అభివృద్ధి.. అప్పులు.. ఆరోపణలు పయనం పదేళ్లు | Development of Telangana in 10 years | Sakshi
Sakshi News home page

అభివృద్ధి.. అప్పులు.. ఆరోపణలు పయనం పదేళ్లు

Published Sat, Jun 1 2024 5:25 AM | Last Updated on Sat, Jun 1 2024 5:25 AM

Development of Telangana in 10 years

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కల నెరవేరి దశాబ్ద కాలం గడిచింది. అరవై ఏళ్ల పట్టుదలకు, పోరాటాలకు ప్రతిరూపంగా.. ముక్కోటి మంది మనోభావాలకు నిలువుటద్దంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. ఈ పదేళ్లలో బుడిబుడి అడుగులనుంచి సాధికారత వైపు పయనించింది. బాలారిష్టాలను దాటుకుని ప్రగతి నమూనాను ఆవిష్కరించే దిశగా ముందడుగు వేసింది. అనతి కాలంలోనే అగ్రరాష్ట్రాలతో పోటీపడే స్థాయికి ఎదిగింది. అప్పులు పెరుగుతున్నాయనే ఆందోళన ఉన్నా.. కొన్ని అంశాల్లో వివాదాలు, ఆరోపణలు ఉన్నా.. ప్రగతిపథంలో దూసుకెళ్లింది. తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లు నిండుతున్న నేపథ్యంలో.. ఇన్నేళ్లలో మారిన ముఖచిత్రం, కీలక రంగాల్లో జరిగిన పరిణామాలపై ప్రత్యేక కథనం..  – సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌

వెలుగు.. చీకట్లు
తెలంగాణ ఏర్పడితే చీకట్లో బతకాల్సిందేనన్న కొందరు నేతల విమర్శలను తిప్పికొట్టేలా రాష్ట్ర విద్యుత్‌ రంగం ఎదిగింది. సంప్రదాయేతర విద్యుత్‌కు పెద్దపీట వేయడంతో వేల మెగావాట్ల సౌర విద్యుత్, పవన విద్యుత్‌ అందుబాటులోకి వచ్చింది. అలాగే భద్రాద్రి, యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే తెలంగాణ విద్యుత్‌ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశలో పొరపాట్లు జరిగాయన్న విమర్శలు, ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. మరోవైపు సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనూ ఇలాంటి విమర్శలు వచ్చాయి. అదే సమయంలో అతి తక్కువ కాలంలో ప్రాజెక్టులు పూర్తయి నీటిని అందించారన్న అభిప్రా­యాలూ ఉన్నాయి.

వివాదాల మధ్య తనదైన ముద్ర
కీలక రంగాల్లోనే కాదు.. మరెన్నో అంశాల్లో తెలంగాణ తనదైన ముద్రను వేసింది. 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహం, కొత్త సచివాలయ నిర్మాణం, గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాలు, పోడు పట్టాల పంపిణీ, పామాయిల్‌ సాగుకు ప్రోత్సాహం, మిషన్‌ భగీరథ, సమీకృత జిల్లా కలెక్టరేట్లు, నూతన జోనల్‌ వ్యవస్థ, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్, భరోసా కేంద్రాలు, మోడల్‌ శ్మశాన వాటికలు, సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా, పల్లె–పట్టణ ప్రగతి, యాదాద్రి ఆలయ అభివృద్ధి, బతుకమ్మ చీరలు, మెట్రో రైలు, హరితహారం లాంటి కార్యక్రమాలతో వేగంగా ముందుకు కదిలింది.  రాజకీయాలు, వివాదాలు, విమర్శలు, ఆరోపణలు ఎలా ఉన్నా.. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ముందుకెళ్లాలని... సామాజిక, ఆర్థిక అసమానతలు లేని ‘సమున్నత తెలంగాణ’ అతి త్వరలోనే ఆవిష్కృతం కావాలని ఆకాంక్షిద్దాం.

అత్యధిక గురుకులాలు
తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధన మొదలైంది. దేశంలోనే అత్యధిక గురుకులాలున్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. అన్ని రకాల విద్యా సంస్థలు, హాస్టళ్లకు సన్న బియ్యం, ఉచితంగా పుస్తకాలు, యూనిఫారాలు అందుతున్నాయి. మన ఊరు– మన బడి వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ విద్య పట్ల ప్రజలను ఆకర్షితులను చేసే ప్రయత్నాలు జరిగాయి. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుదీకరణ, తాగునీరు, ఫర్నీచర్, కాంపౌండ్‌ వాల్స్, కిచెన్‌షెడ్లు తదితర మౌలిక సదుపాయాల కల్పన కోసం గత పదేళ్లలో మంచి ప్రయత్నమే జరిగింది.

‘ఐటీ’లో దాటేసి..
తెలంగాణ పారిశ్రామిక ప్రగతిలో, అందులోనూ ప్రధానంగా ఐటీ రంగంలో వేగంగా అభివృద్ధి జరిగింది. దేశంలో సిలికాన్‌ వ్యాలీగా పేరున్న బెంగళూరును దాటేసి.. హైదరాబాద్‌ ఐటీ రంగం ముందుకు వెళ్తోంది. ఐటీ ఉద్యోగాల కల్పనలో బెంగళూరును దాటిపోయిందని రికార్డులు చెప్తున్నాయి. ఐటీ ఎగుమతులకు సంబంధించి 2030 సంవత్సరానికి పెట్టుకున్న లక్ష్యాలు కూడా ఇప్పటికే దాటిపోవడం గమనార్హం. ఎన్నో అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌ కేంద్రంగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. మరిన్ని రానున్నాయి.

‘ఆసరా’కు యత్నాలు
తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచీ ఆపన్నులకు మరింత ‘ఆసరా’ అందుతోంది. సంక్షేమ కార్యక్రమాల అమలు పెరిగింది. దళితబంధు, బీసీ బంధు వంటి పథకాలు పెద్దగా విజయవంతం కాకపోయినా.. మిగతా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణ ఖజానా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తోంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు.. ఇలా అవసరమున్న వారందరికీ ప్రతి నెలా ఠంచన్‌గా పింఛన్‌ అందుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 12 వర్గాలకు ఆసరా పథకం కింద పింఛన్లు అందుతున్నాయి.

ఇవి వారి ఆర్థిక అవసరాలకే కాకుండా సామాజిక భద్రతకు ఆలంబనగా నిలుస్తున్నాయి. ఆసరా పింఛన్ల కోసం ఏటా తెలంగాణ ఖజానా నుంచి దాదాపు రూ.12 వేల కోట్ల వరకు ఖర్చవుతున్నాయి. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ వంటి పథకాలతో పేద వర్గాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు ఇప్పటివరకు రూ.12వేల కోట్ల వరకు అందజేశారు.

కులాంతర వివాహాలకు ప్రోత్సహకాలు, అంబేడ్కర్‌ భవనాలు, హాస్టళ్లు, గురుకులాలు, ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌లు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాయితీలు, మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు, స్టడీ సర్కిళ్లు, రెసిడెన్షియల్‌ జూనియర్, డిగ్రీ కళాశాలలు, అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాలు, అధికారికంగా ఆదివాసీల పండుగలు, గొల్లకుర్మలకు సబ్సిడీ గొర్రెలు, ఉచిత చేప పిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ, నేతన్నలకు బీమా, సెలూన్లకు ఉచిత విద్యుత్, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుకలు, వేద పండితులకు గౌరవ భృతి, మౌజమ్, ఇమాంలకు గౌరవ వేతనం.. ఇలా అనేక పథకాలను అమలు చేస్తూ సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది.

