సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరంలో బడి ఈడు పిల్లలందరినీ బడుల్లో చేర్పించాలని విద్యా శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. నూరు శాతం విద్యార్థుల నమోదు కోసం ఐదువారాల కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించడం, ఒక తరగతి నుంచి మరో తరగతిలో పిల్లలు చేరేలా చర్యలు తీసుకోవడం, పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాక తదుపరి విద్యాభ్యాసం కోసం చేరికల డేటాను సేకరించడం, ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌లో అసలు బడిలో చేరని, డ్రాపవుట్, బాల కార్మికులను గుర్తించడం, వీరి కోసం ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ వంటివి నిర్వహించాలని మార్గదర్శకాలు జారీ చేసింది.
నూరు శాతం విద్యార్థుల నమోదు కోసం ఈ నెల 12 వరకు డిప్యూటీ ఈవోలు, సెక్టోరల్ అధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో డీఈవోలు సమావేశాలు నిర్వహించాలి. అలాగే ఈ నెల 15 నుంచి 19 వరకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా సంబంధిత పాఠశాలలు పిల్లల గణన చేపట్టాలి. ఉపాధ్యాయుల సహాయంతో బడి ఈడు పిల్లల జనాభాను లెక్కించి రిజిస్టర్‌లో నమోదు చేయాలి. ఇందుకు అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ, వార్డు వలంటీర్లు, విద్య–సంక్షేమ సహాయకులు, ఏఎన్‌ఎంలు సహకరిస్తారు. బడి ఈడు పిల్లల జాబితాను వయసుల వారీగా, బాలబాలికలవారీగా తయారుచేయాలి. ఈ డేటాను సంబంధిత గ్రామ, స్కూల్, మండల స్థాయిల్లో ఉంచాలి. మండల స్థాయి తుది జాబితాను సంబంధిత ఎంఈవోకు, డీఈవోకు సమర్పించాలి.
పథకాల ప్రయోజనాలను వివరించాలి..
పేరెంట్–టీచర్స్, సర్పంచ్, వార్డు సభ్యులు, వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సంబంధిత ప్రజాప్రతినిధులు సమావేశాలను నిర్వహించాలి. వీటిలో బడి ఈడు పిల్లల జాబితాను ప్రదర్శించాలి. ఆయా స్కూల్స్‌లో విజయాలతోపాటు మన బడి నాడు–నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మఒడి తదితర పథకాల వల్ల కలిగే లబ్ధి గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించాలి. ఇందుకు సంబంధించిన పోస్టర్లను, బ్యానర్లను గ్రామ కేంద్రాల్లో ప్రదర్శించాలి. పిల్లల నమోదు కోసం ర్యాలీలు నిర్వహించాలి.
సమీపంలోని పాఠశాలల్లో నమోదు చేయడానికి ఐదేళ్లు, ఆ పై వయసు గల పిల్లలను, ఫౌండేషన్ స్కూళ్లలో 2వ తరగతి పూర్తి చేసిన పిల్లలను గుర్తించాలి. వీరిని సమీపంలోని పాఠశాలల్లో మూడో తరగతిలో చేర్పించాలి. అలాగే ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసిన పిల్లలను గుర్తించి సమీపంలోని పూర్వ ఉన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతిలో నమోదు చేయించాలి. ప్రీ హైస్కూల్స్‌లో 7వ తరగతి, 8వ తరగతి పూర్తి చేసిన పిల్లలను గుర్తించి సమీపంలోని హైస్కూల్స్‌లో 9వ తరగతిలో చేర్పించాలి. ఉన్నత విద్యలో ప్రవేశం పొందడానికి విద్యార్థులకు రికార్డ్ షీట్స్, బదిలీ సర్టిఫికెట్ జారీ చేయాలి. ప్రభుత్వ లేదా ఇతర సంస్థల్లో వారి ప్రవేశాన్ని నిర్ధారించుకోవాలి.
బాల కార్మికులను గుర్తించాలి..
ఈ నెల 22 నుంచి 26 వరకు పదో తరగతిలో ఉత్తీర్ణులైనవారు తదుపరి విద్యా సంస్థల్లో చేరుతున్నారో, లేదో తెలుసుకోవాలి. విద్యా సంవత్సరంలో డ్రాపవుట్ అడ్మిషన్ల జాబితాను తయారు చేయాలి. మే 29 నుంచి జూన్ 2 వరకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌లో భాగంగా అసలు ఎప్పుడూ బడిలో చేరని, డ్రాపవుట్స్, బాల కార్మికుల జాబితాలను గుర్తించాలి. వారి ఎన్‌రోల్‌మెంట్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి. ఆ జాబితాలను సంబంధిత ఎంఈవోకు సమర్పించాలి.
పాఠశాల సంసిద్ధత
జూన్ 5 నుంచి 9 వరకు ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ సమయంలో ప్రవేశ ప్రక్రియను ప్రారంభించాలి. పాఠశాలను పునఃప్రారంభించే ముందు దానిలో భద్రతా చర్యలను పరిశీలించాలి. పాఠశాల ఆవరణ, రూఫ్ టాప్స్, క్రీడా మైదానాలు, ఆర్వో ప్లాంట్లు, తాగునీటి సరఫరా ట్యాంకులు, కిచెన్ షెడ్, పాత్రలు, టాయిలెట్లను శుభ్రం చేయాలి. నీటి సరఫరా ఉండేలా చూడాలి. చిన్న మరమ్మతులు ఏవైనా ఉంటే వాటిని ముందుగానే పూర్తి చేయాలి.
కిచెన్ షెడ్‌లో గడువు ముగిసిన స్టాక్ ఏదైనా ఉంటే వాటిని పారేయాలి. విద్యుత్ మరమ్మతులు ఏవైనా ఉంటే చేయించాలి. తగిన సంఖ్యలో జగనన్న విద్యా కానుక కిట్‌లు ఉన్నాయో, లేదో నిర్ధారించుకోవాలి. బియ్యం, గుడ్లు, చిక్కీలు, రాగి మాల్ట్, రికార్డులు, రిజిస్టర్లు, ఇతర స్టేషినరీ లభ్యతను చూసుకోవాలి. రాబోయే విద్యా కార్యకలాపాల నిర్వహణ కోసం సంస్థాగత ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి.
చదవండి: సందడి ముగిసింది.. తెల్లపులి కుమారి ఇకలేదు..
Comments
Please login to add a commentAdd a comment