న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో)లో 15.62 లక్షల మంది సభ్యులు డిసెంబర్ నెలలో చేరారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే సభ్యుల చేరికలో 12 శాతం వృద్ధి నమోదైంది. అదే 2022 డిసెంబర్ నెల చేరికలతో పోలిస్తే 4.62 శాతం వృద్ధి కనిపించింది. ఉపాధి అవకాశాల పెరుగుదల, ఉద్యోగుల ప్రయోజనాలపై పెరుగుతున్న అవగాహన, మరిన్ని సంస్థలకు చేరువ అయ్యేందుకు ఈపీఎఫ్‌వో చేపడుతున్న కార్యక్రమాలు సభ్యుల పెరుగుదలకు సాయపడుతున్నట్టు కేంద్ర కారి్మక శాఖ ప్రకటించింది.
8.41 లక్షల మంది ఈపీఎఫ్‌వో కింద మొదటిసారి నమోదు అయ్యారు. అంటే తొలిసారి వీరు సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తోంది. 2023 నవంబర్‌తో పోలిస్తే కొత్త సభ్యుల పెరుగుదల 14 శాతంగా ఉంది. పైగా డిసెంబర్ నెలకు సంబంధించిన నికర కొత్త సభ్యుల్లో 57 శాతం మంది 18–25 వయసులోని వారే కావడం గమనార్హం. మిగిలిన సభ్యులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారడం ద్వారా తమ ఈపీఎఫ్ ఖాతాను బదిలీ చేసుకున్నారు.
2.09 లక్షల మంది మహిళలు..
8.41 లక్షల కొత్త సభ్యుల్లో 2.09 లక్షల మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్ నెలతో పోలిస్తే 7.57 శాతం అధికం. రాష్ట్రాల వారీగా చూస్తే.. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది చేరారు. డిసెంబర్ నెలకు సంబంధించి కొత్త చేరికల్లో 58.33 శాతం ఈ రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు. ఇందులో మహారాష్ట్ర వాటా 21.63 శాతంగా ఉంది. ఐరన్ అండ్ స్టీల్, బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్, జనరల్ ఇన్సూరెన్స్ రంగాలు ఎక్కువ మందికి అవకాశం కల్పించాయి.
Comments
Please login to add a commentAdd a comment