అమెరికా. ఓ కలల ప్రపంచం. ప్రపంచవ్యాపంగా ఎందరికో స్వర్గధామం. ఎలాగైనా అక్కడ స్థిరపడాలని కలలు కనేవారు, ఎలాగోలా అక్కడికి వలస పోయేవారు కోకొల్లలు. కానీ కొన్నేళ్లుగా అమెరికన్లే భారీ సంఖ్యలో దేశం వీడుతున్నారు! ఎక్కడైతే ఆనందంగా జీవించవచ్చా అని జల్లెడ పట్టి మరీ నచ్చిన దేశానికి వలస పోతున్నారు!! ఈ కొత్త పోకడకు కారణాలేమిటి...?
అమెరికన్లు, ముఖ్యంగా సంపన్నులు కొన్నే ళ్లుగా దేశం వీడుతున్నారు. ఇలా విదేశాల బాట పట్టే పోకడ 2019 నుంచి అమెరికాలో బాగా ఊపందుకుంది. ఎలాగోలా ఏదో ఒక దేశ పౌరసత్వం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికన్ల సంఖ్య గత మూడేళ్లలో ఏకంగా 337 శాతం పెరిగిందని పలు దేశాల పౌరసత్వానికి సంబంధించి సలహాలు, సదుపాయాలు కల్పించే హెన్లే–పార్ట్‌నర్స్ సంస్థ వెల్లడించింది. ఇందుకు వీరంతా ప్రధానంగా సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్‌మెంట్ (సీబీఐ) పథకాన్ని దగ్గరి దారిగా ఎంచుకుంటు న్నారు. సీబీఐ ద్వారా తమ దగ్గర భారీగా పెట్టుబ డులు పెట్టేవారికి పౌరసత్వానికి, స్థిర నివాసానికి పలు దేశాలు అవకాశం కల్పిస్తున్నాయి.
కారణాలు నాలుగు
అమెరికన్లలో ఈ పోకడకు నాలుగు ‘సి’లు ప్రధాన కారణాలని హెన్లే–పార్ట్‌నర్స్‌కు చెందిన డొమినిక్ హొలెక్ చెబుతున్నారు. అవి కోవిడ్, క్లైమేట్ చేంజ్, క్రిప్టో కరెన్సీ–పన్నులు, కన్‌ఫ్టిక్ట్ (కల్లోల పరిస్థితులు). కోవిడ్ లాక్‌డౌన్, ప్రయాణాలపై ఆంక్షలు అమెరికన్లను ఉక్కిరిబిక్కిరి చేశాయి. యూరప్‌లోని చాలా దేశాలకు అమెరికా పాస్‌పోర్టుతో నేరుగా వెళ్లడం వీలు పడదు. దాంతో చాలామంది అమెరికన్లు యూరప్ దేశాల పౌరసత్వం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక విచ్చలవిడిగా పెరుగుతున్న భూతాపంలో ప్రధాన వాటా అమెరికా పారిశ్రామిక రంగానిదే. దాంతో అక్కడ చోటుచేసుకుంటున్న వాతావరణ విపరిణామాలు అమెరికన్లను ఆందోళన పరుస్తున్నాయి.
మూడేళ్ల క్రితం చెక్ రిపబ్లిక్‌కు వలస వెళ్లిన ది సావీ రిటైరీ అనే అమెరికా పత్రిక ఎడిటర్ జెఫ్ డి ఒప్‌డైకి అదే చెబుతున్నారు. ‘‘అమెరికాలో వాతావరణం నానాటికీ బాగా కలుషితమవుతోంది. ప్రశాంతంగా గడపాలనుకునే నేను అక్కడ ఎంతమాత్రమూ ఇమడలేనని తేలిపోయింది’’ అంటారాయన. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టిన వారు, పెరిగిపోతున్న పన్నుల, ధరల భారాన్ని తప్పించుకోవాలనుకునే అమెరికన్లు కూడా మరో ఆలోచన లేకుండా వలస బాట పడుతున్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, కల్లోల స్థితి, ట్రంప్ హయాం నుంచి పెచ్చరిల్లిన జాతి విద్వేషాలు కూడా అమెరికన్లను బాగా భయపెడుతున్నాయి.
మనోళ్లు కూడా...
గోల్డెన్ వీసాల కోసం ప్రయత్నిస్తున్న ధనిక భారతీయుల సంఖ్యా తక్కువేమీ కాదు. 2014 నుంచి 23 వేల మంది ఇలా రెండో పాస్‌పోర్ట్ పొందినట్టు మోర్గాన్ స్టాన్లీ నివేదిక చెబుతోంది. 2020లోనే ఐదు వేల మంది భారతీయులు మరో దేశ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్టు తేల్చింది. మనోళ్లు ఎక్కువగా కరేబియన్ దేశం సెయింట్ కిట్స్‌పై ఆసక్తి చూపుతున్నారని సీఎస్ గ్లోబల్ పార్ట్‌నర్స్ డైరెక్టర్ పాల్‌సింగ్ తెలిపారు.
4 కోట్ల వలసలు!
గత మూడున్నరేళ్లలో కనీసం 4 కోట్ల మంది అమెరికన్లు వలస బాట పట్టి ఉంటారని అంచనా. గూగుల్ మాజీ సీఈఓ ఎరిక్ షిమిట్ వంటివారు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఆయన 2020లో యూరప్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా రు. వలసల కోసం చాలామంది గోల్డెన్ పాస్‌పోర్ట్, గోల్డెన్ వీసాగా పిలిచే సీబీఐనే నమ్ముకుంటు న్నారు. దీన్ని పొందడానికి లక్ష నుంచి 95 లక్షల డాలర్ల దాకా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. గోల్డెన్ పాస్‌పోర్టుకు ప్రయత్నిస్తున్న అమెరికన్లలో చాలామంది పోర్చుగల్ వైపు చూస్తున్నారు. ఆ దేశ పౌరసత్వముంటే 26 యూరప్ దేశాల్లో వీసా లేకుండా ప్రవేశించవచ్చు. రెండు లక్షల డాలర్ల పెట్టబడులు పెడితే ఐదేళ్లు నివాసముండవచ్చు. తర్వాత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. న్యూజిలాండ్, మాల్టా, ఆస్ట్రియా, సెయింట్ కిట్స్, ఆంటిగ్వా అండ్ బార్బుడా పౌరసత్వాలకూ అమెరికన్లలో బాగా డిమాండ్ ఉంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment