివసించేందుకు అనువైన వాతావరణం, జీవన వ్యయం సాధారణంగా ఉండటం, భాషా సమస్య లేకపోవడం వంటివి మరింత కలిసి వస్తున్నాయి. దీంతో ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, అస్సాం, జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్తాన్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల వారూ వలస వస్తున్నారు. ఇక చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు కూడా ఏళ్లకేళ్లు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఇదే సమయంలో.. పలు రకాల పౌర సేవలు, బ్యాంకింగ్, వ్యక్తిగత గుర్తింపు కోసం ఆధార్ అవసరం ఉండటంతో.. చాలా మంది ఇక్కడే నమోదు చేసుకోవడం మొదలుపెట్టారు. వేరే రాష్ట్రాల్లో అప్పటికే నమోదు చేసుకున్నవారు కూడా ఇక్కడి చిరునామాకు మార్చుకుంటున్నారు. మొత్తంగా హైదరాబాద్ జనాభా కంటే ఆధార్ కార్డుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణమయ్యాయి. జనాభా పెరుగుదల తగ్గింది హైదరాబాద్‌లో ఏటా జనాభా పెరుగుతున్నా.. ఈ పెరుగుదల రేటు మాత్రం ఇటీవలి కాలంలో కాస్త తగ్గింది. 1991 నుంచి 2001 మధ్య జనాభా పెరుగుదల రేటు 28.91% ఉండగా.. 2011 నాటికి 26 శాతానికి, 2017 నాటికి 17 శాతానికి తగ్గింది. 2011 లెక్కల ప్రకారం మహా నగరం జనాభా 74.04 లక్షలు. 2017 అంచనాల ప్రకారం 93.06 లక్షలకు, ప్రస్తుతం కోటీ పది లక్షలదాకా పెరిగినట్టు అంచనా. మాదాపూర్ సైబర్ విల్లేలో శాశ్వత ఆధార్ కేంద్రం యూఐడీఏఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రాంతీయ కార్యాలయాన్ని, మొట్టమొదటి డైరెక్ట్ ఆధార్ సేవా కేంద్రాన్ని హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న రిలయన్స్ సైబర్ విల్లేలో ప్రారంభించారు. ఈ కేంద్రంలో రోజూ వెయ్యి వరకు ఆధార్ నమోదు, అప్డేట్స్ చేస్తారని అధికారులు వెల్లడించారు. యూఐడీఏఐ వెబ్సైట్లో ముందుగా స్లాట్ బుక్ చేసుకుని, నిర్ధారిత తేదీ, సమయానికి కేంద్రానికి రావాలని తెలిపారు. ఇక్కడ వారంలో ఏడు రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవలు అందుతాయని పేర్కొన్నారు. చదవండి: ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే.. ఇదేంటి: హైకోర్టు -
యజమాని ఫొటో, ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరి..
సాక్షి, హైదరాబాద్: ఆస్తుల నమోదు ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. వ్యవసాయేతర ఆస్తులకు కూడా పాస్ పుస్తకాలు (మెరూన్ రంగు) ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ప్రతి ఇంటి సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తోంది. కేవలం ఇళ్లే కాకుండా.. వ్యవసాయ పొలాల వద్ద ఉన్న కట్టడాల వివరాలను సేకరిస్తోంది. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలకు వేర్వేరుగా ధరణి పోర్టళ్లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన సర్కారు.. ఈ దసరా నాడు ఈ పోర్టళ్లను ప్రారంభించాలని ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఆ రోజు నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీళ్లలో.. వ్యవసాయేతర ఆస్తులను సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేయనుంది. ఈ క్రమంలోనే వ్యవసాయేతర ఆస్తుల వివరాలను పకడ్బందీగా సేకరించడమే కాకుండా ధరణి పోర్టల్‌లో అనుసంధానం చేయాలని నిర్ణయించింది. 60 లక్షల కట్టడాలు..! రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,751 గ్రామ పంచాయతీల్లో సుమారు 60 లక్షల కట్టడాలుంటాయని పంచాయతీరాజ్ శాఖ అంచనా వేసింది. ఈ ఆస్తుల వివరాలన్నింటినీ ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ–పంచాయతీ వెబ్సైట్లో పొందుపరిచింది. ఆస్తుల నమోదుకు ముందు.. రివిజన్ రిజిష్టర్‌లో 53.23 లక్షల కట్టడాలున్నట్లు లెక్క తేలగా.. కొత్త కట్టడాలతో కలుపుకొని ఈ సంఖ్య 60 లక్షలకు చేరింది. ఈ మేరకు ఈ–పంచాయతీ పోర్టల్‌లో నిక్షిప్తం చేసిన సమాచారాన్ని మ్యాపింగ్ చేయడంలో భాగంగా పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్తున్నారు. ఈ వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ న్యాప్ (నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్)లో నమోదు చేస్తున్నారు. అయితే, వివరాల నమోదుకు సాంకేతిక సమస్యలు ప్రతిబంధకంగా మారాయి. ఫోన్ సిగ్నల్స్ లేకపోవడం.. ఇంటర్నెట్ సమస్య.. సర్వర్ డౌన్‌తో యాప్‌లో సమాచారం నమోదు చేయడం కార్యదర్శులకు పెద్ద సవాల్‌గా మారింది. దీనికి తోడు గ్రామాల్లోని ప్రజానీకం వ్యవసాయ పనులకు వెళ్లిపోతుండటంతో సమాచార సేకరణపై ప్రభావం చూపుతోంది. కుటుంబ యజమాని ఫొటో, ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరి చేయడం కూడా తలనొప్పిగా తయారైంది. దీంతో సమాచారాన్ని యాప్‌లో అప్లోడ్ చేయడంలో జాప్యం జరుగుతోంది. రోజుకు 70 ఇళ్ల సమాచారాన్ని అప్డేట్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన 30 ఇళ్లు కూడా దాటడం లేదు. ఈ క్రమంలోనే సోమవారం నాటికి 10 లక్షల ఇళ్ల సమాచారాన్ని యాప్‌లో నిక్షిప్తం చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రఘునందన్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. వారం పది రోజుల్లో మొత్తం ఇళ్ల సమాచార సేకరణ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. తొలుత ఆస్తుల నమోదులో కొంత ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించామని, నమోదు ప్రక్రియ గాడిలో పడిందని అభిప్రాయపడ్డారు. (చదవండి: ఆస్తుల గణనకు సాంకేతిక సమస్యలు) -
రాష్ట్రంలో ఓటర్లు.. 2,61,36,776
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో 2,61,36,776 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,32,67,626 మంది పురుషులు, 1,28,66,712 మంది మహిళలు, 2,438 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. స్త్రీ, పురుష ఓటర్ల సంఖ్య మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మేరకు 2018కి సంబంధించిన రెండో ఓటర్ల జాబితా సవరణ ముసాయిదాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం సోమవారం ప్రకటించింది. 2018, జనవరిలో ప్రకటించిన ఓటర్ల జాబితా తొలి సవరణ ప్రకారం రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,53,27,785 కాగా, అనంతర కాలంలో 9,45,955 మంది కొత్త ఓటర్లకు చోటు కల్పించడంతో పాటు వివిధ కారణాలతో 1,36,964 మంది ఓటర్లను తొలగించారు. దీంతో రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,61,36,776 మందికి చేరుకుంది. రాష్ట్ర శాసనసభ రద్దయిన నేపథ్యంలో ముందస్తు ఎన్నికల నిర్వహణకు ఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు ఈసీ ప్రత్యేకంగా రెండో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టర్లు ప్రకటించారు. ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమం షెడ్యూల్ ప్రకారం.. కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణతో పాటు జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 10 నుంచి ఈ నెల 25 వరకు స్వీకరిస్తారు. వచ్చే నెల 4లోగా దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరిస్తారు. 8న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2018, జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వ్యక్తులు ఓటర్లుగా నమోదు కావడానికి దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్త యువ ఓటర్లు 2 లక్షలు... తాజాగా ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 18–19 ఏళ్ల మధ్య వయసున్న 2,20,674 మంది కొత్త యువ ఓటర్లు త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1,34,329 మంది పురుషులు, 86,313 మంది మహిళలు, 32 మంది ఇతరులున్నారు. 19 ఏళ్లకు పైబడిన మొత్తం ఓటర్లు 2,59,16,102 మంది.. కాగా అందులో 1,31,33,397 మంది పురుషులు, 1,27,80,399 మంది మహిళలు, 2,406 మంది ఇతరులున్నారు. హైదరాబాద్ టాప్.. వనపర్తి లాస్ట్ రాష్ట్రంలో అత్యధికంగా 38,61,009 మంది ఓటర్లు హైదరాబాద్ జిల్లాలో ఉండగా, అ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 26,56,013 మంది, మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లాలో 19,87,270 మంది ఓటర్లు, నల్లగొండ జిల్లాలో 12,23,554 మంది ఓటర్లున్నారు. అత్యల్పంగా వనపర్తి జిల్లాలో 2,09,340 మంది ఓటర్లు ఉండగా, ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో 3,52,666 మంది, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 3,55,907 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,66,701 మంది ఓటర్లున్నారు. -
ఇక అన్ని మీసేవ కేంద్రాల్లో ఆధార్ నమోదు
కర్నూలు(అగ్రికల్చర్): ఇప్పటి వరకు కేవలం 72 మీసేవ కేంద్రాల్లో మాత్రమే ఆధార్ నమోదు కార్యక్రమం జరుగుతోంది. అన్ని ప్రాంతాల్లో ఆధార్ నమోదు లేకపోవడం తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ నమోదును మరింత అందుబాటులోకి తీసుకురావాలని జిల్లాలో ఉన్న అన్ని మీసేవ కేంద్రాల్లో ఆధార్ నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు మీసేవ కేంద్రాల డైరక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయని జిల్లా మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి వెంకటలక్ష్మి తెలిపారు. జిల్లాలో మొత్తం 395 మీసేవ కేంద్రాలు ఉన్నాయి.ఇందులో 72 కేంద్రాల్లో ఆధార్ నమోదు సదుపాయం ఉండగా మిగిలిన వాటికి ఈ నెల 22లోగా ఆధార్ కిట్లు సరఫరా చేస్తారు. ఈ మేరకు ఏపీ ఆన్లైన్, కార్వే, సీఎంఎస్‌లను ఆదేశించినట్లు మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి వెంకటలక్ష్మి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసే మీసేవ కేంద్రాలోనూ ఆధార్ నమోదు ఉంటుందని ఆమె విలేకర్లకు వెల్లడించారు.