2 కోట్ల ఎకరాలకు సాగు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కనిపించిన అతి పెద్ద మార్పు భారీగా ధాన్యం ఉత్పత్తి. 2014లో తెలంగాణలో 99.33 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తికాగా.. పదేళ్ల తర్వాత అది 2.48 కోట్ల టన్నులకు చేరింది రాష్ట్రంలో మొత్తం సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాల నుంచి.. 2022–23 నాటికి 2.38 కోట్ల ఎకరాలకు చేరింది. వరి సాగు విస్తీర్ణం 49.63 లక్షల ఎకరాల నుంచి 97.97 లక్షల ఎకరాలకు పెరిగింది. గతంలో నిర్మించిన ప్రాజెక్టులు, మిషన్‌ కాకతీయ వంటి పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు 15లక్షల ఎకరాల్లో పెరిగిన భూగర్భజలాలు వంటివి ఇందుకు దోహదపడ్డాయని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. దేశంలో తెలంగాణ మార్క్‌ను చూపిన రైతుబంధు పథకం.. రైతులు పంటలు వేసేందుకు పెట్టుబడి సాయంగా ఇతోధికంగా దోహదపడుతోంది.

ఇప్పటివరకు ఎకరాకు ఏటా రూ.10 వేలు ఇస్తుండగా.. కొత్త ప్రభుత్వం దాన్ని రూ.15 వేలకు పెంచుతామని ప్రకటించింది. ఇక వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు రుణ మాఫీ, రైతు వేదికలు, సమీకృత మార్కెట్ల నిర్మాణం, గోదాముల సామర్థ్యం పెంపు, ధాన్యం సేకరణ వంటివి కూడా వ్యవసాయానికి అండగా నిలిచాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన, భూముల రిజిస్ట్రేషన్లలో తెచ్చిన మార్పులు, భూరికార్డుల నిర్వహణ కోసం అమల్లోకి తెచ్చిన ధరణి పోర్టల్‌ పలు వివాదాలకు కారణమైనా.. వ్యవసాయ, రెవెన్యూ వర్గాలను అనుసంధానం చేసే దిశలో సాగాయని నిపుణులు అంటున్నారు.

కంటి వెలుగులు.. ఫ్రీ డయాలసిస్‌లు
తెలంగాణ ఏర్పాటయ్యాక వైద్య రంగం అభివృద్ధి వైపు పయనించింది. పల్లె దవాఖానాలు, పట్టణ దవాఖానాల ఏర్పాటుతో వైద్యం పేదల ముంగిటకు చేరింది. కంటి వెలుగు పథకం పేదల చూపునకు అండగా నిలిచింది. తెలంగాణ డయాగ్నస్టిక్స్‌ పేరుతో పేదలకు ఉచితంగా రక్త పరీక్షల కార్యక్రమం వివిధ వ్యాధుల బాధితులను గుర్తించింది. నిమ్స్‌ విస్తరణ, టిమ్స్‌ ఆస్పత్రుల్లో 4 వేల పడకలు, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాలో 2 వేల పడకలు, కొత్త ఏరియా, జిల్లా ఆస్పత్రుల ఏర్పాటు, విస్తరణ, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల ఆధునీకరణ వంటి కార్యక్రమాలు రాష్ట్ర వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడ్డాయి.

తెలంగాణ ఏర్పాటయ్యాక వచ్చిన విప్లవాత్మక మార్పుల్లో ఒకటి ఉచిత డయాలసిస్‌ కేంద్రాల ఏర్పాటు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం మూడు డయాలసిస్‌ కేంద్రాలుండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 102కు చేరింది. ఇక పెద్ద సంఖ్యలో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు కూడా గత పదేళ్లలో అభివృద్ధికి సూచిక. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఐదే ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలు ఉండగా.. ఇప్పుడు తెలంగాణలోని 33 జిల్లాల్లో కలిపి 34 వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. 2014కు ముందు రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 2,850 ఎంబీబీఎస్‌ సీట్లు ఉంటే.. ఇప్పుడు 8,515 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement