
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తాను నెగ్గితే అమెరికాలో ఉంటున్న 1.1 కోట్ల మంది వలసదారులకి అమెరికా పౌరసత్వం ఇస్తానని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ హామీ ఇచ్చారు. కరోనా సంక్షోభంపై పోరాటం, ఆర్థిక వ్యవస్థ పునఃనిర్మాణం, ప్రపంచవ్యాప్తంగా అమెరికా నాయకత్వం పునరుద్ధరణతో పాటుగా వలసదారుల సమస్యలు తన ఎజెండాలో అగ్రభాగాన ఉంటాయని చెప్పారు. వాషింగ్టన్‌లో బుధవారం నిధుల సేకరణ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడారు.
‘వలస సంక్షోభాన్ని మేము ఎదుర్కోవాల్సి ఉంది. నేను అధికారంలోకి వస్తే ఇమిగ్రేషన్ బిల్లుని ప్రతినిధుల సభ, సెనేట్‌కి పంపిస్తాను. దాని ద్వారా 1.1 కోట్ల మందికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది’అని బైడెన్ చెప్పారు. అక్రమ మార్గాల్లో వచ్చిన వారందరూ అమెరికాలో తిష్ట వేశారని, వారిని దేశం నుంచి వెంటనే తరిమేయాలని అధ్యక్షుడు ట్రంప్ అంటూ ఉంటే వలస విధానంలో దానికి విరుద్ధమైన వైఖరిలో బైడెన్ మాట్లాడారు. ట్రంప్ గత నాలుగేళ్లలో తన విధానాల ద్వారా అమెరికాలో వివిధ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారని, తనకు అమెరికా ప్రజలు అధికారాన్ని ఇస్తే అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టాల్సి ఉంటుందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment