సీబీఎస్‌ఈ ఆకస్మిక తనిఖీల్లో వెల్లడి
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) అధికారుల ఆకస్మిక తనిఖీల్లో ‘డమ్మీ’ విద్యార్థుల బాగోతం బయటపడింది. ఆయా సీబీఎస్‌ఈ అఫిలియేటెడ్ పాఠశాలల్లో వాస్తవ విద్యార్థుల సంఖ్యకు మించి ఎన్‌రోల్‌మెంట్ ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీ, బెంగళూరు, వారణాసి, బిహార్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలోని మొత్తం 29 పాఠశాలల్లో ఇలాంటి దందా జరుగుతున్నట్లు తేల్చారు. బాధిత పాఠశాలలకు నోటీసులు జారీ చేశారు. మౌలిక సదుపాయాల లేమి వంటి ఇతర నిబంధనల తీవ్ర ఉల్లంఘనకు పాల్పడిన ఈ పాఠశాలల యాజమాన్యాలపై న్యాయపరంగానూ చర్యలు తీసుకోనున్నారు.
బుధ, గురువారాల్లో 29 బృందాలు ఈ మేరకు తనిఖీలు చేపట్టాయని సీబీఎస్‌ఈ కార్యదర్శి హిమాన్షు గుప్తా చెప్పారు. అవకతవకలను గుర్తించిన స్కూళ్లలో దేశ రాజధాని ఢిల్లీలోనివే 18 కాగా, వారణాసిలో మూడు, బెంగళూరు, పట్నా, అహ్మదాబాద్, బిలాస్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లలో రెండేసి చొప్పున ఉన్నాయన్నారు. ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రిపేరయ్యే విద్యార్థుల్లో కొందరు డమ్మీ స్కూళ్లలో ప్రవేశాలు పొంది, పరీక్షలకు సిద్ధమయ్యేందుకే పూర్తి సమయం కేటాయిస్తున్నారు.
తరగతులకు హాజరు కాకుండా వీరు నేరుగా బోర్డ్ పరీక్షలు రాసేలా ఆయా స్కూళ్లు వీరికి వెసులుబాటు కల్పిస్తున్నాయి. ఏయే రాష్ట్రాల్లో మెడికల్ లేదా ఇంజినీరింగ్ సీట్లు పొందేందుకు అవకాశం ఉంటుందో చూసుకుని మరీ సంబంధిత ప్రాంతాల్లోని డమ్మీ స్కూళ్లలో ప్రవేశాలు తీసుకుంటున్నారు.
చదవండి: కొబ్బరినూనెపై ‘పన్ను’ వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు
Comments
Please login to add a commentAdd a comment