![Another Covid-like pandemic could hit the world within 10 Years - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/15/PANDEMIC.jpg.webp?itok=i_xndyaW)
లండన్: కోవిడ్–19.. ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించిన మహమ్మారి. లక్షలాది మందిని పొట్టనపెట్టుకుంది. నియంత్రణ చర్యలతోపాటు ఔషధాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ చాలా దేశాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. మరో పదేళ్లలో కోవిడ్–19 లాంటి భీకరమైన మహమ్మారి పంజా విసిరే అవకాశాలు ఉన్నాయని లండన్‌లోని ప్రెడిక్టివ్ హెల్త్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ సంస్థ ‘ఎయిర్‌ఫినిటీ’ వెల్లడించింది.
వచ్చే పదేళ్లలో కొత్త మహమ్మారి తలెత్తడానికి 27.5 శాతం అవకాశాలు ఉన్నట్లు స్పష్టంచేసింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్‌లతోపాటు వాతావరణ మార్పులు, జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల ఆధారంగా ఈ సంస్థ అంచనాలు వెలువరిస్తూ ఉంటుంది. తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తించే కొత్త వైరస్ యూకేలో ఒక్కరోజులో 15,000 మందిని అంతం చేయగలదని తెలియజేసింది.
ఎవియన్ ఫ్లూ తరహాలోనే ఇది మార్పులు చెందుతూ ఉంటుందని పేర్కొంది. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ది చేసుకోవడం, నియంత్రణ చర్యలను వేగవంతం చేయడం, 100 రోజుల్లో వ్యాక్సిన్లు అభివృద్ధి చేసుకోవడం ద్వారా కొత్త వైరస్ ముప్పు 27.5 శాతం నుంచి క్రమంగా 8.1 శాతానికి తగ్గిపోతుందని అభిప్రాయపడింది. ప్రపంచవ్యాప్తంగా మహమ్మారులను ఎదుర్కొనేందుకు అవసరమైన సన్నద్ధత అధ్వాన్నంగా ఉందని, ఈ పరిస్థితి చాలా మెరుగుపడాలని ఎయిర్‌ఫినిటీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు రాస్మస్ బెచ్ హన్‌సెన్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment